‘నివర్‌’ కప్పిన నిజం!

ABN , First Publish Date - 2021-10-12T06:43:38+05:30 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పత్తి చేనట!

‘నివర్‌’ కప్పిన నిజం!

పత్తి చేను పేరుతో రూ.30 కోట్ల పంటల బీమా స్వాహా

నిజానికి అవి మామిడి, పామాయిల్‌ తోటలు

పత్తి సాగు చేయకుండానే తుఫాన్‌కు దెబ్బతిన్నట్టు రికార్డులు

రూ.కోట్లలో బీమా సొమ్ము స్వాహా చేసిన వైసీపీ నాయకులు

ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే రూ.4 కోట్లు స్వాహా


ఈ చిత్రంలో కనిపిస్తున్నది పత్తి చేనట! ఇది మామిడి తోట కదా అంటారా? వైసీపీ నాయకులు దీనిని పత్తిచేనే అంటున్నారు. మైలవరం మండలం పుల్లూరులో సుమారు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మామిడితోటను పత్తి చేనుగా చూపించారు. గత ఏడాది నివర్‌ తుఫాన్‌కు ఇక్కడ ఉన్న పత్తి పంటకు నష్టం వాటిల్లిందని సుమారు రూ.2 లక్షల బీమా సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారు.


పంటల బీమా సొమ్మును వైసీపీ నాయకులు ఎలా అడ్డగోలుగా స్వాహా చేశారో తెలియజేసేందుకు ఉదాహరణ ఇది. ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే సుమారు రూ.4 కోట్ల పంటల బీమా సొమ్మును వైసీపీ నాయకులు స్వాహా చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలా  స్వాహా చేసిన సొమ్ము రూ.30 కోట్లకు పైనే ఉంటుంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

 ‘నివర్‌’ తుఫాను కారణంగా గత ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు 95 వేల హెక్టార్లలో వరి, పత్తి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. ఈ ఏడాది మేలో పంటల బీమా సొమ్మును సీఎం జగన్‌ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.170.41 కోట్లను విడుదల చేయగా, ఒక్క మైలవరం నియోజకవర్గంలోనే రూ.9.49 కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ఈ మొత్తంలో అర్హులైన రైతులకు చేరినదానికంటే వైసీపీ నాయకుల ఖాతాల్లోకి చేరిందే ఎక్కువ. 


లెక్కలు మార్చేసి..

జిల్లాలో తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులు 84,648 మంది ఉన్నారు. వీరిలో వరి రైతులు 59వేల మంది, పత్తి రైతులు 20వేల మంది ఉన్నారు. సుమారు 40వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు లెక్కలు రాసుకున్నారు. రూ.170 కోట్ల బీమా సొమ్ము విడుదలైంది. అయితే నివర్‌ తుఫాన్‌ అనంతరం నాటి కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించిన పంట నష్టం వివరాల్లో 150 హెక్టార్లలోనే పత్తి పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. పూర్తి స్థాయి అంచనాల్లో మరికొంత పెరిగినా, 300 హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లి ఉంటుంది. కానీ 16వేల హెక్టార్లలో నష్టపోయిన పత్తి పంటకు బీమా సొమ్ము చెల్లించినట్టు రికార్డుల్లో చూపారు. పత్తి పంటకు ఎకరాకు రూ.19,625 చెల్లించారు. అంటే సుమారు 15వేల ఎకరాల్లో పత్తి పంటకు దొంగ లెక్కలు చూపి బీమా సొమ్మును స్వాహా చేశారన్నది స్పష్టం.


దోపిడీ చేసిందిలా..

తాము పండించిన పత్తిని రైతులు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కేంద్రాల్లో విక్రయిస్తారు. ఇలా విక్రయించాలంటే ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి. అయితే పత్తి సాగు కోసం రైతులు ముందుగానే దళారులు, వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకుంటారు. దీంతో వారికే తమ పంటను విక్రయిస్తుంటారు. అలా అప్పులు పెట్టిన వ్యాపారులు రైతుల పేరిట ఈ క్రాప్‌ నమోదు చేయిస్తారు. వారి పేరిటే పత్తిని విక్రయిస్తుంటారు. ఈ క్రాప్‌ నమోదు వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో పక్కాగా జరగాలి. కానీ వ్యవసాయ అధికారులను పక్కకు నెట్టేసి వైసీపీ నాయకులే నేరుగా ఈ క్రాప్‌ నమోదు చేశారు. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. మామిడి, పామాయిల్‌ తోటలు.. వరి పొలాలు కూడా ఈ క్రాప్‌లో పత్తి పొలాలుగా మారిపోయాయి. వ్యాపారులు.. దళారుల ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు తమ వ్యాపార అవసరాల కోసం చేసిన ఈ దందా బీమా సొమ్ములు స్వాహా చేయడానికి ఉపయోగపడింది. వారికి ఎదురుచెప్పే ధైర్యం లేక వ్యవసాయ శాఖ అధికారులు మౌనంగా ఉండిపోతున్నారు. 


పంటే వేయకుండా బీమా సొమ్ము స్వాహా

మైలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పత్తి సాగు చేయకుండానే బీమా సొమ్మును స్వాహా చేశారు. మామిడి, పామాయిల్‌, వరి పొలాలను పత్తి చేలుగా చూపించి, బీమా కాజేశారు. పుల్లూరు గ్రామంలో ఓ వ్యక్తికి సుమారు 30 ఎకరాలు ఒకే చోట ఉంది. చెరువు కింద ఉన్న ఈ పొలంలో గత 20 ఏళ్లుగా వరి మాత్రమే సాగు చేస్తున్నాడు. ఆయన ఖాతాలోనూ బీమా సొమ్ము సుమారు రూ.6 లక్షలు పడింది. ఇలా మొత్తం మీద మైలవరం నియోజకవర్గంలో సుమారు రూ.4 కోట్ల వరకు బీమా సొమ్ము వైసీపీ నేతల జేబుల్లోకి చేరింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-12T06:43:38+05:30 IST