నిర్ణయాత్మక ఎన్నికలు

ABN , First Publish Date - 2022-01-11T06:10:46+05:30 IST

మహమ్మారి విజృంభణతో ఎన్నికలు వాయిదావేయడం ఉత్తమమని ఎందరు మొత్తుకున్నా, రాజకీయపార్టీల మాటకే విలువ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 10న ఆరంభమై, మార్చి 7వ తేదీ వరకూ విస్తరించిన...

నిర్ణయాత్మక ఎన్నికలు

మహమ్మారి విజృంభణతో ఎన్నికలు వాయిదావేయడం ఉత్తమమని ఎందరు మొత్తుకున్నా, రాజకీయపార్టీల మాటకే విలువ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 10న ఆరంభమై, మార్చి 7వ తేదీ వరకూ విస్తరించిన ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావుడి మరో మూడురోజుల తరువాత ఫలితాల ప్రకటనతో కానీ పూర్తికాదు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలు ఒక విడతలోనూ, మణిపూర్ రెండు విడతల్లోనూ పోలింగ్ పూర్తిచేసుకుంటే, అత్యంత కీలకమైన యూపీ మాత్రం ఈ రెండుతేదీల మధ్యనా ఏడు దశల్లో విస్తరించింది. 


ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలై, పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల పంజాబ్ లో ఓ నలభైవేలకోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఆరంభించేందుకు సంకల్పించి, రైతు నిరసనల మధ్యన ఓ ఇరవై నిముషాలు ఓ వంతెనమీద చిక్కుబడిన విషయం తెలిసిందే. దేశ ప్రధాని భద్రతను ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రమాదంలో పడవేసిందంటూ ఆ అంశాన్ని బీజేపీ నానాటికీ వీలైనంత వేడెక్కిస్తున్నది. ఎప్పటికప్పుడు ప్రియాంక నుంచి ఆదేశాలు అందుకుంటూ ఆమె సూచనలమేరకు ఈ ఘటన జరిగిందన్న రీతిలో విమర్శలు సాగుతున్నాయి. ‘ప్రాణాలతో తిరిగి విమానాశ్రయానికి రాగలిగినందుకు మీ ముఖ్యమంత్రికి థాంక్స్’ అని మోదీ అక్కడే ఓ వ్యాఖ్యచేయడం, ఆ తరువాత రాష్ట్రపతిని కలవడం, బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా మోదీ ఆయురారోగ్యాలకోసం ప్రార్థనలూ మృత్యుంజయహోమాలు జరపడం తెలిసిందే. సాగుచట్టాలను ఉపసంహరించుకున్నంత మాత్రాన పంజాబ్ రైతుల ఆగ్రహం పెద్దగా చల్లారలేదని బీజేపీకి తెలియనిదేమీ కాదు. అందువల్ల అభివృద్ధి పథకాలతో పాటు, సిక్కులను అక్కున చేర్చుకొనేందుకు మతాన్ని కూడా ఓ మార్గంగా వాడుకోవడానికి బీజేపీ ఏవో ప్రయత్నాలు చేస్తున్నది. గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని చేసిన ప్రకటనను చాలామంది ఇదేకోణంలో చూస్తున్నారు. మతపరిరక్షణకు నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి గురుగోవింద్ సింగ్ కుమారులు బలైన డిసెంబరు 26వతేదీని ఇకపై బాల్ వీర్ దివస్ గా పాటించబోతున్నట్టు మోదీ ప్రకటించారు. గత 325 ఏళ్ళలోనూ ఏ పాలకుడికీ కూడా సాహిబ్ జాదాలకు ఇంతటి ఘననివాళులర్పించవచ్చునని తెలియలేదని కొందరు మతపెద్దలు మెచ్చుకుంటున్నారుకూడా. శిరోమణీ అకాలీదళ్ దూరమై, పంజాబ్‌లో ప్రత్యక్షంగా పాగావేయలేని స్థితిలో ఉన్నప్పటికీ, అమరీందర్ సింగ్ పార్టీతో పొత్తు ఉన్నందున బీజేపీ ఇక్కడ శక్తివంచలేకుండా ఏవో ప్రయత్నాలు చేస్తున్నది. చన్నీ, సిద్దూ ద్వయం రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకే ఈ మారు ఓట్లు ఎక్కువ పడవచ్చునని అంటున్నారు. 


ఎన్నికలకు పోబోతున్న రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగా కానీ, భాగస్వామిగా కానీ అధికారంలో ఉన్నది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ సగానికిపైగా అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే బీజేపీ చేతుల్లో ఉన్నాయి. మణిపూర్ లో తాను నేరుగా అధికారంలోకి రాగలనన్న నమ్మకం కుదిరి ఒంటరిగా బరిలోకి దిగింది. పదేళ్ళక్రితం బలంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నిస్థానాలు గెలవలగలదో చెప్పలేం కానీ, ఫలితాల అనంతర పొత్తుల్లో అది చక్రం తిప్పుతుందని ఊహిస్తున్నారు. గోవాలో కూడా మాజీ ముఖ్యమంత్రినీ, కాంగ్రెస్ కీలకనేతలనూ చేర్చుకొని తృణమూల్ ఇటీవల బాగా బలపడింది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పొత్తుకూడా పెట్టుకున్నది. ఇక, ఉత్తర్ ప్రదేశ్ ఎంత కీలకమైన రాష్ట్రమో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. రేపు మోదీ తిరిగి అధికారంలోకి రావాలంటే నేడు యోగి మళ్ళీ గద్దెనెక్కాలని అమిత్ షా ఎన్నడో దిశానిర్దేశం చేశారు. ఈ రాష్ట్రంలో అత్యధికస్థానాలు కొల్లగొట్టాలని బీజేపీ ఆశిస్తున్నప్పటికీ, అఖిలేశ్‌ యాదవ్ నుంచి ఈ మారు గతంలో కంటే గట్టిపోటీ ఎదుర్కొంటున్నది. 


ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ నుంచి పోటీఎదుర్కొంటున్నది. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ కనీసం పంజాబ్‌ను నిలబెట్టుకోగలిగితే జాతీయస్థాయిలో దాని గౌరవం నిలబడుతుంది.

Updated Date - 2022-01-11T06:10:46+05:30 IST