Advertisement
Advertisement
Abn logo
Advertisement

తగ్గిన హెచ్‌ఐవీ కేసులు

- నియంత్రణలో సత్ఫలితాలు 

- జిల్లాలో మొత్తం 1634 మంది బాధితులు 

-  ఈ ఏడాది 42 మందికి  

- నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం 

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )

జిల్లాలో హెచ్‌ఐవీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. జిల్లా వైద్యఆరోగ్య శాఖ, ఎయిడ్స్‌ నియం త్రణ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.  మరోవైపు కొవిడ్‌ కాలంలో లాక్‌డౌన్‌, ఇతర కారణాలతో హెచ్‌ఐవీకి కట్టడి పడింది. 2019లో 124 కేసులు నమోదు కాగా, 2020 మార్చి వరకు 74 కేసులు వచ్చాయి. ఈ సంవత్సరం 42 కేసులు నమోదయ్యాయి. ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన  పెరగడంతో కట్టడి పడిందని చెప్పుకోవచ్చు.   వ్యాధిపై అవగాహన  కల్పించడానికి ఏటా డిసెంబరు ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం నిర్వహిస్తున్నారు.

అవగాహన పెరగడంతో 

ఎయిడ్స్‌కు నియంత్రణ తప్ప నిర్మూలన లేదు. ఆరోగ్య నియమాలు, మందులు వాడితే జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఒకప్పుడు మరణం తప్పదకునేవారు. ఇప్పుడు సాధారణ జీవితం గడపడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. జిల్లాలో గడిచిన 11 ఏళ్లలో ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్‌ కంట్రోల్‌ కేంద్రంలో 1,00,568 మంది పరీక్షలు చేసుకోగా 1634 మందికి పాజిటివ్‌ (హెచ్‌ఐవీ) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సంవత్సరం 42 మందికి పాజిటివ్‌ వచ్చింది.  జిల్లాలోని ఏఆర్‌టీ కేంద్రం ద్వారా 376 మంది మందులు పొందుతున్నారు. 

జిల్లాలో తగ్గుదల 

జిల్లాలో లెక్కలు చూస్తే హెచ్‌ఐవీ బాధితులు తగ్గినట్లుగా కనిపిస్తోంది. 2011లో 2,717 మందికి పరీక్షలు జరిపితే 204 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చింది. 2012లో 3,197 మందిలో 211, 2013లో 4389 మందిలో 181, 2014లో 4498 మందిలో 212 , 2015లో 4569 మందిలో 186,, 2016లో 4331 మందిలో 152, 2017లో 3727 మందిలో 152, 2018లో 4993లో 139 మంది, 2019లో 5140 మంలో  127, 2020లో 7048 మందిని పరీక్షించగా 74 మందిలో పాజిటివ్‌గా గుర్తించారు. ఈ ఏడాది 4473 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

నిశబ్దాన్ని ఛేదించాలి 

హెచ్‌ఐవీ సోకిందని నిశబ్దంగా ఉండడం కంటే ఏఆర్‌టీ కేంద్రాన్ని సంప్రదించి మందులు వాడాలి.  హెచ్‌ఐవీని నివారించలేకపోయిన జీవిత కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. హెచ్‌ఐవీ సోకిన వారికి కౌన్సెలింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది.  హెచ్‌ఐవీ సోకిన వారికి, సోకుతుందనే భయపడే వ్యక్తులకు, హెచ్‌ఐవీ పరీక్షలు చేయాల్సిన వారికి, చేసిన వారికి, హైరిస్క్‌ గ్రూప్‌ వారికి, హెచ్‌ఐవీకి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన పడే వారికి,  హెచ్‌ఐవీ నుంచి ఇతర వ్యాధులకు గురయ్యే వారికి, సుఖ వ్యాధులు, విచ్చలవిడి శృంగారం చేసే వారికి, హెచ్‌ఐవీతో సామాజిక పరంగా ఇబ్బందులకు గురయ్యే వారికి  కౌన్సెలింగ్‌ లేకపోతే ఆ వ్యక్తుల మానసిక స్థితి చాలా విలక్షణంగా మారిపోతుంది. రోగి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆత్మహత్యలు, డిప్రెషన్‌, కుటుంబ కలహాలు, ఇంటి నుంచి పారిపోవడం, మనస్పర్థలు, అపోహలతో అనర్థాలు తెచ్చిపెట్టుకోవడం వంటివి  చోటు చేసుకుంటాయి. 

ఆరోగ్యంపై అవగాహన 

ఎయిడ్స్‌ బాధితుడికి ఆరోగ్య విషయాలపై కౌన్సెలింగ్‌ ఇచ్చేటప్పుడు ముందుగా  సమగ్ర సమాచారాన్ని  అర్థం చేయించాలి. వ్యాధి లక్షణాలు ఏ విధంగా బయట పడతాయో తెలియజేయాలి. ఆరోగ్య రక్షణలో శారీరక,  మానసిక ఒత్తిడితో వ్యాధి  తీవ్రత పెరుగుతుందని వివరించాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి పౌష్టికాహారమైన పాలు, కోడిగుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలి. మద్యపానం, దుమపానం, జర్దా, పాన్‌, మొదలైన వాటితో కలిగే నష్టాన్ని వివరించాలి. 

 ఆదరణ ముఖ్యం 

హెచ్‌ఐవీ సోకిన వ్యక్తికి కుటుంబ సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇంటికి పోషణకు ముఖ్యమైన వ్యక్తి అయితే ఆర్థిక స్థితిని గమనించాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. హెచ్‌ఐవీ బాధితులకు అద్దె ఇల్లు దొరకడం కూడా కష్టమే. ఇటువంటి విషయంలోనూ ఇంటి వాళ్లకు కౌన్సెలింగ్‌ చేయాలి. విద్యార్థులకు ఆరోగ్యవిషయాలు చెప్పి చదువుకునే విధంగా ప్రోత్సహించాలి. పెళ్లికి ముందు ఇతరులతో లైంగిక సంబంధాలు ఉంటే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకోవాలని సూచించాలి. హెచ్‌ఐవీ ఉన్నవారు పిల్లలు కనక పోవడం మంచిది. హెచ్‌ఐవీ ఉన్న గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫ్రివెన్షన్‌ పేరెంట్‌ టూ చైల్డ్‌ ట్రాన్స్‌మిషన్‌ సెంటర్‌లోనే డాక్టర్‌ పర్యవేక్షణలో ప్రసవించాలి. నాటు వైద్యాలకు, అపోహలకు వెళ్లవద్దు. 

 

మందులు తీసుకెళ్తున్నారు 

- కాంపెల్లి గంగాధర్‌, 

సిరిసిల్ల లింక్‌ ఏఆర్‌టీ   సెంటర్‌ ఇన్‌చార్జి 

సిరిసిల్ల లింక్‌ ఏఆర్‌టీ నుంచి ప్రతి నెలా 370 మంది మందులు తీసుకెళ్తున్నారు. మొదట ఆరు నెలలు కరీంనగర్‌ నోడల్‌ కేంద్రంలో మందులు వాడుతారు. తర్వాత సిరిసిల్ల ఏఆర్‌టీ కేంద్రం నుంచి మందులు తీసుకుంటారు. మందులు వాడడంపై అవగాహన పెరిగింది. కేసులు కూడా తగ్గుతున్నాయి.


Advertisement
Advertisement