తిరువనంతపురం: ప్రభుత్వ అధికారులను కస్టమ్స్ అధికారులు బెదిరించడానికి ప్రయత్నించారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. బుధవారం ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి అధికారులు కస్టమ్స్ అధికారుల ముందు హాజరైనప్పుడు ఈ బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన అన్నారు.
‘‘బంగారం స్మగ్లింగ్ కేసులో అసిస్టెంట్ ప్రొటోకాల్ ఆఫీసర్ హరిక్రిష్ణన్‌పై కస్టమ్స్ చట్టం సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. అంతే కాకుండా ఆయనను తమ హాజరు అవ్వాలంటూ కస్టమ్స్ అధికారులు ఆదేశించారు. దీని ప్రకారం జనవరి 5న కస్టమ్స్ అధికారుల ముందు హరిక్రిష్ణన్ హాజరయ్యారు. అనంతరం జనవరి 7న తిరుగు ప్రయాణం అయ్యాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన హరిక్రిష్ణన్.. తన అనుభవాన్ని చెప్పుకున్నారు. అమర్యాదపూర్వకంగా మాట్లాడటమే కాకుండా తనను బెదిరించారని హరిక్రిష్ణన్ చెప్పారు’’ అని పినరయి విజయన్ అన్నారు.
అయితే ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు విజయన్ తెలిపారు. ఈ లేఖను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జనవరి 11న పంపినట్లు ఆయన పేర్కొన్నారు. లేఖలో హరిక్రిష్ణన్‌తో బెదిరింపులకు పాల్పడ్డ కస్టమ్స్ అధికారి పేరును ప్రస్తావించినట్లు విజయన్ చెప్పుకొచ్చారు.