బాలుడిని విక్రయించేందుకే కిడ్నాప్‌

ABN , First Publish Date - 2021-03-01T05:46:53+05:30 IST

నంబూరు శివారు యానాదికాలనీలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌ కేసులో మిస్టరీ వీడింది. విజయవాడకు చెందిన ఓ ముఠా బాలుడిని కిడ్నాప్‌ చేసినట్టు తేలింది.

బాలుడిని విక్రయించేందుకే కిడ్నాప్‌
వివరాలు వెల్లడిస్తున్న డీఐజీ త్రివిక్రమ వర్మ, అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, పట్టుబడిన కిడ్నాప్‌ ముఠా

ఆరుగురు నిందితుల అరెస్టు


గుంటూరు, ఫిబ్రవరి 28: నంబూరు శివారు యానాదికాలనీలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌ కేసులో మిస్టరీ వీడింది. విజయవాడకు చెందిన ఓ ముఠా బాలుడిని కిడ్నాప్‌ చేసినట్టు తేలింది. బాలుడిని విక్రయించటం కోసమే ఈ ముఠా కిడ్నాప్‌కు పాల్పడింది. ఆదివారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ, అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. డీఐజీ కథనం మేరకు..

 విజయవాడ వాంబే కాలనీకి చెందిన అనిశెట్టి సువర్ణ, కడపకు చెందిన వరదా చంద్రిక ప్రతిభాభారతి అలియాస్‌ చంద్రిక స్నేహితులు.  రెండు నెలలక్రితం సువర్ణను కలిసిన చంద్రిక తన స్నేహితురాలైన విశాఖపట్నం అక్కయ్యపాలెంనకు చెందిన దుర్గాడ వేణు అనే యువతి అన్నకు పిల్లలు కలగలేదని, వారికి ఒక మగ పిల్లవాడు కావాలని, ఎవరైనా అమ్మేవాళ్లు ఉంటే రూ.2 లక్షలు ఇస్తారని చెప్పి రూ.20 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఈ విషయం సువర్ణ భర్త దుర్గాప్రసాద్‌కు చెప్పగా అందుకు ఆయన ఒప్పుకున్నారు. అయితే సువర్ణ, దుర్గాప్రసాద్‌లు ఎంత ప్రయత్నించినా మగ పిల్లవాడిని విక్రయించే వారు దొరకలేదు. ఈ క్రమంలో కిడ్నాప్‌ చేసి రూ.2 లక్షలు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. దుర్గాప్రసాద్‌ తన స్నేహితులైన వాంబేకాలనీకి చెందిన అమరాలపూడి శ్రీనివాసరావు, పోపూరి సాగర్‌, వర్మలకు కిడ్నాప్‌ వ్యవహారం చెప్పాడు. వీరంతా ఈ నెల 24న ఓ కారు అద్దెకు తీసుకుని నంబూరు దగ్గరలోని యానాదికాలనీకి వెళ్లారు. అక్కడే రెండేళ్ల జీవ అనే బాలుడిని కిడ్నాప్‌ చేసి కారులో అదృశ్యమయ్యారు. దీంతో తల్లిదండ్రులు మాణిక్యాల ముసలయ్య, బాల పెదకాకాని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన ముఠా తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం బంగారయ్యపేటకు వెళ్లి దుర్గాడ వేణుకు తాము కిడ్నాప్‌ చేసిన జీవాను విక్రయించి వేణు నుంచి రూ.లక్షా 60 వేలు తీసుకున్నారు. అందులో రూ.25 వేలు ఖర్చులకు వాడుకుని మిగిలిన రూ.లక్షా 35 వేలు పంచుకున్నారు. నార్త్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులైన సువర్ణ, దుర్గాప్రసాద్‌, శ్రీనివాసరావు, సాగర్‌, చంద్రిక, వేణులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.లక్షా 20 వేల నగదు, కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు వర్మ పరారీలో ఉన్నాడు. కేసు చేధించిన అధికారులు, సిబ్బందికి డీఐజీ త్రివిక్రమ వర్మ నగదు రివార్డును అందించారు. నార్త్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌, పెదకాకాని సీఐ శోభన్‌బాబు, మంగళగిరి రూరల్‌ సీఐ శేషగిరిరావు, టెక్నికల్‌ అనాలసిస్‌ వింగ్‌ సీఐ కొంకా శ్రీనివాసరావు, పెదకాకాని ఎస్‌ఐలు వై.వినోద్‌కుమార్‌, కె.మురళీకృష్ణ, టెక్నికల్‌ ఎస్‌ఐ శ్రీనాథ్‌, తాడికొండ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌రెడ్డి, మంగళగిరి ఎస్‌ఐ ఏడుకొండలు, పెదకాకాని కానిస్టేబుళ్లు కె.భిక్షునాయక్‌, టి.శ్యాంసన్‌, మహిళా కానిస్టేబుల్‌ జయసువిత, పెదకాకాని కానిస్టేబుల్‌ కె.రాంబాబు, తాడికొండ కానిస్టేబుళ్లు బి.సుబ్బారావు, టి.ఏడుకొండలు, టెక్నికల్‌ కానిస్టేబుళ్లు వి.గోపిరాజు, పి.ఉపేంద్రసాయి తదితరులకు నగదు రివార్డు అందించి అభినందించారు. 

Updated Date - 2021-03-01T05:46:53+05:30 IST