భలే మంచి చౌక బేరమూ!

ABN , First Publish Date - 2021-09-05T05:58:10+05:30 IST

శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను లీజు ముసుగులో కొందరు హస్తగతం చేసుకొంటున్నారు. ఈ ఆస్తులను కారు చౌకగా అద్దెకు తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు బినామీలకు అధిక అద్దెలకు అప్పగించి.. మునిసిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికార పార్టీ నేతల సిఫారసులకు అధికారులు తలాడిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

భలే మంచి చౌక బేరమూ!
శ్రీకాకుళంలో ప్రైవేటు హోటల్‌గా మారిపోనున్న అన్నక్యాంటీన్‌

 మునిసిపల్‌ ఆస్తుల లీజులో దందా

 అధికార పార్టీ నేతల అండతో దక్కించుకుంటున్న వైనం

 అధికారులే కీలక సూత్రధారులు

 ప్రభుత్వ ఆదాయానికి గండి

 హోటల్‌గా మారుతున్న అన్న క్యాంటీన్లు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను లీజు ముసుగులో కొందరు హస్తగతం చేసుకొంటున్నారు. ఈ ఆస్తులను కారు చౌకగా అద్దెకు తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు బినామీలకు అధిక అద్దెలకు అప్పగించి.. మునిసిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికార పార్టీ నేతల సిఫారసులకు అధికారులు తలాడిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడురోడ్ల కూడలిలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూసేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది కాలంగా ఈ క్యాంటీన్‌ ఖాళీగానే ఉండిపోయింది. ఈ భవనాన్ని గతంలో గ్రామ సచివాలయానికి కేటాయించాలని అధికారులు ప్రతిపాదించినా.. స్థానిక అధికార పార్టీ నేత ఒకరు దీనికి అడ్డుపుల్ల వేశారు. ఈ భవనాన్ని ఒక ప్రైవేటు హోటల్‌ నిర్వాహకుడికి కారుచౌకగా లీజుకు ఇచ్చేశారు. ప్రైవేటు హోటల్‌కు అద్దెకు ఇచ్చేందుకు మునిసిపల్‌ రెవెన్యూ విభాగం అధికారులు 2020 జూలైలో టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో ఆ వ్యాపారి పాల్గొని 2020 సెప్టెంబరు 1 నుంచి 2023 ఆగస్టు వరకు తక్కువ ధరకు క్యాంటీన్‌ను అద్దెకు దక్కించుకున్నాడు. స్థానిక నేతల అండతో ఏడాదికి అద్దె కేవలం రూ.38,500 మాత్రమే చెల్లించేందుకు మునిసిపల్‌ అధికారులు లీజు కుదిర్చారు. అంటే నెలకు రూ.3,208 చెల్లిస్తే సరిపోతుంది. నిత్యం బిజీగా ఉండే ఏడు రోడ్ల కూడలిలో ప్రైవేటు దుకాణాల అద్దె నెలకు కనీసం రూ.15 వేలు దాటి ఉంటుంది. కానీ, అన్న క్యాంటీన్‌ భవనాన్ని తక్కువ ధరకు లీజుకు ఇచ్చి మునిసిపల్‌ ఆదాయానికి గండి కొట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


కల్యాణ మండపం అంతే...

ఏడురోడ్ల కూడలిలోని మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వైఎస్‌ఆర్‌ కల్యాణ మండపం లీజు విషయంలో కూడా ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండి పడింది. కొన్నేళ్ల కిందటే అతి తక్కువ ధరకు చంద్రకాంత్‌ అనే వ్యక్తి ఈ కల్యాణ మండపాన్ని లీజుకు దక్కించుకున్నాడు. ఆయన ఏడాదికి రూ.45 వేలు అద్దె చెల్లిస్తున్నాడు. ఈ వ్యక్తి ప్రస్తుతం ఈ కల్యాణ మండపాన్ని వేరొకరికి అధిక మొత్తానికి అద్దెకు ఇచ్చేసినట్లు తెలిసింది. ఈ కల్యాణ మండపంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించాలన్నా కనీసం రోజుకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు. కానీ, మునిసిపల్‌ రెవెన్యూ విభాగానికి మాత్రం ఏడాదికి కేవలం రూ.45 వేలు మాత్రమే చేరుతోంది. ఈ అద్దె కూడా సక్రమంగా చెల్లించడం లేదని సమాచారం. 2019 ఏడాది చివరివరకు అద్దె చెల్లించి.. ఆ తరువాత కరోనా కారణంతో నిలిపేసినట్లు చెబుతున్నారు. కానీ, కల్యాణ మండలంలో శుభకార్యాలు మాత్రం యథావిధిగానే జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. మునిసిపల్‌ ఆస్తులకు అద్దె సక్రమంగా అందేలా  చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.  

Updated Date - 2021-09-05T05:58:10+05:30 IST