కోవిడ్‍ సంక్షోభంపై కేంద్రాన్ని నిలదీసిన డెరిక్ ఒబ్రెయిన్

ABN , First Publish Date - 2020-09-16T23:29:23+05:30 IST

కోవిడ్-19 సంక్షోభంపై కేంద్రాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ బుధవారంనాడు ..

కోవిడ్‍ సంక్షోభంపై కేంద్రాన్ని నిలదీసిన డెరిక్ ఒబ్రెయిన్

న్యూఢిల్లీ: కోవిడ్-19 సంక్షోభంపై కేంద్రాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ బుధవారంనాడు రాజ్యసభలో సూటిగా నిలదీశారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్‌ను ఆయన 'పీఎమ్స్ కుడ్‌నాట్-కేర్-లెస్ ఫండ్' అంటూ సంబోధించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేటప్పుడు కేంద్ర నమ్రతతో ఉండాలన్నారు.


'కరోనాపై పోరాటంలో రాష్ట్రాలతో కేంద్రం నమ్రతతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారిని ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చకూడదు' అని డెరిక్ ఒబ్రెయిన్ అన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వ సన్నద్ధతను కూడా ఆయన ప్రశ్నించారు. 'ఈ ప్రభుత్వం ఎలాంటి సన్నాహకాలు చేసింది? మార్చి 18న మేము తృణమూల్ నుంచి పార్లమెంటుకు మాస్క్‌లు ధరించి వస్తే, ఏం జరిగింది?. మాలో ఐదుగురు ఎంపీలను సభ విడిచి వెళ్లాలన్నారు' అని డెరిక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించడానికి మాత్రమే సన్నాహకాలు చేశారని ఆయన అన్నారు.




ట్రంప్‌కు లడ్డూలిచ్చారు...

'మీరు ఎలాంటి సన్నాహకాలు (కోవిడ్‌పై పోరాటానికి) చేయలేదు. ట్రంప్ వచ్చినప్పుడు మాత్రమే చేశారు. అప్పుడు మీరేం చేశారు? ట్రంపుకు లడ్డూలు ఇచ్చారు. ధోక్లా ఇచ్చారు. ఇంకా మీరేమి ఇచ్చారో నాకు తెలీదు. కానీ, కేవలం 4 గంటల సమయం చేతిలో మిగిలి ఉండగా అకస్మాత్తుగా దేశంలో 21 రోజుల లాక్‍డౌన్ ప్రకటించారు. అదికూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి సన్నద్ధత లేకుండా లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై నిర్ణయాలు తీసుకునే సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకోలేదు' అని ఆయన వరుస విమర్శలు గుప్పించారు.


'మీరు ముఖ్యమంత్రులతో మాట్లాడానని చెబుతున్నారు. నేను సవాలు చేస్తున్నాను. లాక్‌డౌన్‌కు ముందు ముఖ్యమంత్రులకు మీరు ఏమి రాశారు?. ఒక్క మీటింగ్ కూడా జరగలేదు కానీ, 45 వీడియో కాన్ఫరెన్స్‌లు జరిపామని మీరు చెప్పారు. లాక్‌డౌన్‌కు ముందు ఇలాంటి వీడియో కాన్ఫరెన్స్‌లు ఎన్ని జరిపారు?' అని డెరిక్ ఒబ్రెయిన్ కేంద్రాన్ని ప్రశ్నించారు.

Updated Date - 2020-09-16T23:29:23+05:30 IST