పెదనాన్నా.. అని పిలిచే పాపపైనే అఘాయిత్యం.. చంపి.. మూట కట్టి.. ఇంట్లోనే మూలన పెట్టి..

ABN , First Publish Date - 2020-08-05T15:07:23+05:30 IST

ఎంసీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని సరస్వతీ నిలయంలోనే దారుణంగా చంపేశాడు మనోహర్‌ అనే ప్రేమోన్మాది. పాపం పుణ్యం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసి, ప్రాణం తీసేశాడు పెంటయ్య అనే కామాంధుడు. నాడు మనోహర్‌కు ఉరి శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది మహిళా సెషన్స్‌ కోర్టు.

పెదనాన్నా.. అని పిలిచే పాపపైనే అఘాయిత్యం.. చంపి.. మూట కట్టి.. ఇంట్లోనే మూలన పెట్టి..

ఉరే..సరి.!

నాడు మనోహర్‌.. నేడు పెంటయ్య కేసు

చిన్నారిపై అఘాయిత్యం చేసిన పెంటయ్య

చంపేసి సంచిలో మూట కట్టిన నిందితుడు.. 9 నెలల్లోనే తీర్పు


విజయవాడ(ఆంధ్రజ్యోతి):  ఎంసీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని సరస్వతీ నిలయంలోనే దారుణంగా చంపేశాడు మనోహర్‌ అనే ప్రేమోన్మాది. పాపం పుణ్యం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేసి, ప్రాణం తీసేశాడు పెంటయ్య అనే కామాంధుడు. నాడు మనోహర్‌కు ఉరి శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది మహిళా సెషన్స్‌ కోర్టు. చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో పెంటయ్యకు ఉరి శిక్ష విధించింది పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత ‘ఉరి’ తీర్పును వెలువరించింది విజయవాడ న్యాయస్థానం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ రెండు ఘటనల్లోనూ న్యాయస్థానాలు అదే స్థాయిలో తీర్పును వెలువరించాయి. చిన్నారి కేసులో నిందితుడు పెంటయ్యకు నాలుగు సెక్షన్ల కింద నాలుగు శిక్షలను విధించింది. ఇందులో ఉరితోపాటు, జీవితాంతం జైలులో ఉండేలా తీర్పును ఇచ్చారు పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ప్రతిభాదేవి.


ఆనాడు జరిగింది ఇదీ...

మృతురాలు చిన్నారి కుటుంబం గొల్లపూడిలోని నల్లకుంటలో ఉండేది. తండ్రి ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసేవాడు. తల్లి ఇంటికి సమీపంలోనే కళాశాలలో పని చేసేవారు. కుమార్తె(7) నల్లకుంటలోని కాన్వెంట్‌లో రెండో తరగతి చదివేది. 2019 నవంబరు 10న తల్లి విధులకు వెళ్లిపోయారు. తండ్రి, కుమార్తె మాత్రమే ఇంటి వద్ద ఉన్నారు. తండ్రి మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయాడు. ఆయన పక్కనే నిద్రపోయిన చిన్నారి తర్వాత ఇంటి నుంచి బయటకొచ్చింది. ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత కుమార్తె కనిపించకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. చిన్నారి ఇంటికి ఎదురుగా ఉండే బార్లపూడి పెంటయ్య సూరయపాలెంలో ఉన్న కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడి భార్య సునీత ఇక్కడే కళాశాలలో పనిచేస్తోంది. ఇంటికి ఎదురుగా ఉండడంతో చిన్నారి... పెంటయ్యతో  చనువుగా ఉండేది. అతడ్ని పెదనాన్న అని పిలిచేది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న పెంటయ్య సాయంత్రం బయటకు వచ్చిన చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి బంధించాడు. 


ఆమె గొంతు, నోరు నొక్కి అత్యాచారం చేశాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ఒక సంచిలో మూటకట్టి ఇంట్లోనే చాపను కప్పి భద్రపరిచాడు. కుమార్తె అదృశ్యంపై తల్లిదండ్రులు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నల్లకుంట గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టడం, మరోపక్క జాతీయ రహదారిని ఆనుకుని గ్రామం వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తుండడంతో.. పెంటయ్య కూడా అమ్మాయి ఆచూకీ కోసం తల్లిదండ్రులతో కలిసి గాలించాడు. పునాదిపాడు నుంచి పెంటయ్య భార్య సునీత ఆ మర్నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఏటీఎం కార్డు కోసం భార్యాభర్తలిద్దరి మధ్య వివాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న పెంటయ్య వద్ద ఉన్న ఏటీఎం కార్డును విసిరేసి బయటకు వెళ్లిపోయాడు. ఈ కార్డు వెళ్లి బీరువా పక్కన గోనె సంచి మూట వద్ద పడింది. దీన్ని తీసుకుంటుండగా సునీత చేతికి చిన్నారి కాళ్లు తగిలాయి. ఆమె చాప తీసి చూడగా అందులో మృతదేహం కనిపించింది.  


డిఫెన్స్ కౌన్సిలే నేరాన్ని అంగీకరించింది..: జీ.నారాయణరెడ్డి, పోక్సో కేసుల జిల్లా ప్రత్యేక ప్రాసిక్యూటర్

ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో అన్ని ఆధారాలనూ న్యాయమూర్తి ముందుంచాం. వాటితో న్యాయమూర్తి ఏకీభవించారు. పెంటయ్య నేరం చేశాడని డిఫెన్స్ కౌన్సిల్(నిందితుడి తరపున న్యాయవాది) అంగీకరించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించాలని ఆయన న్యాయమూర్తికి విన్నివించారు. దీని ద్వారా నిందితుడు నేరం చేశాడని అంగీకరించినట్టే...


న్యాయమే గెలిచింది: మోహన్ రెడ్డి, భవానీపురం ఇన్ స్పెక్టర్

చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో న్యాయం విజయం సాధించింది. చిన్నారి అదృశ్యమైనప్పటి నుంచి దర్యాప్తును వేగవంతం చేసి, 24 గంటల్లో ముద్దాయిని అరెస్ట్ చేశాం. ముద్దాయికి సంబంధించిన అన్ని ఆధారాలను శాస్త్రీయంగా న్యాయస్థానానికి అందజేశాం. వాస్తవానికి ఈ కేసులో తీర్పు ఇంకా ముందే రావాల్సి ఉంది. కొవిడ్, లాక్ డౌన్ కారణంగా కాస్త ఆలస్యమైంది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. ఇప్పుడు కూడా న్యాయమే గెలిచింది. 

Updated Date - 2020-08-05T15:07:23+05:30 IST