ధర్మపురి క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-01-18T05:16:02+05:30 IST

పుష్యమి మాసం పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, అనుబంధ ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.

ధర్మపురి క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

ధర్మపురి, జనవరి 17: పుష్యమి మాసం పురస్కరించుకుని ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, అనుబంధ ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. పుష్యమి మాసంలో ప్రత్యేక దినంగా భావించే ఆదివారం క్షేత్రానికి ఉదయం వరకు సుదూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. గోదావరి నదిలో భక్తులు పుష్యమి స్నానాలు ఆచరించారు. ఆలయాలకు చేరుకుని అభిషేకాది పూజలు, కుంకుమార్చన, స్వామి వారల నిత్య కళ్యాణం జరిపించి పూజలు చేశారు. యమ ధర్మరాజు ఆలయం వద్ద గండ దీపంలో నూనె పోసి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. నిత్య నారసింహ హోమంలో పాల్గొన్నారు. స్వామి వారలను అందంగా వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్‌ శర్మ, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, నరసింహమూర్తి, రమణాచార్య, శ్రీధరాచార్య, యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్త మాచార్యా,  అర్చకులు నిత్య పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు.  

అన్నదానం కోసం రూ 25 వేలు విరాళాలు

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిత్యం జరిగే అన్నదానం కోసం నిజామాబాద్‌ జిల్లా కమ్మరిపెల్లి గ్రామానికి చెందిన జొన్నల పెద్దభూమయ్య-భాగ్యలక్ష్మి దంపతులు ఆదివారం రూ 25,000 విరాళాలు అందించారు.  

Updated Date - 2021-01-18T05:16:02+05:30 IST