‘డబుల్‌’ ఇళ్లలో దొంగలు

ABN , First Publish Date - 2021-03-03T07:17:09+05:30 IST

పేదల కోసం నిర్మించిన రెండు పడకల ఇళ్లలో దొం గలు పడుతున్నారు.

‘డబుల్‌’ ఇళ్లలో దొంగలు

నల్లాలు, విద్యుత్‌ వైర్లు చోరీ

దుండిగల్‌, అహ్మద్‌గూడ, డీ పోచంపల్లి తదితర ప్రాంతాల్లో

పోలీసులకు ఫిర్యాదు చేశామంటోన్న అధికారులు

కేటాయింపులో తీవ్ర జాప్యం

సిద్ధమై ఏళ్లు గడిచినా ఖాళీగానే ఇళ్లు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పేదల కోసం నిర్మించిన రెండు పడకల ఇళ్లలో దొం గలు పడుతున్నారు. పనులు పూర్తయిన నిర్మాణాల్లో పలు వస్తువులు చోరీకి గురవుతున్నాయి. కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల, జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకున్న పలు సైట్లలో ఈ ఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి అధికారు లు పోలీస్‌ స్టేషన్లలోనూ ఫిర్యాదు చేశారు. గ్రేటర్‌లో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 50 వేల డబుల్‌ బె డ్రూం ఇళ్లు పూర్తయ్యాయి. కేవలం 2 వేలలోపు ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. మిగతా 48 వేల ఇళ్ల పనులు పూర్తయ్యాయి. వీటిలో కొన్ని యేడాదిన్నర, రెండేళ్ల క్రితమే పూర్తి కాగా,  మరికొన్ని ఏడెనిమిది నెలల క్రితం రెడీ అయ్యాయి. ఒప్పందం ప్ర కారం పనులు పూర్తయిన ఏడాది వరకు కాంట్రాక్టర్లు భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలి. దీనికోసం వారు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేస్తున్నారు. 

కొన్నినెలల క్రితం వరకు పూర్తయిన ఇళ్లను జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకోలేదు. ఏళ్ల తరబడి సెక్యూరిటీ సిబ్బందికి వేతనాల చెల్లింపు తమ వల్ల కాదని కాంట్రాక్టర్లు మొరపెట్టుకోవడంతో, పనులు పూర్తయి సంవత్సరం దాటిన ఇళ్లను జీహెచ్‌ఎంసీ అధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆయా సైట్లలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేసే బాధ్యతను ఈవీడీఎం విభాగానికి అప్పగించగా, ఇందుకోసం ఓ ఏజెన్సీని ఎంపిక చేశారు. 

ఆగని చోరీలు

కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్న ప్రాంతాల్లో నే కాకుండా, ఈవీడీఎం ఎంపిక చేసిన ఏజెన్సీ సెక్యూరిటీ సిబ్బంది ఉన్న చోట కూ డా చోరీలు జరుగుతున్నాయి. ఇళ్లలో నల్లా లు, విద్యుత్‌ వైర్లు, కిటికీలు దొంగిలిస్తున్నారని ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. అహ్మద్‌గూడ, దుండిగల్‌, హఫీజ్‌పేట, డీ పోచంపల్లి తదితర ప్రాం తాల్లో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఈ మేరకు స్థానిక పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశామని అధికారులు చెబుతున్నా రు. కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్నప్పుడు చోరీలు జరిగితే, సంబంధిత నిర్మాణదారు డు, సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలోనూ ఎల్లమ్మబండ, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లలో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఆయా ప్రాం తాల్లో ఇళ్ల కేటాయింపు జరగకపోవడంతో నల్లాలు, విద్యుత్‌ వైర్లతోపాటు తలుపులు, కిటికీల గ్రిల్స్‌ కూడా దొంగిలించారు. ‘చోరీలు జరగడం సాధారణం. పోయిన వస్తువులు బాధ్యులు మళ్లీ ఏర్పాటు చేస్తారు’ అని అధికారొకరు పేర్కొన్నారు. 

కేటాయిస్తే.. 

గ్రేటర్‌లో 50 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. సిద్ధంగా ఉన్న ఇళ్లలో నాలుగు శాతం కేటాయింపు  కూడా పూర్తవలేదు. కొన్నేళ్లుగా లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తుల పరిశీలన సా...గుతూనే ఉంది. మార్గదర్శకాల రూపకల్పన పూర్తయ్యిందా, ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందన్న ప్రశ్నలకూ ప్రభుత్వ విభాగాలు స్పష్టమైన సమాధానమివ్వడం లేదు. దీంతో   సెక్యూరిటీ ఏర్పాట్లు ఎంత చేసినా, చోరీలను ఆపడం అంత సులువు కాదని ఓ అధికారి చెప్పారు. వందల సంఖ్యలో ఉన్న ఇళ్లకు  ఏదో ఒక వైపు నుంచి వచ్చి వస్తువులు ఎత్తుకెళ్తున్నారని పేర్కొన్నారు. కేటాయింపు పూర్తయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

Updated Date - 2021-03-03T07:17:09+05:30 IST