మరణాలు తగ్గించాల్సిందే

ABN , First Publish Date - 2020-08-13T09:41:02+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణకు, మరణాల శాతం తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని జేసీ(అభివృద్ధి) డాక్టర్‌ మహేష్‌కుమార్‌ రవిరాల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శా

మరణాలు తగ్గించాల్సిందే

అత్యవసర సేవల కోసం పడకలు రిజర్వ్‌

జేసీ మహేష్‌ కుమార్‌ 


కలెక్టరేట్‌; ఆగస్టు 12: జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణకు, మరణాల శాతం తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని జేసీ(అభివృద్ధి) డాక్టర్‌ మహేష్‌కుమార్‌ రవిరాల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మరింత సమర్ధంగా పని చేయాలని కోరారు. పాజిటివ్‌ వచ్చిన వారి డైరెక్ట్‌ కాంటాక్ట్స్‌ను త్వరగా గుర్తించి పరీక్షించాలని ఆదేశించారు. తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. ప్రధానంగా మరణాల శాతాన్ని ఇంకా తగ్గించాలన్నారు.


దీని కోసం ప్రతి మరణాన్నీ కూలంకషంగా విశ్లేషించాలని, తగిన కారణాలు గుర్తించాలని చెప్పారు. అన్ని కోవిడ్‌ ఆసుపత్రులలోనూ 24 గంటలూ హెల్ప్‌ డెస్క్‌లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బాధితులకు ఏ సమయంలో ఏవిధమైన వైద్యం, ఇతర సాయం అవసరమైనా అందించేందుకు హెల్ప్‌ డెస్క్‌ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వచ్చే కరోనా బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేసే విషయంలో జాప్యం జరుగుతోందని జేసీ అసహనం వ్యక్తం చేశారు.


దీని నివారణకు ప్రతి ఆస్పత్రిలోనూ నలుగురు ఆరోగ్య మిత్రలను నియమించాలని సూచించారు. కోవిడ్‌ ఆసుపత్రుల్లో  అత్యవసర సేవల కోసం కనీసం 10 శాతం బెడ్స్‌ను కేటాయించాలని సూచించారు. ఆసుపత్రుల్లో సేవలు అవసరమైన వారిని మాత్రమే చేర్చుకోవాలని జేసీ మహేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నాగభూషణరావు, ఇన్‌చార్జి జిల్లా వైద్యాధికారి బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T09:41:02+05:30 IST