ఆర్టీసీ.. లెక్కే వేరు!

ABN , First Publish Date - 2021-03-01T06:44:59+05:30 IST

ఆర్టీసీ విజయవాడ డిపో నుంచి ఒక ఏడీసిని ఇటీవల అవనిగడ్డ డిపోకు డిప్యుటేషన్‌పై పంపించారు.

ఆర్టీసీ.. లెక్కే వేరు!

పదోన్నతులకు బదులు డిప్యుటేషన్లు 

ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో అడ్డగోలుగా ఏడీసీల బదిలీలు 

ఖాళీగా ఉన్న టీఐ-3 స్థానాల్లో ఏడీసీల చేత విధులు

తగ్గితే విజయవాడ నుంచి డిప్పుటేషన్లు

ఏడేళ్లుగా పదోన్నతులకు ఏడీసీలు దూరం


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఆర్టీసీ విజయవాడ డిపో నుంచి ఒక ఏడీసిని ఇటీవల అవనిగడ్డ డిపోకు డిప్యుటేషన్‌పై పంపించారు. జీతం విజయవాడలో.. ఈయన పనిచేసేది అవనిగడ్డలో. విజయవాడ ఉద్యోగి కాబట్టి 20 శాతం హెచ్‌ఆర్‌ఏ కూడా అందుకుంటున్నారు. ఇంతకీ ఈయన విజయవాడ నుంచి అక్కడికి వెళ్లరు. అవనిగడ్డకు చెందిన వ్యక్తే కాబట్టి అక్కడే ఉంటారు. మరి విజయవాడలో జీతం ఎందుకు ఇస్తున్నారు? హెచ్‌ఆర్‌ఏ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? అని లోతుగా పరిశీలిస్తే.. ఏడేళ్లుగా ఆర్టీసీలో ఏడీసీలను పదోన్నతులకు దూరంగా ఉంచి టీఐ-3లను కదిలించకుండా అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సంస్థకు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయో అర్థం అవుతుంది.


పదోన్నతులకు దూరంగా ఏడీసీలు 

ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో ఏడేళ్లుగా ఏడీసీల పదోన్నతులు జరగటం లేదు.  ప్రతి మూడేళ్లకు ఒకసారి పదోన్నతులు జరగాలి. కానీ చాలినంతమంది టీఐ-3లు ఉండడాన్ని సాకుగా చూపిస్తూ, ఆర్టీసీ అధికారులు పదోన్నతులను పక్కన పెట్టేశారు. అధికారుల లెక్క ప్రకారం రీజియన్‌లో 65 మంది టీఐ-3లున్నారు. ఉండాల్సింది కూడా అంతమందే. మరి సమస్య ఎక్కడ ఉందంటే కొన్ని డిపోల్లో అవసరాన్ని మించి టీఐ-3లు పాతుకుపోవడం, మరికొన్ని డిపోల్లో అసలు లేకపోవడమే. ఈ కారణంగానే అవనిగడ్డకు ఓ ఏడీసీని బదిలీ చేశారు. అవనిగడ్డ డిపోలో అసలు టీఐ-3లే లేరు. అక్కడ ముగ్గురు పనిచేయాల్సి ఉండగా.. ఏడీసీలతో ఆ పనులు చేయిస్తున్నారు. ఇటీవల అవనిగడ్డ డిపోలో పనిచేస్తున్న టీఐ-3 విధులు నిర్వహిస్తున్న ఏడీసీ మంత్రి సిఫార్సులతో గుడివాడకు పోస్టింగ్‌ వేయించుకున్నారు. ఆ ఖాళీలోకే విజయవాడ నుంచి మరో ఏడీసీని డిప్యుటేషన్‌ మీద పంపించారు. ఆయనది అవనిగడ్డే అయినా, జీతం విజయవాడలో తీసుకుంటున్నందున 20 శాతం హెచ్‌ఆర్‌ఏ అదనంగా ఇస్తున్నారు. కానీ అవనిగడ్డ డిపోలో టీఐ-3 విధులు నిర్వహిస్తున్న మిగిలిన ఏడీసీలకు ఈ అవకాశం లేదు. 


సర్దుబాటుపై దృష్టి పెట్టరు

ఇబ్రహీంపట్నం, గవర్నర్‌ పేట-1, 2, గుడివాడ డిపోల్లో అవసరాన్ని మించి టీఐ-3లు ఉన్నారు. వారిలో కొందరిని అవసరమైన డిపోలకు బదిలీ చేస్తే సమస్యే ఉండదు. కానీ అర్టీసీ అధికారులు ఆ పని చేయలేరు. వారికి రాజకీయ సిఫార్సులతో పాటు, ఉద్యోగ సంఘాల మద్దతు కూడా ఉండడమే కారణమని తెలుస్తోంది. 


చేతి చమురు వదిలించుకుంటున్న ఆర్టీసీ 

ఆర్టీసీ అధికారులు టీఐ-3లకు కొమ్ముకాస్తున్నందుకు సంస్థపైనే భారం పడుతోంది. సిటీ డిపోలో అవసరాన్ని మించి పనిచేస్తున్న టీఐ-3లకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏను అదనంగా సమర్పించుకోవాలి. అదే వీరిని అన్ని డిపోలకు సర్దితే ఈ భారం తగ్గుతుంది. ఈ మాత్రం అధికారులకు తెలియదనుకోవాలా?

Updated Date - 2021-03-01T06:44:59+05:30 IST