గర్వపడిన జింక జీవితం!

ABN , First Publish Date - 2022-01-27T05:30:00+05:30 IST

ఓ రోజు ఉదయం.. అడవిలోనుంచి చెంగుమంటూ ఎగురుతూ ఓ జింక నది దగ్గరకు వచ్చింది. నీళ్లు తాగి దప్పిక తీర్చుకుంది. తన ప్రతిబింబం చూసి మురిసిపోయింది. ...

గర్వపడిన జింక జీవితం!

ఓ రోజు ఉదయం.. అడవిలోనుంచి చెంగుమంటూ ఎగురుతూ ఓ జింక నది దగ్గరకు వచ్చింది. నీళ్లు తాగి దప్పిక తీర్చుకుంది. తన ప్రతిబింబం చూసి మురిసిపోయింది. ‘ఎంత అందంగా ఉన్నాయో కొమ్ములు. ఈ అడవిలో అందమైన కొమ్ములు నాకు తప్ప ఎవరికీ లేవు’ అంటూ విర్రవీగింది. పొడవుగా, బలహీనంగా ఉన్నట్లుండే తన కాళ్లను చూసి బాధపడింది. అయితేనేం కొమ్ములుంటే ఏమైనా చేయచ్చని గర్వపడింది. తనకు సాటిలేరనుకుంది.


నదిలో నీళ్లు తాగి అలా పక్కకు చూసింది. ఓ పులి వేగంగా తన వైపే వస్తోంది. జింక ఉలిక్కిపడింది. వేగంగా ఒక్క ఉదుటున దుముకి పులికి దొరక్కుండా పరిగెత్తింది. దట్టమైన అడవిలోకి వెళ్తే తప్పించు కోవచ్చనుకుంది. జింక వెనకాలే పులి పరిగెత్తింది. అయితే జింక తన కొమ్ములతో చెట్ల కొమ్మల మధ్య పరిగెత్తలేకపోయింది. ఆయాసపడింది. చివరికి పులి చేతికి చెక్కింది. ‘బలహీనమైన కాళ్లకు నన్ను బతికించే శక్తి ఉంది. అందమైన కొమ్ములు అని విర్రవీగినందుకే ఈ చావు’ అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పాటికే జింక గొంతు పులినోట్లో ఉంది.

నీతి- గర్వం పనికిరాదు. వేటినీ తక్కువ అంచనా వేయొద్దు!

Updated Date - 2022-01-27T05:30:00+05:30 IST