నేతన్ననేస్తం లబ్ధిదారుల్లో కోత

ABN , First Publish Date - 2021-07-29T06:02:07+05:30 IST

సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఆర్థిక భరోసాను కల్పించడం కోసం ప్రభుత్వం అందిస్తున్న నేతన్న నేస్తం సాయానికి కోత పెట్టింది. ఈ ఏడాది నిబంధనల మేరకు ఇప్పటికే ఈ పఽథకంలో లబ్ధిపొందుతున్న పలువురు చేనేత కార్మికులు ఇతర సంక్షేమపథకాల్లో లబ్ధి పొందుతున్నట్టు గుర్తించి అనర్హత వేటు వేశారు.

నేతన్ననేస్తం లబ్ధిదారుల్లో కోత
నీరుగట్టువారిపల్లెలో మగ్గం నేస్తున్న నేతన్న

జిల్లాలో అనర్హుల జాబితలో మూడు వేలమంది


మదనపల్లె అర్బన్‌, జూలై 28: సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఆర్థిక భరోసాను కల్పించడం కోసం ప్రభుత్వం అందిస్తున్న నేతన్న నేస్తం సాయానికి కోత పెట్టింది. ఈ ఏడాది నిబంధనల మేరకు ఇప్పటికే ఈ పఽథకంలో లబ్ధిపొందుతున్న పలువురు చేనేత కార్మికులు ఇతర సంక్షేమపథకాల్లో లబ్ధి పొందుతున్నట్టు గుర్తించి అనర్హత వేటు వేశారు. జౌళిశాఖ లెక్కప్రకారం జిల్లావ్యాప్తంగా 40 వేలమంది వరకు చేనేత కార్మికులున్నారు. సొంతమగ్గం ఏర్పాటు చేసుకున్న వారికే నేతన్న నేస్తం పథకాన్ని వర్తింప జేసింది. ఈ పఽథకం కింద లబ్ధిదారుడికి యేటా రూ.24 వేలు సాయం అందిస్తోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఎనిమిది వేలమంది రెండేళ్లుగా లబ్ధిపొందారు. మూడో యేడాది సాయానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా కోసం సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో జిల్లాలో మూడువేల మందికిపైగా చేనేత కార్మికులు వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందుతున్నారంటూ అనర్హులుగా మార్చింది. మూడో విడత లబ్ధిదారుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించారు. గతంలో రెండు సార్లు సాయం అందుకున్న తమపేర్లు జాబితాలో లేకపోవడంతో చేనేత కార్మికులు సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఎక్కువగా రైతుభరోసా, వృద్ధాప్య, వితంతు పింఛన్లు పొందడంతోపాటు లబ్ధిదారుల కుటుంబీకుల్లో ఆదాయపన్ను చెల్లిస్తున్నా... ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారని సచివాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. అర్హులందరికీ న్యాయం చేయాలంటూ చేనేత కార్మిక సంఘాలు, నాయకులు అటు తిరుపతి జౌళిశాఖ అధికారులు, సబ్‌కల్టెర్‌, కలెక్టర్‌కు విన్నవించారు.  ఇదిలాఉండగా, ఆగస్టు 7వ తేదీన ఈ జాబితా ఆధారంగా రూ.24వేలను అందజేయడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఇదేజరిగితే చాలా వరకు చేనేత కార్మికుల నష్టపోతారని చేనేత సంఘం నాయకులు చెప్పతున్నారు. జిల్లాలో మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరి, నారాయణవనం, పుత్తూరు తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. సుమారు మూడు వేలమంది అనర్హుల జాబితాలో చేరడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మొదట్లో అర్హులందరికీ పథకంలో చోటు కల్పించి, తాజాగా ఇతర పథకాలను సాకుగా చూపుతూ కోత విధించడంపై చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-07-29T06:02:07+05:30 IST