కంది..రంది

ABN , First Publish Date - 2020-05-27T10:19:05+05:30 IST

నూతన వ్యవసాయ ప్రణాళికలో భాగంగా జిల్లాలో కంది, పత్తి సాగును పెంచాలని అధికారులు ప్రణాళిక సిద్ధం

కంది..రంది

మొదలైన సాగు సదస్సులు 

కంది, పత్తి సాగు పెంచేందుకు అధికారుల ప్రతిపాదనలు

కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు 


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: నూతన వ్యవసాయ ప్రణాళికలో భాగంగా జిల్లాలో కంది, పత్తి సాగును పెంచాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని సూచిస్తున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా సాగు సదస్సులు మొదలయ్యాయి. గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లెలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సదస్సును ప్రారంభించారు. యేటా రెండు పంటలు సాగు చేసే ఈ ప్రాంత రైతులు నూతన వ్యవసాయ విధానంపై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కంది పంట సాగు అంటేనే రైతులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కంది పంటను సాగు చేసిన రైతులు పంట అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట అమ్మి మూడు మాసాలవుతున్నా ఇప్పటికీ రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేకపోయింది. జగిత్యాల జిల్లాలో 8 వేల మంది రైతుల నుంచి రూ.5 కోట్ల విలువ చేసే కందులను కొనుగోలు చేశారు. మూడు మాసాలవుతున్నా ఇప్పటికీ డబ్బులు రైతుల ఖాతాలో జమ కాలేదు.


ఇటీవలే రూ.కోటి జమ అయినట్లు అధికారులు చెబుతున్నా మిగిలిన రైతులు మాత్రం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నియంత్రిక వ్యవసాయ విధానంలో భాగంగా వానాకాలంలో మొక్కజొన్న స్థానంలో జిల్లాలో కంది సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. గడిచిన వానాకాలంలో 4,097 ఎకరాల్లో కంది పంట సాగు చేయగా, ఈ వానాకాలంలో ఏకంగా 21,850 ఎకరాల్లో కంది పంట సాగుకు అధికారులు అంచనాలు వేశారు. రెండేళ్లుగా కంది పంట సాగు చేసిన రైతులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోగా, ఇప్పుడు భారీగా సాగు విస్తీర్ణం పెరిగితే ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.


పత్తి పంటపై నీలి నీడలు

జగిత్యాల జిల్లాలో పత్తి పంట సాగు పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలతో పోల్చి చూస్తే తక్కువగానే ఉంటుంది. పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్‌, మల్యాల, కొడిమ్యాలతో పాటు బుగ్గారం, ధర్మపురి, బీర్‌పూర్‌, సారంగాపూర్‌ మండలాల్లో పత్తి పంట సాగు చేస్తారు. జిల్లాలో వెల్గటూర్‌ మండలంలోని కొత్తపేటలో మాత్రమే జిన్నింగ్‌ మిల్లు ఉంది. సీసీఐ కొనుగోళ్లు నామమాత్రమే. గడిచిన వానాకాలంలో 28,226 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. కేవలం వెల్గటూర్‌ మండలంలోని కొత్తపేటలోనే సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ప్రభుత్వ కొనుగోళ్లు సరిగా సాగకపోవడంతో దళారులు కొన్ని చోట్ల ఎలక్ర్టానిక్‌ యంత్రాలతో తూకంలో మోసానికి పాల్పడ్డాడు. సారంగాపూర్‌, బీర్‌పూర్‌, ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో ఓ ముఠా రైతులను మోసగించింది. సీసీఐ క్వింటాల్‌కు రూ.5450 ధరగా నిర్ణయించినప్పటికీ అక్కడ కొనుగోళ్లు జరుగకపోవడంతో రైతులు తక్కువ ధరకే పత్తి పంటను దళారులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.


ఈ వానాకాలంలో 38 వేల ఎకరాల్లో పంట సాగు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. గతంలోనే పంట కొనుగోలుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు పత్తి సాగు చేయడానికి భయపడుతున్నారు. అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అధికారులు, నాయకులు చేతులు దులుపుకుంటే సరిపోదని, పంటకు మద్దతు ధరతో పాటు కొనుగోలు చేయించాల్సిన బాధ్యత తీసుకుంటేనే రైతులకు నూతన వ్యవసాయ విధానం లాభదాయకంగా మారనుంది. 

Updated Date - 2020-05-27T10:19:05+05:30 IST