Abn logo
Jun 16 2021 @ 01:07AM

నిరసన హక్కు, ‘ఉగ్ర’ చర్య మధ్య.. గీతను చెరపొద్దు!

అది ప్రజాస్వామ్యానికి దుర్దినమే!!

ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ.. నిరసన ప్రాథమిక హక్కు

అది చట్టవిరుద్ధం కాదు.. ఉగ్రవాద చర్యగా పరిగణించరాదు

ఆందోళనలు కట్టుతప్పినా తీవ్రవాదంగా భావించరాదు: బెంచ్‌

ఢిల్లీ ఘర్షణల కేసులో ఇద్దరు విద్యార్థినులకు బెయిల్‌


న్యూఢిల్లీ, జూన్‌ 15: నిరసన హక్కు, ఉగ్రవాద కార్యకలాపాల నడుమ ఉన్న గీతను చెరిపేస్తే ప్రజాస్వామ్యానికి అంతకంటే దుర్దినం ఉండదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అధికారం అండ చూసుకుని.. ఉగ్రవాద నిరోధక చట్టాలను విచక్షణరహితంగా ప్రయోగించరాదని తేల్చిచెప్పింది. నిరసన ప్రాథమిక హక్కు అని.. అది చట్టవిరుద్ధం కానేకాదని.. ఉగ్రవాద చర్యగా పరిగణించరాదని హితవు పలికింది. నిరుడు ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 53 మంది మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. ఈ కుట్ర కేసులో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థినులు నటాషా నర్వాల్‌, దేవాంగన కలిత సహా 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ, యూఏపీఏఈ, ఆయుధాల చట్టాలు, ప్రజల ఆస్తులకు నష్టాన్ని నివారించే చట్టం కింద పలు కేసులు నమోదుచేశారు. నటాషా, కలితలకు జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌, అనూప్‌ జైరాం భంభానీలతో కూడిన ధర్మాసనం మంగళవారం బెయిల్‌ మంజూరుచేసింది.


సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా కలిత ఢిల్లీలో జరిగిన పలు నిరసనల్లో పాల్గొన్నారని.. అయితే శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశమై నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని.. అది చట్టవిరుద్ధం కాదని.. ఉగ్రవాద చర్యగా పరిగణించరాదని ఈ సందర్భంగా వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. ప్రభుత్వ/పార్లమెంటరీ చర్యలపై భారీ వ్యతిరేకత నెలకొన్నప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, రాస్తారోకోలు నిర్వహించడం అసాధారణమేమీ కాదని తేల్చిచెప్పింది. ఒకవేళ వీటివల్ల శాంతియుత ఆందోళనలు గాడితప్పినా.. సదరు చర్యలను యూఏపీఏ కింద ఉగ్రవాద చర్యలుగా, కుట్రగా భావించరాదని పేర్కొంది. ఈ సందర్భంగా 113, 83, 72 పేజీలతో కూడిన మూడు వేర్వేరు తీర్పులను వెలువరించింది. మన దేశ పునాదులు ఎంతో దృఢమైనవని.. ఢిల్లీలో ఓ వర్సిటీ విద్యార్థులు కొందరు చేసే నిరసనలతో అవి కదలిపోవని తెలిపింది.


పార్లమెంటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) చేయడంలో, 2004, 08ల్లో దానిని సవరించి ఉగ్రవాద కార్యకలాపాలను దాని పరిధిలోకి తేవడంలోని ప్రధాన ఉద్దేశం.. దేశరక్షణను తీవ్రంగా ప్రభావితం చేసే, దేశ ఉనికికే ముప్పుగా పరిణమించే సవాళ్లను ఎదుర్కొనడమేని.. ఇంతకుమించి వేరే ఉద్దేశం లేదని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది. ఇలాంటి తీవ్ర నేర అభియోగాలను అనవసరంగా ప్రజలపై రుద్దడం పార్లమెంటు ఉద్దేశాన్నే తక్కువ చేస్తుందని స్పష్టం చేసింది. నేరం తీవ్రమైనంత మాత్రాన బెయిల్‌ను నిరాకరించరాదని సుప్రీం స్పష్టంచేసిందని.. తీవ్ర నేరానికి ఎంతకాలం శిక్ష విధించేదీ విచారణ ముగిశాక తేలుతుందని కూడా తెలిపిందని బెంచ్‌ పేర్కొంది.  


ఆ నిర్వచనం విస్తృతం..

నటాషాపై దాఖలుచేసిన చార్జిషీటును, ప్రాసిక్యూషన్‌ పేర్కొన్న సాక్ష్యాధారాలను పరిశీలిస్తే.. (యూఏపీఏ)లోని సెక్షన్‌ 15 (ఉగ్రవాద చర్య), సెక్షన్‌ 17 (ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ), సెక్షన్‌ 18 (కుట్ర) కింద ఆమె నేరం చేసినట్లు ప్రాథమిక ఆధారాల్లేవని ఈ సందర్భంగా పేర్కొంది. ‘ఉగ్రవాద చర్యకు సెక్షన్‌ 15లో ఇచ్చిన నిర్వచనం విస్తృతమైనది.. కొంత అస్పష్టమైనది కూడా. పూర్తిగా భారత శిక్షాస్మృతి (ఐపీసీ) పరిధిలోకి వచ్చే నేరపూరిత చర్యలను.. విచక్షణ లేకుండా, అధికారం అండతో ఉగ్రవాద చర్యలుగా పేర్కొనడాన్ని అనుమతించరాదు.  రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని.. ‘చక్కా జామ్‌’ నిర్వహించారని.. మహిళలను రెచ్చగొట్టారని నటాషాపై పోలీసుల ఆరోపణలు చేశారని.. అయితే ఆమె అల్లర్లను రెచ్చగొట్టారనేందుకు నిర్దిష్ట ఆధారాల్లేవని.. అలాంటప్పుడు యూఏపీఏ కింద ఉగ్రవాద చర్యలు/కుట్రలకు పాల్పడ్డారని ఎలా అంటామని పేర్కొంది.


