సినిమా చూపించారు..

ABN , First Publish Date - 2021-03-05T07:29:01+05:30 IST

ఇంద్ర సినిమాలో

సినిమా చూపించారు..

  • సినీ ఫక్కీలో మోసాలు
  • ఓ చోట ఇంద్ర.. మరో చోట వెంకీ...
  • తాంత్రిక పూజల పేరుతో బురిడీ 
  • ఇంట్లో బంగారం నిధి ఉందంటూ పూజలు 
  • నకిలీ బంగారం అంటగట్టి రూ.లక్షలు వసూళ్లు
  • ఆర్‌ఎంపీ డాక్టర్‌ మోసం
  • బాధితుడే నిందితుడిగా మారిన వైనం 
  • రైల్వేలో ఉద్యోగాలంటూ మరో చోట దగా
  • శిక్షణ పేరుతో రూ.లక్షలు వసూలు 


ఇంద్ర సినిమాలో వారణాసికి వచ్చిన ఓ కుటుంబాన్ని ‘మీది తెనాలి.. మాది తెనాలి.. మనది తెనాలి..’ అని నమ్మించి ఒంటిమీద బంగారం అంతా మూట గట్టిస్తారు. ఆ బంగారం మూటను నిళ్లలో 5 నిమిషాలు పెట్టిస్తారు. మంత్రం చదివితే మూటలోని బంగారం రెండింతలు అవుతుందని  బాబా అవతారంలో క్యారెక్టర్‌ చెబుతాడు. మంత్రం చదివాక ఉబలాటం ఆపుకోలేని ఆ ఫ్యామిలీ మూట విప్పగానే అందులో బంగారానికి బదులు ఇనుప ముక్కలు ఉంటాయి. బంగారం ఏదని బాబాను ప్రశ్నిస్తే ‘దరిద్రుడా, ఎక్కడ దొరికావురా నువ్వు. 10 అంకెలు లెక్కబెట్టమని నేను చెప్పినా వినకుండా నువ్వు వెంటనే మూట విప్పావు. అందుకే బంగారం ప్లేస్‌లో ఇనుము ఉంది.’ అని దబాయించి వెళ్లి పోతాడు. అంతకు ముందే ఆ బంగారం మూట దాచేస్తారు. సరిగ్గా ఇదే స్ర్కిప్టును కొంచెం ఇటు, ఇటుగా మారి ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ మోసాలకు పాల్పడుతున్నాడు. 


రైల్యేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇస్తారు. ఫోన్‌ చేసిన వారికి ఉద్యోగం గ్యారంటీ హామీ ఇస్తారు. 3 నెలలు శిక్షణ ఉంటుందని రూ. లక్షలు దోచేస్తారు. శిక్షణ పూర్తయి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు మరికొన్ని లక్షలు లాగేస్తారు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో సంబంధిత డిపార్టుమెంట్‌లో జాయినింగ్‌కు వెళ్తే ఇవి నకిలీ నియామక పత్రాలు అని, మిమ్మల్ని మోసం చేశారని అక్కడి అధికారులు చెప్పగానే కంగుతింటారు. వెంకీ సినిమా తరహాలో జరిగిన ఈ మోసానికి చెందిన వివరాలను సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.


ఓం.. భీం.. క్రీం..!

హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ‘‘ఓం.. భీం.. క్రీం.. మీ ఇంట్లో బంగారం నిధి ఉంది. నా తాంత్రిక శక్తుల ద్వారా తెలుస్తోంది. మీ ఇంట్లో అర్ధరాత్రి పూజ చేయాలి. అప్పుడే నిధి ఎక్కడుందో తెలుస్తుంది. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. తెలిస్తే అపార నష్టం జరుగుతుంది.’’ అంటూ అమాయకులను నమ్మించి బురిడీ కొట్టిస్తున్నాడు ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌. ఇంట్లో పూజలు చేశాక నకిలీ బంగారం అంటగట్టి రూ.లక్షలు తీసుకుని ఉఢాయిస్తాడు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం డైలాగ్‌లు చెప్పి తప్పించుకుంటాడు. సుమారు 15 ఏళ్లగా ఇదే రకంగా మోసం చేస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. నలుగురిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. రూ. 8 లక్షల నగదు, 5.85 కేజీల నకిలీ బంగారం బిస్కెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

రాజేంద్రనగర్‌ పరిధి మీర్జాలం మండికి చెందిన అబ్బాస్‌ ఆలీ సాజిద్‌ వాళ్ల అమ్మకు ఇంట్లో బంగారం నిధులు ఉన్నాయని రోజూ కలలు వస్తున్నాయని ఓల్డ్‌ మల్లేపల్లిలో తాంత్రిక విద్య తెలిసిన దస్తగిరి అహ్మద్‌ వద్దకు తీసుకెళ్లాడు. ఏదో మంత్రం చదివిన దస్తగిరి ‘మీ అమ్మకు వచ్చిన కల నిజమే. మీ ఇంట్లో బంగారం నిధి ఉంది. అర్ధరాత్రి పూజలు చేయాలి. అప్పుడే నిధి ఎక్కడుందో తెలుస్తుంది’ అన్నాడు. అందుకు ఫీజు కింద రూ. 3 లక్షలు చెల్లించాలి అన్నాడు.


