మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

మాదక ద్రవ్యాలకు బానిసలై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడిపై సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మండపంలో గురువారం సాయంత్రం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సమావేశంలో మాట్లాడుతున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌

నేర సమీక్షా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌


సంగారెడ్డి క్రైం, అక్టోబరు 21 : మాదకద్రవ్యాలకు బానిసలై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడిపై సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మండపంలో గురువారం సాయంత్రం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక పారిశ్రామిక ప్రాంతాలున్న సంగారెడ్డి జిల్లాకు విదేశీ పెట్టుబడులు రావాలంటే ఇక్కడ శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నారు. గంజాయి తదితర మాదకద్రవ్యాల కారణంగా నేరాలు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. స్థానికంగా గంజాయిని అమ్మేవారిని పట్టుకుంటే సరిపోదని, ఎక్కడి నుంచి, ఎవరు సరఫరా చేస్తున్నారో, డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారో పూర్తి వివరాలు రాబట్టాలని సూచించారు. వారందరినీ పట్టుకుని శిక్షపడేలా చేయాలని ఆదేశించారు. రైతులు తమ పొలాల్లో గంజాయిని పండిస్తే రైతుబీమా, రైతుబంధు తదితర పథకాలకు అనర్హులుగా పరిగణిస్తారని,  అసైన్డ్‌ భూముల్లో గంజాయి పండిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే విషయంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. మూతపడిన ఫార్మా కంపెనీల్లో మాదకద్రవ్యాలు తయారుచేసే అవకాశం ఉంటుందని, అటువంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి కృషిచేసే అధికారులు సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందన్నారు. పేకాట జిల్లాలో పూర్తిగా నిర్మూలించబడిందని, దీపావళి పండగ పేరుతో ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ కె.సృజన, డీఎస్పీ బాలాజి, శ్రీనివా్‌సనాయుడు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST