పగలనక, రాత్రనకా..

ABN , First Publish Date - 2022-07-09T05:29:37+05:30 IST

ముంపు ప్రాంతాల్లో మునిసిపల్‌ శానిటేషన్‌ సిబ్బంది చేస్తున్న సేవలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

పగలనక, రాత్రనకా..
కాలువలో చెత్తను తొలగిస్తున్న శానిటేషన్‌ సిబ్బంది

-వర్షంలోనూ తడుస్తూ సేవలు అందిస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

- అర్ధరాత్రి వరద, తెల్లవారుజామున బురద తొలగింపు

- ప్రశంసలు అందుకుంటున్న శానిటరీ సిబ్బంది

మహబూబ్‌నగర్‌, జూలై 8 : ముంపు ప్రాంతాల్లో మునిసిపల్‌ శానిటేషన్‌ సిబ్బంది చేస్తున్న సేవలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు వర్షంలో తడుస్తూనే సేవలందించడం గమనార్హం.. వర్షం పడిన వెంటనే లోతట్టు ప్రాంతాలకు చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. పట్టణంలోని పెద్ద చెరువు కింద అలుగు ప్రవహించే రామయ్యబౌళి, బీకేరెడ్డి కాలనీల మీదుగా వరదప్రవహించిన ప్రతీసారి ముని సిపల్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని వరద ఉధృతి తగ్గేవరకు సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. గురువారం కురిసిన భారీ వర్షానికి రాత్రి 8 గంటలనుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ముంపు ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూనే కాలువ లకు చెత్తాచెదారం అడ్డుపడితే తొలగించడం, వరద నీరు ఎక్కడా ఆగకుండా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా ఇళ్లలోకి నీరు చేరినా అక్కడికి వెళ్లి నీటిని బయ టకు పంపించే చర్యలు చేపట్టారు. వర్షం తగ్గి నీటిప్రవాహం ఆగిపోయేవరకు ఆయా కాలనీల్లో ఉండి పర్యవేక్షించారు. అదేవిధంగా తెల్లవారుజామున వరదల కారణంగా రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించడం, డ్రైనేజీలలో చెత్తను తొలగించడం వంటి పనులు చేపట్టారు. వరదల్లో కొట్టుకువచ్చిన చెత్తనంతా తొలగించి కాలువలను క్లీన్‌ చేశారు. మునిసిపల్‌ సిబ్బంది వర్షం పడిన ప్రతీ సారి లోతట్టుప్రాంతాలకు వెంటనే చేరుకుని చర్యలు చేపట్టడంపై కాలనీ వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Updated Date - 2022-07-09T05:29:37+05:30 IST