ట్రంప్‌కి షాక్ ఇచ్చిన అమెరికా రక్షణ మంత్రి!

ABN , First Publish Date - 2020-06-04T17:17:42+05:30 IST

అమెరికాలో చెలరేగిన అల్లర్లను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించుతానంటూ అధ్యక్షుడు ...

ట్రంప్‌కి షాక్ ఇచ్చిన అమెరికా రక్షణ మంత్రి!

న్యూయార్క్: అమెరికాలో చెలరేగిన అల్లర్లను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించుతానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడాన్ని రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ బాహాటంగా వ్యతిరేకించారు. అంతర్గత వ్యవహారాల్లోకి చట్టపరంగా సైన్యాన్ని దించేంత పరిస్థితి దేశంలో లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘శాంతి భద్రతల వ్యవహారాల్లో సైన్యాన్ని ఉపయోగించడం అనేది చిట్టచివరి పరిష్కారం. అత్యవసర పరిస్థితులు, భయంకరమైన వాతావరణం నెలకొన్నప్పుడు మాత్రమే సైన్యానికి అవకాశం ఇవ్వాలి. మనం ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేము. కాబట్టి తిరుగుబాటు చట్టాన్ని ప్రయోగించేందుకు నేను వ్యతిరేకం...’’ అని రక్షణమంత్రి కుండబద్దలు కొట్టారు.


నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిరసనకారులు అమెరికాలో చేపట్టిన ఆందోళన తీవ్ర హింస, లూటీలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీన్ని నియంత్రించడం అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారగా.. మరోవైపు పోలీసు ఎన్‌కౌంటర్లలో పలువురు మరణించడం మరింత వివాదం రేపుతోంది. ఈ నేపథ్యంలో సైన్యాన్ని దించుతానంటూ ట్రంప్ పేర్కొనడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో రక్షణ మంత్రి ఈ మేరకు స్పందించడం గమనార్హం. 

Updated Date - 2020-06-04T17:17:42+05:30 IST