అప్పులు చేసి పనులు.. అందని బిల్లులు

ABN , First Publish Date - 2021-06-23T06:10:48+05:30 IST

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో మళ్లీ పనులపై పర్యవేక్షణ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు నిధులు ఇవ్వడంతో పాటు మార్గనిర్దేశనం చేయడంతో పల్లెల్లో మళ్లీ అభివృద్ధిపై దృష్టిసారించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధులు నిర్వహణకే సరిపోతుండడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సర్పంచులు అప్పులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు.

అప్పులు చేసి పనులు.. అందని బిల్లులు

 - సర్పంచుల ఎదురుచూపులు 

- బిల్లులు రాక ఒకరి ఆత్మహత్య 

- వైద్యానికి డబ్బులు లేక మరో సర్పంచ్‌ మృతి

- వస్తున్న నిధులు నిర్వహణకే సర్దుబాటు 

- బంగారం తాకట్టు పెట్టి పనులు 

- జిల్లాలో రూ.30 కోట్ల వరకు బకాయిలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో మళ్లీ పనులపై పర్యవేక్షణ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు నిధులు ఇవ్వడంతో పాటు మార్గనిర్దేశనం చేయడంతో పల్లెల్లో మళ్లీ అభివృద్ధిపై దృష్టిసారించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధులు నిర్వహణకే సరిపోతుండడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సర్పంచులు అప్పులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లక్షల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టారు.    అధికారుల ఒత్తిడితో ఇళ్లల్లో భార్యల నగలు తాకట్టు పెట్టి  మరీ పనులు చేయిస్తున్న వారు ఉన్నారు. ప్రతీ  పంచాయతీ పరిధిలో సీసీ రోడ్లు,  వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డులు ఇతర అభివృద్ధి పనులకు సర్పంచులు అప్పులు చేస్తున్నారు. ప్రధానంగా ఉపాధిహామీ పథకం, పంచాయతీరాజ్‌ ద్వారా చేపట్టిన బకాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. పల్లె ప్రగతి పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండడంతో అనేక పనులకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. వస్తున్న నిధులను గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు, ఆర్థిక సంఘం నిధుల వినియోగం మార్గదర్శకాల ప్రకారమే ఖర్చు చేయాల్సి ఉండడంతో సర్పంచులు ఆ నిధులను ఇతర వాటికి ఖర్చు చేసే వెసులుబాటు లేకుండా పోయింది.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ఆర్థిక సంఘం నిధులు పెంచినా మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు నిధులు కేటాయించడంతో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఏర్పడింది. గతంలో గ్రామాల్లోని రిజిస్ర్టేషన్ల పన్ను, ఇతర వనరుల నుంచి వచ్చే అదాయాన్ని అయా గ్రామ పంచాయతీలకే కేటాయించేవారు.  ప్రస్తుతం ఆ ఆదాయాన్ని  ఇతర గ్రామాలకు కూడా కేటాయిస్తుండడంతో ఇబ్బందులు  వస్తున్నాయని సర్పంచులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచులకు దాదాపు రూ.30 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉన్నాయి. 

