పంటల సాగుకు..పగటి పూటే విద్యుత్తు

ABN , First Publish Date - 2020-08-14T11:52:40+05:30 IST

జిల్లాలో వ్యవసాయానికి 9గంటల విద్యుత్‌ సరఫరాకు పనులు ప్రారంభమయ్యాయి.

పంటల సాగుకు..పగటి పూటే విద్యుత్తు

రూ.70 కోట్లతో లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు


నెల్లూరు (జడ్పీ), ఆగస్టు 13: జిల్లాలో వ్యవసాయానికి 9గంటల విద్యుత్‌ సరఫరాకు పనులు ప్రారంభమయ్యాయి. రైతులకు గతంలో రెండు విడతలుగా రాత్రి, పగలు విద్యుత్‌ సరఫరా జరుగుతుండేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి 9గంటల విద్యుత్తును పగటిపూటే నిరంతరాయంగా ఇవ్వాలని నిర్ణయించింది. 


జిల్లాలో ప్రస్తుతం ఉన్న లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లతో 40శాతం రైతాంగానికి మాత్రమే పగటిపూట విద్యుత్‌ సరఫరా చేసే అవకాశం ఉంది. మిగిలిన వారికీ పగటిపూట కరెంటు ఇచ్చేందుకు అదనంగా లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం రూ. 70కోట్లు నిధులు అవసరం ఉందని అధికారులు ప్రతిపాదనలు పంపడంతో వాటికి ఆమోద ముద్ర పడింది.


దీంతో సంబంధిత పనులకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది.  62 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 200 కి.మీ. మేర నూతనంగా 33/11కేవీ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయనుంది. జిల్లాలో 641 విద్యుత్‌ ఫీడర్లు ఉండగా వాటిలో 476 ఫీడర్లలో మాత్రమే పగటిపూట 9గంటల విద్యుత్‌ సరఫరా అవుతోంది. మిగతా 165 ఫీడర్లకు కొత్త లైన్లు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2020-08-14T11:52:40+05:30 IST