చితికిన బతుకులు

ABN , First Publish Date - 2021-12-06T04:14:46+05:30 IST

ఎదిగొచ్చిన కొడుకు చనిపోవడం, ఆ గాయం మానకమునుపే కట్టుకున్న భర్తను యాక్సిడెంట్‌ రూపంలో కోల్పోవడంతో ఇటు కొడుకు, అటు భర్త లేక ఆ తల్లి పడుతున్న వేదన మాటల్లో చెప్పలేనిది.

చితికిన బతుకులు
- మహ్మద్‌ హేసేన్‌ (ఆరీఫ్‌ తండ్రి)

చెల్లాచెదురైన దిశ నలుగురు నిందితుల కుటుంబాలు 

మగదిక్కులేక అనాథలమయ్యామనే వేదన

పోషించేవారులేక రోడ్డున పడ్డ వైనం 

దూరమైన బిడ్డల్ని తల్చుకుంటూ కుములుతోన్న తల్లులు  

కూలీ పనులు చేసుకుంటూ జీవనం 

చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు నేటితో రెండేళ్లు


ఎదిగొచ్చిన కొడుకు చనిపోవడం, ఆ గాయం మానకమునుపే కట్టుకున్న భర్తను యాక్సిడెంట్‌ రూపంలో కోల్పోవడంతో ఇటు కొడుకు, అటు భర్త లేక ఆ తల్లి పడుతున్న వేదన మాటల్లో చెప్పలేనిది. మగదిక్కు లేకపోవడంతో ఇంట్లో ఉన్న నలుగురు ఆడవాళ్ల బాధ్యత తనమీదే వేసుకొని జీవనం సాగిస్తోంది చెన్నకేశవులు తల్లి జయమ్మ. 

................................................

భార్య అనారోగ్యానికి గురవడం, కొడుకు చనిపోవడంతో కూతురికి బంధువుల సహాయంతో పెళ్లి చేశాడు మహ్మద్‌ ఆరీఫ్‌ తండ్రి హుసేన్‌. వృద్ధాప్యం వేధిస్తున్నా వేళకు నాలుగు ముద్దలు తినడం కోసం, చేసిన అప్పులు కొంతైనా తీర్చడం కోసం, భార్యకు మందులు కొనడం కోసం కూలి పనులకు వెళ్తున్నాడు. దూరమైన ఎదిగిన కొడుకును తల్చుకొని, వచ్చే ఏడుపుని దిగమింగుతూ జీవనం సాగిస్తున్నాడు.

................................................

కొడుకు సుఖపెడతాడనుకుంటే ఉన్నట్లుండి  చనిపోవడంతో అతని జ్ఞాపకాలతో కుమిలిపోతూ జీవిస్తున్నారు జొల్లు శివ తల్లిదండ్రులు రాజయ్య, మణెమ్మ. ఏడ్చీ ఏడ్చీ బీపీ, షుగర్‌లతో పాటు, కంటి సమస్యలు వచ్చాయని, బతకడం కోసం కూలీకి వెళ్తున్నామని చెబుతున్నారు. ఎక్కడ తిరిగినా వాడి జ్ఞాపకాలే వేధిస్తున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు.

................................................

చిన్న వయసులోనే భర్తను, ఇప్పుడు ఎదిగొచ్చిన కొడుకును కోల్పోయిన నవీన్‌తల్లి లక్ష్మి శోకం చెప్పనలవి కాకుండా ఉంది. కన్నీటినీ దిగమింగుతూ, కూతురిలోనే కొడుకునూ చూసుకుంటూ కూలి పనులతో కాలం వెళ్లదీస్తోంది. ఊళ్లో వాళ్లు చిన్నచూపు చూసినా వేదన పడడం తప్ప ఎదురించలేని దీనస్థితిలో ఉన్నామని, భగవంతుడే తనను చిన్నచూపు చూశాక ఈ అవమానాలు ఎదుర్కొకపోతే చేసేదేముంటుందని లక్ష్మి వాపోతోంది.


 ఛటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యాచార కేసు నలుగురి నిందితుల కుటుంబాల ప్రస్తుత పరిస్థితి ఇది. ఆ కేసు నిందితులైన మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన మహ్మద్‌ ఆరీఫ్‌, గుడిగండ్లకు చెందిన జొల్లు చెన్నకేశవులు, నవీన్‌, శివ 2019 డిసెంబర్‌ 6న రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాలంలో చెన్నకేశవులు తండ్రి కురుమయ్య స్వగ్రామం వద్దే రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలవగా, చికిత్స పొందుతూ రెండున్నర నెలల తర్వాత చనిపోయాడు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిపైనే ఆధారపడ్డ ఆ కుటుంబాలు వారి మృతితో చెల్లాచెదురయ్యాయి. తల్లిదండ్రులు, వృద్ధులు, అక్కాచెల్లెళ్లు అనాథలమయ్యాయనే వేదనలో  ఉన్నారు. చెన్నకేశవులు చనిపోయినప్పుడు అతని భార్య గర్భవతి. మైనర్‌ కూడా అయినా ప్రభుత్వం కనీసం సంరక్షించే చర్యలు చేపట్టలేదు. చెన్నకేశవులు తండ్రి కురుమయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైతే, ఆ ప్రమాదంపై లోతైన విచారణ జరుపలేకపోయారు. ఇలా ఒకదాని వెంట ఒక విషాదం ఆ కుటుంబాల్ని వెంటాడడంతో నేడు జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని వాపోతున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగి సోమవారంతో రెండేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడింది. వివరాలు వారి మాటల్లోనే..

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


పోషించేవాడులేక అనాథలమయ్యాం 

- మహ్మద్‌ హేసేన్‌ (ఆరీఫ్‌ తండ్రి)

మా కొడుకు బతికున్నప్పుడు వాడి సంపాదనతోనే ఇల్లు గడిచేది. చెల్లి పెళ్లి చేస్తానని, మమ్మల్ని సుఖంగా చూసుకుంటానని వాడు చెప్పిన మాటలే ఇప్పటికీ మాకు చెవుల్లో వినిపిస్తున్నాయి. ఉన్నట్లుండి చెట్టంత కొడుకు దూరమయ్యాడు. ఉన్న ఒక్క ఆధారమూ లేక జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం. బంధువుల సహాయంతో అమ్మాయికి పెళ్లి చేశాం. కూలికి వెళ్లినా పనిచేయలేకపోతున్నా. దీంతో చాలా మంది నన్ను కూలికి పిలవడం లేదు. మా ఆమె మౌలానీబీకి కొడుకు బతికున్నప్పుడే రెండు ఆపరేషన్లయ్యాయి. కష్టాలు గట్టెక్కాం. కొడుకు ఎదిగాడు. మమ్మల్ని పోషిస్తాడనుకున్న సమయంలో రోడ్డున పడ్డాం. పిల్ల పెళ్లికి చేసిన అప్పు ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదు. ఏదన్నా కూలి దొరికిన రోజు వెళుతున్నా. లేని రోజు లేదు. రేషన్‌ బియ్యం వస్తాయి. వాటితో పాటు కూలికి వెళ్తే వచ్చే డబ్బులతో బతుకుతున్నాం. మా ఆమెకు ఆపరేషన్లు కావడంతో పని చేయలేదు. ఆమెకి గవర్నమెంట్‌ దవాఖానాలో మందులు తెచ్చుకుంటున్నాం. నాకు 59 ఏళ్లు. పింఛన్‌ వస్తుందంటే దరఖాస్తు పెట్టుకున్నా. ఇంకా ఇవ్వడం లేదు. వృద్ధాప్యంలో అండగా ఉండి పోషిస్తాడనుకున్న కొడుకు దూరమవడంతో అనాథల్లా జీవిస్తున్నాం. 


అప్పులు, రోగాల పాలయ్యాం 

- జొల్లు రాజయ్య (జొల్లు శివ తండ్రి)

కళ్ల ముందు తిరగాడే కొడుకు చనిపోవడంతో రెండేళ్లుగా ఆ బాధ నుంచి తేరుకోలేక పోతున్నాం. కన్ను మూస్తే వాడి రూపమే మొదలుతుంది. ఏడ్చీ ఏడ్చీ రోగాల పాలయ్యాం. నాకు బీపీ, షుగర్‌ వచ్చాయి. పని చేయలేకపోతున్నా. నా భార్య మణెమ్మ పరిస్థితీ అంతే. అయినా ధైర్యం చేసుకుని బతుకుతున్నాం. ఆమె కూలికి పోతేనే మాకు పూట గడుస్తుంది. పెద్ద కొడుకు పెళ్లవగానే వేరుపడడంతో శివ మీదే ఆధారపడి బతికేవాళ్లం. వాడు పోయాక మాకు ఎటూ తోయడం లేదు. ఆపద వస్తే ఆదుకునే నాథుడు లేకుండా పోయాడు. రోగాలకు వైద్యం కోసం, కేసుల కోసం తిరిగి అప్పులపాలయ్యాం. రెండేళ్లుగా ఎంతో మనోవ్యథ అనుభవించాం. ఎదిగొచ్చిన కొడుకు అన్యాయంగా చనిపోతే, ఏ తల్లిదండ్రికైనా ఈ బాధే ఉంటుంది. మరో తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రావద్దు. కూలీ చేసుకొని జీవితం గడుతున్నాం. కూలే ఇంటిగోడల మధ్య కొడుకుని తలచుకొని ఎన్నో రాత్రులు నిద్రలేకుండా కన్నీటితో గడి పాం. భగవంతుడే మా బాధని తీర్చాలి. 


