మృత్యు ఘంటికలు!

ABN , First Publish Date - 2021-04-19T04:50:40+05:30 IST

రిచేస్తోంది. వైరస్‌ అతి వేగంగా విస్తరిస్తోంది. కానీ ప్రజల్లో మాత్రం ఆశించిన స్థాయిలో నిబంధనలు కానరావడం లేదు. ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు. చాలా మంది మాస్కు లేకుండానే బయట తిరుగుతున్నారు. మార్కెట్లు సైతం జనాలతో నిండిపోతున్నారు. షాపులు, సినిమా

మృత్యు ఘంటికలు!






సెకెండ్‌ వేవ్‌లో వైరస్‌ విజృంభణ

పెరుగుతున్న కేసులు, మరణాలతో కలవరపాటు

నిబంధనలు పాటించని ప్రజలు

కఠినచర్యలకు ఉపక్రమించని అధికారులు

ఇలాగే కొనసాగితే తప్పదు మూల్యం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. వైరస్‌ వలయతాండవం చేస్తోంది. సెకెండ్‌ వేవ్‌లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇందులో వైద్యఆరోగ్య శాఖ ధ్రువీకరించినవి కొన్నే. కొన్నిమండలాల్లో కీలక స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు కరోనాబారిన పడుతున్నారు. చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఏప్రిల్‌ ప్రారంభం నుంచే కేసుల సంఖ్య పెరిగింది. గత వారం రోజుల నుంచి వైరస్‌ పంజా విసురుతోంది. రోజుకు సగటున వందలాది కేసులు నమోదవుతున్నాయి. గత వారం పదుల సంఖ్యలో ఉన్న కేసులు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం 349 కేసులు నమోదయ్యాయి.

కరోనా కేసులు, మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నాటికి 41,458 కేసులు ఉండగా...మంగళవారం నాటికి 43,632కు చేరుకున్నాయి. పక్షం రోజుల్లో రెండు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,609. గత నాలుగురోజులుగా సగటున 300కుపైగా నమోదవుతున్నాయి. చాలామంది మృత్యువాత పడుతున్నారు. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. సెకెండ్‌ వేవ్‌ ఉధృతి భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్‌  అతి వేగంగా విస్తరిస్తోంది. కానీ ప్రజల్లో మాత్రం ఆశించిన స్థాయిలో నిబంధనలు కానరావడం లేదు. ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదు. చాలా మంది మాస్కు లేకుండానే బయట తిరుగుతున్నారు.  మార్కెట్లు సైతం జనాలతో నిండిపోతున్నారు. షాపులు, సినిమా హాళ్లలో జనాలు కిక్కిరిసి కనిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. బస్సుల్లో సైతం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. మాస్కు ధరించి ప్రయాణించాలన్న నిబంధనను కొన్నిచోట్ల గాలికొదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల తోటి ప్రయాణికులే మాస్కు వేయని వారిని నిలువరిస్తున్నారు. బస్సుల నుంచి బయటకు దించుతున్నారు. స్వీయరక్షణ లేకుండా పోవడం, నిబంధనలు పాటించకపోవడం వైరస్‌ వ్యాప్తికి కారణాలవుతున్నాయి. 


మరణాలపై స్పష్టతేదీ?

కరోనా మరణాలపై స్పష్టత లేకుండా పోతోంది. ప్రతీరోజూ జిల్లాలో ఏదోచోట కరోనా మరణాలు సంభవిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించడం లేదు. రెండురోజుల వ్యవధిలో ఏడుగురు కరోనాతో మృత్యువాతపడితే..వైద్య శాఖ మాత్రం తక్కువ చేసి చూపిస్తోంది. కొవిడ్‌ మరణం కాదంటూ వైద్యశాఖ అధికారులు బుకాయిస్తున్నారు. శనివారం విజయనగరంలో ఇద్దరు, పార్వతీపురంలో ఇద్దరు, మెంటాడ మండలంలో ఒకరు, జామి మండలంలో ఒకరు మృతిచెందారు. కానీ వైద్య శాఖ మాత్రం ఒక్కరే మృతి చెందినట్లు ప్రకటించింది. కరోనా మృతుల కడచూపునకు కూడా కుటుంబసభ్యులు నోచుకోవడం లేదు. మిగతా కుటుంబసభ్యులు సైతం కరోనాబారిన పడడమే కారణం.  బాధిత కుటుంబసభ్యులను, బంధువులను కరోనా మానసికంగా కృంగదీస్తోంది. తమ వారి అంతిమ సంస్కారాలు సైతం చేయలేకపోయామన్న వ్యధ వారిని వెంటాడుతోంది. బాధిత కుటుంబం కనీసం బంధువుల ఆదరణకు కూడా నోచుకోలేకపోతోంది. భయంతో వారిని ఎవరూ పరామర్శించని దుస్థితి నెలకొంది. ఇటీవల మరణాలను పరిశీలిస్తే మృతుల్లో ఎక్కువ మంది యువకులు, నడి వయస్కులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 


అధికారుల ఆదేశాలు బేఖాతరు

కరోనా నిర్థారణ అయిన మూడు గంటల్లో బెడ్‌ కేటాయించండి. తక్షణం ఐసోలేషన్‌కు పంపించండి అంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు జిల్లాలో బేఖాతరవుతున్నాయి. ఎక్కువ మంది హోమ్‌ ఐసోలేషన్‌లోనే గడుపుతున్నారు. కరోనా పాజిటివ్‌ నిర్థారణ జరగగానే గతేడాది యంత్రాంగం ఆ వీధిలో శానిటైజేషన్‌ చేయించేవారు. ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో గుర్తించి వారికి కూడా కరోనా పరీక్షలు చేసేవారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చర్యలు చేపట్టేవారు. పోలీసు పహారా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడా పరిస్థితి కానరావడం లేదు. ప్రజల్లో నిర్లక్ష్యధోరణి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా, బాధితుల సంఖ్య వందల సంఖ్యలో పెరిగిపోతున్నా పట్టించుకున్నవారే కరువయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిపై నిఘా లేనేలేదు.. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్దిరోజుల్లోనే మహమ్మారి కాటుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి.


Updated Date - 2021-04-19T04:50:40+05:30 IST