చెన్నాయగుంటకు విముక్తి

ABN , First Publish Date - 2021-08-30T06:51:16+05:30 IST

కబ్జా చెర నుంచి చెన్నాయగుంటకు విముక్తి కలిగించేందుకు రెవెన్యూ అధికారులు అడుగేశారు.

చెన్నాయగుంటకు విముక్తి
అధికారులతో వాగా్వదం

పోలీసుల సహకారంతో 14 షెడ్ల కూల్చివేత 


తిరుపతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కబ్జా చెర నుంచి చెన్నాయగుంటకు విముక్తి కలిగించేందుకు రెవెన్యూ అధికారులు అడుగేశారు. తిరుపతి అర్బన్‌ మండలం అక్కారంపల్లి గ్రామ లెక్కదాఖలా కొంకాచెన్నాయగుంట 173/3 సర్వే నెంబరులో 2.5 ఎకరాలు, 173/4 సర్వేనెంబరులోని 6.7 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను పోలీసుల సహకారంతో తొలగించడానికి శ్రీకారం చుట్టారు. ‘చెన్నాయగుంటను చెరబట్టారు’ శీర్షికన ఈనెల 23న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. సుమారు రూ.వంద కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కావడం జిల్లాలో కలకలం రేపింది. దీనిపై రాజకీయ వర్గాలు మౌనం దాల్చినా, కలెక్టర్‌ హరినారాయణన్‌ మాత్రం రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆదివారం తెల్లవారుజామున రెండు ఎక్స్‌కవేటర్లతో రెవెన్యూ అధికారులు చెన్నాయగుంటకు చేరి.. ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆక్రమణదారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తొలగింపు ప్రక్రియను అడ్డుకోబోయారు. తమకు స్టేటస్కో ఉంటే ఎలాతొలగిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో 173/3 సర్వే నెంబరులో స్టేటస్కో ఉన్నవాటిని వదిలేశారు. తొలిరోజు 14 షెడ్లను కూల్చినట్లు అధికారులు చెబుతున్నారు. 173/4 సర్వే నెంబరులోని ప్రహరీ నిర్మించుకున్న అధికార పార్టీ నేతల అనుచరుల గోడను కూడా కూల్చివేశారు. 


ఫోన్లు ఎత్తని నేతలు

నిర్మాణాలు తొలగిస్తున్న క్రమంలో పలువురు ఆక్రమణదారులు స్థానిక అధికార పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. వారి ఫోన్లకు అవతల నుంచి సమాధానం లేకపోవడంతో ఉసూరుమన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరే కొందరు 173/3 సర్వే నెంబరులో ఆక్రమణదారులుగా ఉన్నట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు వెళ్లిపోయిన తర్వాత పలువురు పెద్దఎత్తున అక్కడకు చేరుకున తమ నిర్మాణాలు ఉన్నాయా? లేవా? అని ఆరా తీసి వెళ్లినట్టు తెలుస్తోంది. 


తహసీల్దారుకు పలువురి అభినందనలు 

అక్రమణల తొలగింపులో అర్బన్‌ తహసీల్దారు వెంకటరమణ చొరవను పలువురు అభినందిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని దాదాపు రూ.వంద కోట్ల భూమిని కబ్జాదారులనుంచి లాక్కునే ప్రయత్నం చేయడం స్వాగతించాల్సిందే. స్టేటస్కో ఉన్న వాటికీ నోటీసులిచ్చి తొలిగించేందుకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. రెండేళ్ల కిందట కూడా ఇదే సర్వే నెంబర్లలోని పలు ఆక్రమణలను వెంకటరమణ తొలగించారు. అర్బన్‌ పరిధిలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన 27 భవనాలను నేలమట్టం చేయడం గమనార్హం. 

Updated Date - 2021-08-30T06:51:16+05:30 IST