ప్రభుత్వ స్థలంలోని గిరిజనేతరుల ఇల్లు కూల్చివేత

ABN , First Publish Date - 2021-12-07T05:37:29+05:30 IST

స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల ఎదురుగా ప్రభుత్వ స్థలంలో గిరిజనేతరులు నిర్మించిన ఇంటిని రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు.

ప్రభుత్వ స్థలంలోని గిరిజనేతరుల ఇల్లు కూల్చివేత
గృహాన్ని కూల్చి వేస్తున్న రెవెన్యూ అధికారులు


చింతపల్లి, డిసెంబరు 6: స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల ఎదురుగా ప్రభుత్వ స్థలంలో గిరిజనేతరులు నిర్మించిన ఇంటిని రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. సర్వే నంబరు 24-1లో 44సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ ఆస్పత్రి అవసరాల కోసం ప్రభుత్వం గతంలో కేటాయించింది. వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చిన దాసరి అచ్చియమ్మ 70 ఏళ్ల క్రితం సర్వే నంబరు 24-1లో తొమ్మిది సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో నివాసముంటుంది. అయితే ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటిని నిర్మించుకుని నివాసముంటున్నారని గిరిజనులు కొందరు ఇటీవల లోకాయుక్తలో కేసు వేశారు. కేసు విచారించిన లోకాయుక్త అక్రమ కట్టడాలను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపర్చుకోవాలని రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది.ఈ మేరకు సోమవారం ఉదయం దాసరి అచ్చియమ్మ ఇంటిని ఎక్స్‌కవేటర్‌తో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ గోపాలక్రిష్ణ మాట్లాడుతూ.. లోకాయుక్త, ఏపీ హైకోర్టు, పాడేరు ఏజెన్సీ డివిజనల్‌ అధికారుల ఉత్తర్వుల మేరకు గిరిజనేతరులు దాసరి అచ్చియమ్మ ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఇంటిని తొలగించామన్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను అమలుపర్చామని ఆయన తెలిపారు. 


 

Updated Date - 2021-12-07T05:37:29+05:30 IST