మళ్లీ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-18T06:25:41+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి విలయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ప్యూను మళ్లీ పొడిగించింది. మంగళవారంతో తొలి విడత పూర్తి కానుండడంతో తిరిగి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెలాఖరు వరకు జిల్లాలో ఇది అమలు కానుంది.

మళ్లీ పొడిగింపు
రాజమహేంద్రవరంలో వాహనచోదకుడికి జరిమానా విధిస్తున్న దృశ్యం

  • ఈ నెలాఖరు వరకు జిల్లాలో పగటి కర్ఫ్యూ
  • కేసుల ఉధృతి తగ్గకపోవడంతో కొనసాగింపునకు సర్కారు నిర్ణయం
  • ఇకపై మరింత కఠినంగా అమలు
  • యథావిధిగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే వ్యాపారాలకు అనుమతి
  • ఇతర జిల్లాల్లో కేసులు తగ్గుతున్నా జిల్లాలో కొనసాగుతున్న కల్లోలం
  • సోమవారం 3,152 పాజిటివ్‌లు
  • దాదాపు 30వేలకు చేరువలో యాక్టివ్‌ కేసులు
  • నేడు జిల్లావ్యాప్తంగా 62 కేంద్రాల్లో రెండో డోసు కొవాగ్జిన టీకా పంపిణీ
  • అందుబాటులో 29వేల డోసులు
  • శుక్రవారమూ కొవాగ్జిన మాత్రమే అందజేత
  • జిల్లాకు కొత్తగా మరో 50వేల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు రాక

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ మహమ్మారి విలయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ప్యూను మళ్లీ పొడిగించింది. మంగళవారంతో తొలి విడత పూర్తి కానుండడంతో తిరిగి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెలాఖరు వరకు జిల్లాలో ఇది అమలు కానుంది. అయితే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిధిగా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు, జనసంచారానికి అనుమతించింది. వాస్తవానికి కర్ఫ్యూ మినహాయింపు సమయాన్ని రెండు గంటల పాటు కుదిస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడంతో వ్యాపార, వాణిజ్య వర్గాలకు కొంత ఊరటనిచ్చినట్లయింది. అయితే కర్ఫ్యూ సమయానికి ముందు, ఆ తర్వాత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని మాత్రం ఆదేశించింది. దీంతో 144 సెక్షన్‌ అమలును జిల్లా పోలీసులు బుధవారం నుంచి గట్టిగా అమలు చేయనున్నారు. జనం గుమిగూడినా, పన్నెండు గంటల తర్వాత అమల్లోకి వచ్చే కర్ఫ్యూ సమయంలో బయట తిరిగినా జరిమానాల మోత భారీగా మోగించనున్నారు. 

వాస్తవానికి ఈ నెల 5నుంచి రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ఫ్యూ జిల్లాలోకి అమల్లోకి వచ్చింది. కానీ అంతకంటే ముందే జిల్లావ్యాప్తంగాకేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో వ్యాపార, వాణిజ్య వర్గాలు సాయంత్రం ఆరు తర్వాత అన్ని రకాల దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశాయి. ఆ తర్వాత అధికారికంగా పగటి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రెండు వారాలపాటు కొనసాగిన కర్ఫ్యూతో జిల్లాలో కొవిడ్‌ కేసుల కల్లోలం గణనీయంగా తగ్గుతుందని వైద్య, ఆరోగ్యశాఖతో పాటు జిల్లా ఉన్నతాధికారులు అంచనా వేశారు. తీరా చూస్తే పాజిటివ్‌లు మరింత ఎక్కువయ్యాయి. అంతకుమునుపు రోజూ 1,500 నుంచి 2వేల వరకు నిర్ధారణ కాగా, కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తర్వాత నిత్యం 3వేల నుంచి 3,500 వరకు నమోదవ్వడం కలవరపరిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నెల 5నుంచి 17వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 35,933 కేసులు నమోదవడం వైరస్‌ తీవ్రతను చాటుతోంది. ఈగడువులో వరుసగా అనేకసార్లు పాజిటివ్‌ల్లో రాష్ట్రంమొత్తంమీద జిల్లా తొలి స్థానంలో కొనసాగుతూ వచ్చింది. దీంతో కర్ప్యూ అమలైనా జిల్లాలో కొవిడ్‌ తీవ్రత తగ్గలేదని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ తరుణంలో ఈనెలాఖరు వరకు మళ్లీ అమల్లోకిరానున్న కర్ప్యూతోనైనా పాజిటివ్‌లు నియంత్రణలోకి వస్తాయా? రావా? అనేదానిపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కాగా సోమవారం ఏకంగా 3,152 కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. ఇందులో అత్యధికంగా కాకినాడలో 425, కాకినాడ రూరల్‌ 105, రాజమహేంద్రవరం 228, రాజమహేంద్రవరం రూరల్‌ 91, రామచంద్రపురం 128, రాయవరం 110, సామర్లకోట 98, కిర్లంపూడి 108, గంగవరం 193, అమలాపురం 156 ఉన్నాయి. జిల్లాల వారీగా మొత్తం కేసులు చూస్తే రాష్ట్రంలో తూర్పు తొలి స్థానంలో నిలిచింది. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,86,214కు చేరగా కొవిడ్‌తో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 29,808కి చేరింది. మరోపక్క కొవిడ్‌ మరణాలు సోమవారం జిల్లాలో తొమ్మిది నమోదైనట్టు బులెటినలో ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 847కు చేరింది. ఇదిలా ఉంటే దాదాపు ఐదు రోజుల తర్వాత జిల్లాలో నేడు 62 కేంద్రాల్లో కొవాగ్జిన్‌ టీకా పంపిణీ చేయనున్నారు. రెండో డోసు 48 వేల మందికి అందాల్సి ఉంది. అయితే అందుబాటులో 29వేల డోసులు ఉండడంతో మంగళవారం, శుక్రవారం వీటినే పంపిణీ చేయనున్నారు. ఈ వారంలో కొవిషీల్డ్‌ రెండో డోసు పంపిణీ ఉండదని అధికారులు వెల్లడించారు. కాగా జిల్లాకు అదనంగా 50వేల కొవిషీల్డ్‌, 6వేల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు చేరాయి.


Updated Date - 2021-05-18T06:25:41+05:30 IST