ఆలస్యం ప్రాణాలు తీస్తోంది

ABN , First Publish Date - 2021-04-27T06:48:27+05:30 IST

పాజిటివ్‌ అని గుర్తించినా ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కడంలో జరుగుతున్న జాప్యంతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.

ఆలస్యం ప్రాణాలు తీస్తోంది

వైరస్‌ విజృంభిస్తోంది

రెండు ఘటనల్లో ఇద్దరి మృతి, 30 మందికి వైరస్‌


చంద్రగిరి, ఏప్రిల్‌ 26: పాజిటివ్‌ అని గుర్తించినా ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కడంలో జరుగుతున్న జాప్యంతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. రికార్డుల్లో నమోదు కాని కారణంగా ఏఎన్‌ఎంలు ఆ గ్రామాలకు రావడంలేదు. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడంలేదు. బాధితులకు మెరుగైన వైద్యం అందడంలేదు. ఈ కారణాలతో చంద్రగిరి మండలంలోని రెండు పంచాయతీల్లో 30 మందికి కరోనా వ్యాప్తి చెందింది. అందులో ఇద్దరు మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి మండలంలోని బుచ్చినాయుడుపల్లె పంచాయతీలో ఓ వృద్ధురాలికి కరోనా లక్షణాలు ఉండటంతో ఈనెల 14న తిరుపతిలోని ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించారు. పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆమెను హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచి, చికిత్స అందించారు. ఈనెల 17న ఆమె మృతి చెందింది. ఆమెకి పాజిటివ్‌ అనే సమాచారాన్ని 18వ తేదీన ఐసీఎంఆర్‌లో జనరేట్‌ చేశారు.  ఈ సమాచారంతో  వైద్య సిబ్బంది బుచ్చినాయుడుపల్లెకు వెళ్లి ఆరా తీయగా ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటికే ఆ గ్రామంలో 18 మందికి  వైరస్‌ సోకింది. 

శ్రీనివాసమంగాపురంలోనూ ఓ వృద్ధుడికి కరోనా లక్షణాలు ఉండటంతో ఈనెల 14న తిరుపతిలోని ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో  హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. ఈనెల 17న ఆయన కూడా మృతి చెందాడు. అయితే 20న ఇతడికి పాజిటివ్‌ వచ్చిందని ల్యాబ్‌ సిబ్బంది ఐసీఎంఆర్‌ జనరేట్‌ చేశారు. దీంతో వైద్య సిబ్బంది శ్రీనివాసమంగాపురం వెళ్లి ఆరా తీయగా ఆయన 17వ తేదీన మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. ఇక్కడా ఆయన కుటుంబ సభ్యులతో పాటు 12 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2021-04-27T06:48:27+05:30 IST