అధికార పార్టీలో ఉన్నాం.. మదన పడుతున్న సర్పంచులు 

జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో కొందరిని మినహాయిస్తే మిగతా అందరు సర్పంచులు అధికార పార్టీలోనే ఉన్నారు. అభివృద్ధి పనులకోసం అప్పులు చేసి బిల్లులు రాకపోయినా బయటకు చెప్పుకోలేక మదనపడుతున్నారు. ఏ సర్పంచ్‌ను కదిలించినా బిల్లుల కోసం అడగలేకపోతున్నామని వాపోతున్నారు. ఎవరైనా అడిగితే ‘ప్రభుత్వం మనదే అడిగితే ఎట్లా’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇల్లంతకుంట మండలం సోమారంపేట సర్పంచ్‌ వడ్డె ఆనందరెడ్డి రూ.38 లక్షల బిల్లులు రాకపోవడంతో అప్పులు చెల్లించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దాచారం సర్పంచ్‌ సుదర్శన్‌కు రూ.7 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. కరోనా సోకడంతో వైద్య ఖర్చులు లేక విరాళాలు సేకరించి చికిత్స చేయించారు. అయినా సుదర్శన్‌ను బతికించుకోలేక పోయారు. వేములవాడ అర్బన్‌మండలంలో శ్మశాన వాటికలకు సంబంధించి రూ.12.60 లక్షల చొప్పున సర్పంచులు ఖర్చు చేసి నిర్మాణాలు చేపడితే రూ.6 లక్షల వరకే బిల్లులు వచ్చాయి. మిగతా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. కొడుముంజ సర్పంచ్‌ రాజ్‌కమార్‌ శ్మశాన వాటిక నిర్మాణానికి వడ్డీకి డబ్బులు తెచ్చి రూ. 12.60 లక్షలు ఖర్చు చేసి పనులు చేశాడు. ఇంతవరకు రికార్డు కూడా కాలేదని ఆవేదన చెందుతున్నాడు. మిషన్‌భగీరథకు సంబంధించి రూ.12 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఆరెపల్లి సర్పంచ్‌ నవీన శ్మశాన వాటికకు ఖర్చు చేసిన రూ.12.60 లక్షలకు తోడు రూ.3 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌తో దెబ్బతినడంతో అదనపు భారం పడింది. ఎల్లారెడ్డిపేటలో ప్రతినెలా పంచాయతీ సిబ్బంది ఖర్చులు, ట్రాక్టర్‌ నిర్వహణకు నిధులు సరిపోకపోవడంతో సిబ్బందికి సర్పంచులే జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. 


 నెలకు రూ.లక్ష మిత్తి చెల్లించాల్సి వస్తోంది

- పాశం సరోజన, సర్పంచ్‌ గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట

గ్రామంలో  రూ.97 లక్షల నిధులతో పాఠశాల తరగతి గదులు, మూత్రశాలలు, మురుగునీటి కాలువలు, సీసీ రోడ్లు, మిషన్‌ భగీరథ వంటి అభివృద్ధి పనులను   చేపట్టాం. అప్పులు తీసుకొచ్చి పనులు చేశాం. మురుగునీటి కాలువలకు సంబంధించి రూ.30 లక్షలను ప్రభుత్వం ఏడాది తర్వాత విడుదల చేసింది. పాఠశాల తరగతి గదులను రూ.34 లక్షలతో నిర్మించాం. సర్కారు మొదట  రూ.18 లక్షల  బిల్లులను చెల్లించింది. ఇటీవల మిగతా రూ.16 లక్షలు వచ్చాయి. సీసీ రోడ్లు, మిషన్‌ భగీరథ, మూత్రశాలలకు సంబంధించిన రూ.33 లక్షల బిల్లు 10 నెలలుగా పెండింగ్‌లో ఉంది. తీసుకొచ్చిన బాకీలకు ప్రతీ నెల రూ.లక్ష మిత్తి చెల్లించాల్సి వస్తోంది. అప్పుల వాళ్ల వేధింపులు అధికమయ్యాయి. ప్రభుత్వం వెంటనే గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలి. మా ఇబ్బందులు తీర్చాలి.  గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. 


 బిల్లులు రాకుంటే అత్మహత్యలే శరణ్యం 

- కదిరె రాజ్‌కుమార్‌, సర్పంచ్‌కొడుముంజ, వేములవాడ

అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నా బిల్లులు రావడం లేదు. వడ్డీలు పెరుగుతున్నాయి. బిల్లులు రాకుంటే అత్మహత్యలే శరణ్యం. అధికారులు ఆఘమేఘాల మీద పనులు చేయించారు. బిల్లులు మాత్రం రావడం లేదు. శ్మశాన వాటిక బిల్లు రూ .12.60 లక్షలు, నీటి పైపులైన్‌కు మరో రూ.6 లక్షల పనులకు రూ.3 చొప్పున వడ్డీకి తెచ్చి పనులు చేయించాను. బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాం. 


Updated Date - 2021-06-23T06:10:48+05:30 IST