నకిలీ బంగారంతో బురిడీ..

దస్తగిరి మాటలకు సాజిద్‌ సరే అన్నాడు. రూ. 3లక్షలు ఇచ్చి ఒక రోజు పూజలు చేయడానికి దస్తగిరిని ఆహ్వానించాడు. తన అనుచరులు ఫహీమ్‌, షేక్‌ హఫీజ్‌తో కలిసి సాజిత్‌ ఇంటికి దస్తగిరి వెళ్లాడు. అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేశాడు. ఇంటి పరిసరాల్లో 5 చిన్న చిన్న గుంతలు తవ్వించాడు. వాటిలో మంత్రించిన వస్తువులు వేసి పూడ్పించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కో గుంతను ఓపెన్‌ చేశారు. ఒక గుంతలో బంగారం బిస్కెట్లు లభించాయి. సాజిద్‌ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. (దస్తగిరి ప్లాన్‌ ప్రకారం ఒక గుంతలో నకిలీ బంగారం బిస్కెట్లు పెట్టించాడు.)


టచ్‌ చేస్తే మరణిస్తారు.. 

గుంతలో బంగారం బిస్కెట్లు కనిపించగానే సాజిద్‌ కుటుంబాన్ని దస్తగిరి హెచ్చరించాడు. ఆ బంగారానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని, దాన్ని టచ్‌ చేస్తే చనిపోతారని భయపెడతాడు. ఆ బంగారాన్ని క్లాత్‌లో మూటగట్టి ఒక సేఫ్‌ ప్లేస్‌లో పెడతాడు. ‘నేను చెప్పేంత వరకు ఆ మూట విప్పవద్దు’ అని చెప్పి వెళ్లిపోతాడు. బంగారం ఎప్పుడెప్పుడు చూద్దామన్న ఆతృతతో సాజిద్‌ ఫ్యామిలీ.. దస్తగిరి వెళ్లగానే మూట విప్పుతారు. దాన్ని పరీక్షించగా నకిలీ బంగారంగా తెలిసిపోయింది. ఇదేంటని దస్తగిరిని నిలదీస్తే.. ‘మీరు నా మాట వినకుండా తొందరపడి మూట విప్పారు. అందుకే శక్తులు తగ్గిపోయి ఇలా నకిలీ బంగారం అయింది’ అని దబాయిస్తాడు. ఏం చేసేది లేక సాజిద్‌ కుటుంబం గుట్టుగా నిట్టూరుస్తారు.


బాధితుడే నిందితుడైన వైనం

ఈ కథలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్‌ ఉంది. దస్తగిరి చేతిలో మోసపోయిన సాజిద్‌ ఆ నకిలీ బంగారాన్ని ఇతరులకు అంటగట్టడానికి ప్రయత్నించి పోలీసుల చేతికి చిక్కాడు. దస్తగిరి చేసిన మోసాన్ని సాజిద్‌ తన మిత్రుడు అలీ అక్బర్‌ తయ్యాబీకి చెప్పాడు. నకిలీ బంగారాన్ని నిజమైనదిగా నమ్మించి వేరేవాళ్లకు తక్కువఽ ధరకు అంటగడదామని తయ్యాబీ సలహా ఇచ్చాడు. అనుకున్నట్లే ప్లాన్‌ చేసుకున్నారు. ‘మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ. 50వేలు ఉంది. మేం రూ. 40వేలకే ఇస్తాం’ అని తెలిసినవారికి చెప్పారు. సాజిద్‌, తయ్యాబీ మాటలు నమ్మిన వారు ఆ బంగారం కొనుగోలు చేశారు. తర్వాత అనుమానం వచ్చి స్వర్ణకారుల వద్ద చెక్‌ చేయించగా ఇది నకిలీ బంగారం (బ్రాస్‌ బిస్కట్స్‌) అని తేలింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో సాజిద్‌ నేరస్థుడయ్యాడు. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌వోటి అడిషనల్‌ డీసీపీ సందీప్‌, రాజేంద్రనగర్‌ ఏపీపీ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య, ఎస్‌వోటి ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి బృందం ఈ కేసును లోతుగా విచారించారు. దాంతో దస్తగిరి దందా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్లుగా దస్తగిరి తాంత్రిక విద్యల పేరుతో నకిలీ బంగారం అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని సీపీ సజ్జనార్‌ అభినందించి రివార్డులు అందజేశారు.


