గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, రవాణాదారులపై క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్టులు

ABN , First Publish Date - 2021-10-23T05:23:07+05:30 IST

గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, రవాణాదారులపై క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్టులు నమోదు చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, రవాణాదారులపై క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్టులు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, అక్టోబరు 22: గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, రవాణాదారులపై క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్టులు నమోదు చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి రామగుండం కమిషనరేట్‌, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీజీపీ ఉత్తర్వుల మేరకు మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారిపై, సరఫరా, ఉత్పత్తి చేస్తున్న ఉక్కుపాదం మోపడంతో పాటు వాటికి యువత దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవలంభించాల్సిన విధివిఽదానలపై అధికారులకు సూచనలు చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలను గంజాయిరహిత జిల్లాలుగా మార్చేందుకు పోలీసులు సంసిద్ధులై ఉండాలన్నారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు వినియోగిస్తూ, ఉత్పత్తి, రవాణా చేసినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు కఠినంగా వ్యవహరించాలని, పీడీయాక్టు అమలుచేయాలని ఆదేశించారు. యువత గంజాయి, డ్రగ్స్‌తో గ్యాంబ్లింగ్‌ వంటి వ్యసనాలతో పాటు మానసికం, శారీరకంగా నష్టపోవడమే కాకుండా విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. గంజాయి సరఫరా, ఉత్పత్తి, సాగుచేసే ఎవరికైనా పోలీస్‌ అఽధికారులు, సిబ్బంది సహకరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. హోమ్‌గార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి సరైన నిఘా ఉంచాలని, యువత అలవాట్లు, జీవన విధానంపై తెలుసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించి గంజాయి పండిస్తున్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. అసైన్డ్‌ భూముల్లో గంజాయి మొక్కలు దొరికితే ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందు కలెకర్‌ ఆదేశాలు జారీచేసే అవకాశం ఉంటుందని, పట్టా భూముల్లో గంజాయి పండిస్తే రైతుబంధు రాకుండా రద్దు చేస్తారన్నారు. గంజాయిని సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటుచేస్తున్నట్టు సీపీ పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, రవాణా చేస్తున్నా ప్రజలు బాధ్యతగా భావించి పోలీసులకు సమచారం అందించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు క్యాష్‌ రివార్డు అందజేస్తామని సీపీ పేర్కొన్నారు. గంజాయిని అరికట్టడంలో కృషిచేసిన పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక రివార్డులను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌ అడ్మిన్‌ ఎస్‌పీ వైవీఎస్‌ సుధీంద్ర, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నారాయణ, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ కమలాకర్‌, రామగుండం కమిషనరేట్‌, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల డీసీపీ, ఏసీపీలు, డీఎస్‌సీలు, సీఐలు, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T05:23:07+05:30 IST