Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాలా వ్యవస్థలు ప్రజల విశ్వాసం కోల్పోయాయ్‌!

ఆ పరిస్థితి కోర్టు దాకా తీసుకురావొద్దు

మా ఆదేశాలు అమలు చేయకపోవడం

న్యాయస్థానాన్ని అవమానించడమే

అధికారులపై హైకోర్టు ఆగ్రహం

కోర్టు ధిక్కరణ కేసులో ‘అనంత’ డీఈఓకు శిక్ష

ఏదైనా ఆశ్రమంలో వారం పాటు

భోజన ఖర్చులు భరించాలని ఆదేశం

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): చాలా వ్యవస్థలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మీ తీరుతో ఆ పరిస్థితి న్యాయస్థానాల వరకు తీసుకురావద్దని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. తన ఉత్తర్వులు అమలు చేయకపోవడం.. కోర్టును అవమానించడమేనని.. కక్షిదారులకు న్యాయం అందకుండా అడ్డుకోవడమేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల అమలుకు అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌కు సూచించింది. కోర్టు ధిక్కరణ కేసులో అనంతపురం జిల్లా విద్యాధికారి (డీఈవో) కె.శామ్యూల్‌కు శిక్ష ఖరారు చేసింది. అనంతపురంలోని ఏదైనా వృద్ధాశ్రమం/అనాథాశ్రమంలో వారం రోజుల పాటు అక్కడ ఉన్నవారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. ఆ వివరాలను కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. నోషనల్‌ సీనియారిటీ కల్పించడం లేదంటూ అనంతపురం జిల్లాకు చెందిన సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ పి.వెంకటరమణ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, అనంతపురం డీఈవోను ప్రతివాదులుగా చేర్చారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు.. పిటిషనర్‌కు నోషనల్‌ సీనియారిటీ కల్పించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్‌ నిరుడు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. అది సోమవారం విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌, అప్పటి ప్రాథమిక విద్య కమిషనర్‌ (ప్రస్తుత గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌)  వాడ్రేవు చినవీరభధ్రుడు, డీఈవో శామ్యూల్‌ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆ ముగ్గురు అధికారులను కోర్టు వివరణ కోరింది. కోర్టు ఆదేశాలు ఏడాది పాటు అమలుకాకపోవడానికి డీఈవోనే కారణమని తేల్చింది. శిక్ష విధించే ముందు చెప్పుకొనేందుకు ఏమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. భవిష్యతలో కోర్టు ఉత్తర్వుల అమలులో మరింత జాగ్రత్తగా ఉంటానని.. ఈ ఒక్కసారికీ క్షమించాలని శామ్యూల్‌ కోరారు. క్షమాపణలు అంగీకరించాలంటే సామాజిక సేవ చేయాలని.. అందుకు సిద్ధమేనా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. డీఈవో అందుకు సమ్మతించారు. దరిమిలా ధిక్కరణ వ్యాజ్యంపై విచారణను కోర్టు మూసివేసింది.


Advertisement
Advertisement