ఆంక్షలతో చంపేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-02T06:18:36+05:30 IST

రెమ్‌డెసివిర్‌ అక్రమ వినియోగాన్ని అరికట్టే పేరుతో అటు ప్రభుత్వం, ఇటు కిందిస్థాయి అధికారులు అమల్లోకి తెచ్చిన ఆంక్షలు బాధితుల ప్రాణాలను హరిస్తున్నాయి.

ఆంక్షలతో చంపేస్తున్నారు!

నిల్వ ఉన్నా అందని రెమ్‌డెసివిర్‌ 

బ్యాంకుల సెలవురోజు డీడీలు అడుగుతున్న అధికారులు 

రిమ్స్‌లో త్రీమెన్‌ కమిటీ పేరుతో అమలుకాని ఆంక్షలు 

ఇంజక్షన్‌ అందక రాత్రికి రాత్రే ఆగిపోయిన ఓ తల్లి ప్రాణ ం 

అదే సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఓ రిటైర్డ్‌ ఎస్‌ఐ 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రెమ్‌డెసివిర్‌ అక్రమ వినియోగాన్ని అరికట్టే పేరుతో అటు ప్రభుత్వం, ఇటు కిందిస్థాయి అధికారులు అమల్లోకి తెచ్చిన ఆంక్షలు బాధితుల ప్రాణాలను హరిస్తున్నాయి. బ్యాంకుల సెలవురోజే డీడీ ఇస్తేనే రెమ్‌డెసివిర్‌ ఇస్తామంటూ ప్రైవేటు వైద్యశాలలకు హుకుం జారీచేయటం, రిమ్స్‌లో త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేసి వారు ఆమోదిస్తేనే ఇంజక్షన్‌ వేస్తామని నిబంధనలు పెట్టడం  సమస్య తీవ్రతను మరింత పెంచాయి. దీంతో ఆ ఇంజక్షన్‌ పవర్‌ ఎంతోకానీ సకాలంలో అది అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్న తీరు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కరోనా బాధితుల చికిత్సలో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీనికి తోడు నిన్న మొన్నటివరకు ఆ ఇంజక్షన్‌ తగినంత సరఫరా కాకపోవటంతో భారీగా బ్లాక్‌లో విక్రయం జరిగింది.  దీంతో ఇంజెక్షన్ల అక్రమ నిల్వలు, అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక నిబంధనలను కూడా ప్రవేశపెట్టారు. అయితే ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందన్న’ చందంగా ఈ నిబంధనలు బాధితుల ప్రాణాలను హరిస్తుండటం బాధాకరం.


డీడీల పేరుతో కొర్రీ

నిన్న మొన్నటివరకు నేరుగా డబ్బులు చెల్లించినా లేక చెక్కులు ఇచ్చినా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు విక్రయించారు. శనివారం ఉదయం ఆకస్మికంగా బ్యాంకు డీడీలు తీసుకుని వస్తేనే ఇస్తామని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నిబంధనలు పెట్టారు. ఇది  ప్రభుత్వ తాజా ఆదేశాలని సెలవిచ్చారు. శనివారం మేడే కావటంతో బ్యాంకులకు సెలవు. అయినా డీడీలే కావాలంటూ ప్రైవేటు ఆస్పత్రులకు ఇంజెక్షన్లు ఇవ్వకుండా నిలిపివేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 


అత్యవసరమైనా ఇవ్వలేదు..

ఒంగోలు రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న కొవిడ్‌ వైద్యశాలలో ఒక రిటైర్డ్‌ ఎస్‌ఐ చికిత్స పొందుతున్నారు. అతనికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ వాడాలని చికిత్స చేస్తు న్న డాక్టరు సూచించారు. దీంతో వైద్యశాల నిర్వాహకులు డ్రగ్‌ కంట్రోల్‌ అధికా రులను సంప్రదించారు. అయితే చెక్కు ఇచ్చినా, నగదు చెల్లించినా  ఇవ్వలేమ ని ఒక్క ఇంజెక్షన్‌ ఇవ్వటానికి కూడా నిరాకరించారు. సాయంత్రానికి ఇదే పరి స్థితి నగరంలోని దాదాపు అన్ని ప్రైవేటు కొవిడ్‌ వైద్యశాలల వారికి ఎదురైంది. ఒక వైద్యశాలలో ఒక బాధితుడి తరపువారు విపరీతమైన ప్రయత్నాలు చేసి గుంటూరు, విజయవాడలోని వేరే వారి వద్ద నుంచి రెండు డోసుల ఇంజక్షన్‌ రూ.లక్షకు తెచ్చుకున్నారు. ఆదివారం కూడా బ్యాంకులకు సెలవు కావడంతో వైరస్‌ పీడితులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. 