నా బాధ పగవాళ్లకీ రావద్దు 

- జయమ్మ, (చెన్నకేశవులు తల్లి)

రెండేళ్ల కింద నా కొడుకు చెన్నకేశవుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత నాలుగు నెలలకే నా భర్త కురుమయ్య కూడా యాక్సిడెంట్లో గాయపడి, ఆస్పత్రిలో రెండు నెలలుండి చనిపోయారు. మా ఇంటికి ఉన్న మగదిక్కు ఇద్దరినీ కోల్పోయా. నా జీవితం ఎందుకు? నా కోడలు, నేను, నా మనవరాలు,  మా అత్త నలుగురం ఆడవాళ్లమే మిగిలాం. మా అత్త పని చేయలేదు. మా కోడలు మనవరాలిని చూసుకోవడానికే సరిపోద్ది. ఉన్న ఇల్లూ ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. చెట్టంత భర్త, ఎదిగిన కొడుకు చనిపోవడంతో మేం దిక్కులేనివాళ్లమయ్యాం. మా ఆయన చనిపోయాక ఆయన చేసే ఉద్యోగం(పంచాయతీ వాటర్‌మెన్‌) నాకియ్యమంటే ఆడవాళ్లకి ఇవ్వమని నెట్టేశారు. కొడుకునీ, భర్తని తలుచుకొని ఏడుస్తూ బతుకుతున్నాం. ఇంటికి  వస్తే వాళ్ల జ్ఞాపకాలే తరుముతున్నాయి. ఒక పక్క వాళ్లులేరనే బాధ ఉంటే, మరో పక్క నాపై ఆధారపడ్డ వాళ్లని బతికించడానికి కూలికి వెళుతున్నా. భూమి రెండెకరాలున్నా పంటలేసి పండించే శక్తి లేకపోవడంతో బీడుగానే వదిలేశాం. వితంతు పింఛన్‌ వస్తుందంటే దరఖాస్తు చేసుకున్నా. ఇంకా రావడం లేదు. కూలి చేస్తూనే జీవిస్తున్నాం. మగదిక్కు లేక అనాథలమయ్యాం. పగవాళ్లకి కూడా మా బాధ రావద్దు.


బిడ్డలోనే కొడుకునీ చూసుకుంటున్నా..

- లక్ష్మి (నవీన్‌ తల్లి)

చిన్న వయసులోనే భర్తను కోల్పోయా. కూలీ పనులు చేసుకుంటూ కొడుకు, బిడ్డను పోషించుకునేదాన్ని. కొడుకు చేతికందొచ్చాడు ఇక నా కష్టాలు గట్టెక్కుతాయని ఆశపడ్డ. నా ఆశను దేవుడు ఓర్వలేదు. నా కొడుకు పాపం చేశాడో లేదో భగవంతుడికే తెలియాలి. వాడు చనిపోవడంతో నాకైతే శోకమే మిగిలింది. వాడు బతికున్నప్పుడు చెప్పిన మాటలు యాదికొస్తున్నాయి. చెల్లెల్ని బాగా చదివిస్తానని, ఇల్లు కట్టుకుందామని, నన్ను ఇంట్లోనే కూర్చొబెట్టి పోషిష్తానన్న బాసలు తల్చుకొంటే కన్నీళ్లు పొంగుకొస్తున్నవి. మాకు దిక్కెవరూ లేదు. ఉన్న బిడ్డలోనే కొడుకునీ చూసుకుంటున్నా. గుండెని రాయి చేసుకొని కూలి పనికి వెళ్లి, బతుకుతున్నా. కొడుకు చనిపోవడంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. భగవంతుడు మాకు ఈరాత రాశాడు. అనాథల్లా మిగిలిపోయాం.







Updated Date - 2021-12-06T04:14:46+05:30 IST