ఉద్యోగాల పేరుతో టోకరా

హైదరాబాద్‌ సిటీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి) : రైల్యేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముఠాలోని కొందరు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌కు చెందిన బాఽధితుడు, అతని స్నేహితులు 2019 అక్టోబర్‌లో ఫేస్‌బుక్‌లో రైల్యే ఉద్యోగాల ప్రకటన చూశారు. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేశారు. మాజిద్‌ అలియాస్‌ శ్రీనివాస్‌, సర్వేష్‌ సాహు అలియాస్‌ అశోక్‌ కుమార్‌ సింగ్‌ లైన్‌లోకి వచ్చారు. శిక్షణ తర్వాత ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని నమ్మించారు. వారు చెప్పిన విధంగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వారు చెప్పిన విధంగానే 3 నెలలు కోచింగ్‌ ఇచ్చారు. వివిధ ఫీజుల కింద రూ. 6 లక్షలు తీసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ నియామక పత్రంతో పాటు, ఐడీ కార్డును అందించారు. రెండు రోజుల తర్వాత ఆ నియామక పత్రం, ఐడీ కార్డుతో రైల్వే డిపార్టుమెంట్‌కు వెళ్లగా, ఇవి నకిలీ పత్రాలని, తాము ఉద్యోగాలు భర్తీ చేయలేదని చెప్పడంతో అవాక్కయ్యారు. తమకు కోచింగ్‌ ఇచ్చిన వారి నెంబర్లు స్విచాఫ్‌ ఉన్నాయి. మోసపోయామని గ్రహించిన బాధితులు రాజేంద్రనగర్‌ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, విజయవాడకుకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను గుర్తించారు. మొత్తం నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

ఇలా మోసం చేస్తారు.. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్వేస్‌ సాహూ అలియాస్‌ అశోక్‌ కుమార్‌ సింగ్‌ రైల్వే ఉద్యోగాల పేరుతో ఫేస్‌బుక్‌ ప్రకటనలు ఇస్తాడు. ఉత్సాహవంతులైన నిరుద్యోగులు ఫోన్‌ చేయగానే అతని మిత్రులు ఢిల్లీకి చెందిన మిశ్రా, కోల్‌కతాకు చెందిన దినేష్‌, విజయవాడకు చెందిన మాజిద్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ నిరుద్యోగులను ఆకట్టుకుంటారు. మూడు నెలలు శిక్షణ ఉంటుందని ఢిల్లీకి రప్పిస్తారు. మొదటి విడతగా రూ. 2 లక్షలు తీసుకుంటారు. శిక్షణ పూర్తయిన తర్వాత మెడికల్‌ టెస్టు చేయించాలని పాజిటివ్‌ రిపోర్టు కోసం రూ. 50 వేలు తీసుకుంటారు. చివరగా ఉద్యోగం ఓకే అయిందని నియామక పత్రాలు చేతిలో పెడుతూ మరో రూ. 3 లక్షలు తీసుకుంటారు. నియామక పత్రాలతో ఉద్యోగం కోసం వెళ్లిన బాధితులకు అదంతా మోసమని తెలుస్తుంది. ఈ లోగా నిందితులు బిస్తరు సర్దేసి కనిపించకుండా పోతారు. ఇలా మూడేళ్లుగా వందలాది మంది నిరుద్యోగులను ఈ ముఠా మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చాకచక్యంగా ఉత్తరప్రదేశ్‌ అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 6 లక్షల నగదు, నాలుగు మొబైల్‌ ఫోన్‌లు, నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌ ముఠాను అరెస్టు చేసిన రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య, శంషాబాద్‌ ఎస్‌వోటి ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి బృందాన్ని అభినందించి రివార్డులు అందజేశారు.


ప్రముఖ కంపెనీలో...

హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఔషద రంగ సంస్థలో ఉద్యోగాలంటూ ఓ ముఠా మోసం చేస్తున్నట్లు  హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం పేరిట గాలం వేసి వివిధ ఖర్చుల నిమిత్తం రూ. 12 వేలు కాజేసినట్లు ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితుడు ఒక్కరే ఉన్నారని, దర్యాప్తులో ఎంత మంది ఉన్నారో తేలుతుందని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. 

Updated Date - 2021-03-05T07:29:01+05:30 IST