వికటించిన త్రీమెన్‌ కమిటీ నిబంధన 

ఒంగోలులోని రిమ్స్‌లో రెమ్‌డెసివిర్‌ వినియోగానికి అధికారులు పెట్టిన నిబంధన వికటించింది. ఫలితంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రంలోపు పలువురు బాధితులు ఆ ఇంజక్షన్‌ అందక ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ అవకాశం ఉన్న మేరకు రెమ్‌డిసివిర్‌ వినియోగంలో దుర్వినియోగం జరుగుతున్న మాట నిజమే. దీంతో దాని నివారణ కోసం త్రీమెన్‌ కమిటీని నియమించారు. నిన్న మొన్నటి వరకు బాధితుడికి చికిత్స చేస్తున్న డాక్టరు సిఫార్సు చేస్తే రెమ్‌డిసివిర్‌ ఇచ్చేవారు. ఇప్పుడు త్రీమెన్‌ కమిటీ అధికారికంగా ఆమోదిస్తేనే ఇస్తున్నారు. పైగా ఆ కమిటీలో డీఎంహెచ్‌వో, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ని కూడా చేర్చారు. అర్ధరాత్రి ఒక బాధితునికి రెమ్‌డెసివిర్‌ ఇవ్వాలని డాక్టరు భావించినా కమిటీ ఆమోదం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం రాత్రి పదకొండు గంటల తర్వాత రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఒక సీఐ తల్లికి రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌ చేయాలని డాక్టరు భావించారు. అయితే కమిటీ ఆమోదం లేనిదే ఆ ఇంజక్షన్‌ని వినియోగించే అవకాశం లేకుండాపోయింది. పలువురు పోలీసు అధికారులు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. ఆ కమిటీలో సభ్యులైన ఒకరిద్దరికి ఓ పోలీసు అధికారి ఫోన్‌ చేసినా వారు కనీసం లిఫ్ట్‌ చేయలేదు. విషాదమేమిటంటే తెల్లవారుజామున ఆ 60ఏళ్ల తల్లి ప్రాణాలు కోల్పోయింది. 


సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరమే 

ఒక హోదాలో ఉన్న పోలీసు అధికారి సర్వశక్తులొడ్డినా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కొత్త నిబంధనల కారణంగా వేయించలేకపోయాడంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నిబంధన దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పెట్టారో లేక ఇంజక్షన్‌ కొరతను కప్పిపుచ్చేందుకు పెట్టారో తెలియటం లేదు. ప్రస్తుతం రిమ్స్‌లో ఉన్న రోగుల పరిస్థితిని బట్టి చూస్తే 4వేల డోసుల రెమ్‌డిసివిర్‌ అవసరం ఉంది. రోజువారీ సరాసరిన 750 డోసుల  ఇంజెక్షన్‌ అవసరమని అనుభవం ఉన్న డాక్టర్లు చెబుతున్నారు. అయితే రోజుకి 200 డోసులకు మించి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ వినియోగించకూడదన్న మౌఖిక ఆదేశాలు వైద్యశాలలోని డాక్టర్లకు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇటు అతి ఆంక్షలు, అటు ఇంజక్షన్‌ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న వారి  సంఖ్య పెరిగిపోతోంది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఉండి ఉంటే సదరు బాధితులు బతికేవారన్న ఆవేదన కుటుంబసభ్యులు, ఆత్మీయుల్లో వ్యక్తమవుతోంది. విపత్తు సమయంలో అవసరం మేరకు ఇంజక్షన్లు సరఫరా చేయాల్సింది పోయి రెమ్‌డెసివిర్‌ ఉన్న విలువ ప్రాణంకు లేదన్నట్లుగా నిబంధనలు రూపొం దిస్తుండటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవు తోంది.


Updated Date - 2021-05-02T06:18:36+05:30 IST