ఆమె విద్యానేపథ్యం, జీవన శైలిని చూశాక.. ఆమె విచారణ ఎదుర్కోకుండా పరారవుతారని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని.. సాక్షులను బెదిరిస్తారని.. కోర్టు విచారణకు ఆటంకాలు కలిగిస్తారని అనుమానించడానికి ఎలాంటి ఆధారమూ కనిపించడం లేదని తెలిపింది. నిరుడు సెప్టెంబరు 16నే చార్జిషీటు దాఖలు చేశారని.. 740 మంది ప్రాసిక్యూషన్‌ సాక్షులు ఉన్నారని.. కోర్టు విచారణ ఇంకా ప్రారంభం కాలేదని.. కొవిడ్‌ రెండో వేవ్‌ నేపథ్యంలో ఇప్పుడప్పుడే మొదలు కాకపోవచ్చని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. రూ.50 వేల బాండ్‌, అంతే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించి రెగ్యులర్‌ బెయిల్‌ పొందాలని నటాషాను ఆదేశించింది. తన పాస్‌పోర్టును అప్పగించాలని.. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని.. ప్రాసిక్యూషన్‌ సాక్షులను బెదిరించడం.. సాక్ష్యాలను తారుమారు చేయడం చేయరాదని నిర్దేశించింది. నటాషా, కలితలతో పాటు జామియా మిలియా ఇస్లామియా విద్యా ర్థి నేత అసిఫ్‌ ఇక్బాల్‌ తన్హాలకు బెయిల్‌ మంజూరుచేసింది. 


విద్యార్థినుల విడుదల వాయిదా

ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరుచేసినా.. జైలు నుంచి నటాషా, దేవాంగనల విడుదలను దిగువ కోర్టు వాయిదావేసింది. నిందితుల వివరాలు, ష్యూరిటీలపై వెరిఫికేషన్‌ నివేదిక సమర్పించాలని అదనపు సెషన్స్‌ జడ్జి రేవీందర్‌ బేడీ పోలీసులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకల్లా వీటిని సమర్పించాలని నిర్దేశించారు. 


విద్యార్థి సంఘాలు, పార్టీల హర్షం

నటాషా, దేవాంగన, అసి్‌ఫలకు బెయిల్‌ మంజూరు కావడంపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తంచేశాయి. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకర దినమని.. ఇలాంటివి మరన్ని రావాలని కోరుకుంటున్నట్లు జామియా స్కాలర్‌ సఫూరా జర్గర్‌ ట్వీట్‌ చేశారు. ఈ కేసులో ఆమెకు కూడా కొద్దిరోజుల క్రితమే బెయిల్‌ మంజూరైంది. ఢిల్లీ ఘర్షణల వెనుక ఉన్న అసలు కుట్రదారులను వదిలి విద్యార్థులపై కేసులు పెట్టారని ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ అపూర్వానంద్‌ విమర్శించారు. యూఏపీఏ కింద అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని జేఎన్‌యూఎ్‌సయూ నాయకురాలు అయిషే ఘోష్‌ డిమాండ్‌ చేశారు.


ఇది ప్రజాస్వామ్య విజయం: దేవాంగన తల్లి

ఢిల్లీ హైకోర్టు తన కుమార్తెకు బెయిల్‌ మంజూరుచేయడం ప్రజాస్వామ్య విజయమని ‘పింజరా తోడ్‌’ సంస్థ కార్యకర్త దేవాంగన కలిత తల్లి కల్పన వ్యాఖ్యానించారు. అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జూన్‌ 18 తన కుమార్తె పుట్టిన రోజని. కోర్టు తీర్పు ద్వారా బర్త్‌డేకు ముందు సూపర్‌ బహుమతి లభించిందని ఆనందంగా అన్నారు. గత ఏడాది పుట్టినరోజున ఆమె జైల్లో ఉందని.. కనీసం శుభాకాంక్షలు కూడా తెలుపలేకపోయామని చెప్పారు. చివరకు తమ న్యాయవాది కూడా దేవాంగనను కలవలేకపోయారని తెలిపారు. ఆమె తండ్రి నిరుడు ఫిబ్రవరిలో ఆమెను చూశారని.. తాను, తన కుమారుడు ఏడాదికిపైగా ఆమెను చూడలేకపోయామని అన్నారు. ఈ సందర్భంగా కొవిడ్‌తో గత నెలలో మరణించిన నటాషా తండ్రి మహావీర్‌ నర్వాల్‌ను ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనే గనుక బతికి ఉంటే ఎంతో సంతోషించి ఉండేవారని.. ఆయన తమకు మిత్రుడని.. కష్టకాలంలో అండగా నిలబడ్డారని తెలిపారు.