ఆశలు ఆవరి

ABN , First Publish Date - 2020-12-01T06:22:46+05:30 IST

ఆశలు ఆవరి

ఆశలు ఆవరి
నీటిలో నానడంతో మొలకలు వస్తున్న వరి పనలు

తుఫాను దెబ్బకు అన్నదాత విలవిల

మొలకలొస్తున్న వరి

కుప్పలకింద అట్ట కడుతున్న ధాన్యం

ఆందోళనలో రైతన్న

నష్టపరిహారంపైనా గందరగోళం

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌, నవంబరు 30 : ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలైంది. వర్షం తగ్గినా నష్టం వీడనంటోంది. వరి మొలకలెత్తగా, ప్రభుత్వ పరిహారం అందని పండుగా మారింది. ఇన్ని సమస్యల నడుమ అందరికీ అన్నంపెట్టే అన్నదాత ఆకలి కడుపుతో అల్లాడిపోతున్నాడు. మండలంలోని తిప్పనగుంట, ఆరుగొలను, అప్పారావుపేట వంటి ఏలూరు కాల్వ వెంబడి పొలాల్లో పనలు నీళ్లలోనే ఉన్నాయి. కుప్పవేసిన పొలాల్లో పంట కిందకు నీరు చేరింది. దీంతో కాటాలు పెట్టేదాకా దిగుబడి లెక్కించలేని పరిస్థితి. ఆదివారం నుంచి ఎండ రావడంతో కానుమోలు, దంటగుంట్ల, కాకులపాడు గ్రామాల్లో పనలను తిరగేసిన రైతులు మొలకలు రావడం చూసి ఆందోళన చెందుతున్నారు. రంగన్నగూడెం, సింగన్నగూడెం, రేమల్లె గ్రామాల్లో పట్టాలు కప్పి ఉంచిన ధాన్యం అడుగున చెమ్మ చేరి మొలకలు వచ్చాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకోవాలని, కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుని అధికారులు తగు న్యాయం చేయాలని, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని నాయకులు, రైతులు కోరుతున్నారు. 

రైతుల వేడుకోలు

కనీస పెట్టుబడి తిరిగి వచ్చేలా నీటమునిగిన పంట మొత్తాన్ని కొనాలి. పూర్తి సబ్సిడీతో మినుము, పెసర విత్తనాలు అందజేయాలి.నష్టపరిహారం విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి రైతుకూ న్యాయం చేయాలి. 







Updated Date - 2020-12-01T06:22:46+05:30 IST