Abn logo
May 6 2021 @ 01:34AM

కర్ఫ్యూ కట్టుదిట్టం

మధ్యాహ్నం నుంచీ ఇళ్లకే పరిమితమైన జనం

 12గంటలదాకా కిక్కిరిసిన దుకాణాలు


చిత్తూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ తొలి రోజు బుధవారం జిల్లాలో చాలా చోట్ల విజయవంతంగా అమలైంది. నిబంధనలు పాటించి మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్యం సహా అన్నిరకాల దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో తిరుపతి, చిత్తూరు నగరాలు, అన్ని పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, మండలాల్లో ప్రధాన రహదారులు..నిర్మానుష్యంగా మారిపోయాయి. పోలీసులు తమ ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించారు. అక్కడక్కడా మధ్యాహ్నంపైన కూడా తెరచి ఉన్న దుకాణాలను పోలీసులు మూయించారు. కొన్నిచోట్ల కర్ఫ్యూ, 144వ సెక్షన్‌ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆస్పత్రులకు, మెడికల్‌ షాపులకు వంటి అత్యవసర సేవలకు వెళ్లేవారిని పోలీసులు అనుమతించారు. అనవసరంగా రోడ్ల మీద తిరిగిన వారికి జరిమానా విధించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్టాండులు నిర్మానుష్యంగా కనిపించాయి. వాల్మీకిపురం, పెనుమూరు వంటి మండలాల్లో మాత్రం కర్ఫ్యూ సమయంలోనూ దుకాణాలు మూతపడలేదు. ప్రజలు బయట గుంపులుగా కనిపించారు. తొలి రోజు కావడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసుల చర్యలూ అంతంతమాత్రంగా ఉన్నాయి. వాల్మీకిపురంలో మాంసం దుకాణాల వద్ద కనీసం మాస్కులు కూడా ధరించకుండ జనం ఎగబడ్డారు.


 12 లోగా అమలు కాని 144వ సెక్షన్‌

ప్రభుత్వం రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేయడంతో జిల్లా ప్రజలు మధ్యాహ్నంలోగా అన్ని రకాల సరుకులు తెచ్చుకోవాలనుకున్నారు. ఫలితంగా కిరాణా షాపులు, బట్టల దుకాణాలు.. ఇలా ఎక్కడ చూసినా.. మధ్యాహ్నం 12 వరకు ప్రజలు ఎగబడ్డారు. ఆయా దుకాణాల వద్ద జనం గుంపులుగా కనిపించారు. మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ బాగా అమలైనప్పటికీ.. 12లోగా 144వ సెక్షన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ సెక్షన్‌ ప్రకారం ఐదుగురికి మించి ప్రజలు గుంపుగా ఉండకూడదు. బయట అవసరాల కోసం తిరిగేందుకు పరిమిత సమయం ఉండడంతో మధ్యాహ్నం వరకు ఎటు చూసినా ప్రజలు ఎగబడ్డారు.

 

తడుకుపేట, నంగిలి చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు

ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నగరి సమీప తడుకుపేట చెక్‌పోస్టు వద్ద.. ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు, మదనపల్లె మండలంలోని చీకలబైలు చెక్‌పోస్టు వద్ద.. అలాగే గంగవరం మండం నంగిలి చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ఫ్యూ సమయంలో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేశారు. నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలతో పాటు సిమెంటు వంటి లగేజీ వాహనాలను అనుమతించారు. గుడిపాల మండలంలోని తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదు. కానీ.. ప్రజా రవాణాకు సంబంధించిన వాహనాలేవీ ఈ మార్గంలో కనిపించలేదు.


బోసి పోయిన ఆలయాలు

ఐరాల(కాణిపాకం),మే 5: కర్ఫ్యూ  కారణంగా దేవాలయాలన్నీ బోసిపోయాయి.శ్రీకాళహస్తి,కాణిపాక  ఆలయాల్లో దర్శన వేళలను కుదించడంతో ఉదయం 6 గంటలకు తెరిచి మధ్యాహ్నం 12 గంటలకు మూసి వేశారు.వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసివేశారు. తిరుమలలోనూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లతో పాటు అన్ని దుకాణాలనూ మూయించేశారు. దీంతో శ్రీవారి దర్శనార్థం వచ్చిన పలువురు భక్తులు ఇబ్బంది పడ్డారు.

తిరుమలలోనూ మూతబడ్డ దుకాణాలు


కర్ఫ్యూ సమయంలో చిత్తూరులో రోడ్లపైకొచ్చిన వారిని అడ్డుకుంటున్న పోలీసు


కర్ఫ్యూ కారణంగా బోసి పోయిన కాణిపాకం పురవీధులు


Advertisement
Advertisement
Advertisement