Abn logo
Apr 9 2021 @ 01:06AM

దేశ్‌ముఖ్‌, మహా సర్కార్‌లకు ఎదురుదెబ్బ

సీబీఐ దర్యాప్తు రద్దుకు సుప్రీం నో


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు, ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేశ్‌ముఖ్‌పై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌సింగ్‌ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. నెలకు రూ.100 కోట్ల చొప్పున హోటళ్లు, బార్లు, హుక్కా సెంటర్ల నుంచి వసూలు చేయాలంటూ దేశ్‌ముఖ్‌ పోలీస్‌ అదికారులను, ముఖ్యం గా వివాదాస్పద పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేకు టార్గెట్‌ విధించారన్నది పరమ్‌బీర్‌ ఆరోపణ. ‘‘ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఒకరేమో హోం మంత్రి, మరొకరు సీపీ.. అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అక్కర్లేదా? తమ పదవుల నుంచి తప్పుకునేదాకా ఇద్దరూ కలిసి పనిచేసినవారే. ఆరోపణలు రాగానే దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయలేదు. బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేంత వరకూ పదవిని పట్టుకుని వేలాడారు. 


ఆయనకు అన్నాళ్లూ కుడిభుజంగా ఉన్న వ్యక్తి ఆరోపణలు చేశారు. అందుచేత వీటిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు అవసరమే. హైకోర్టు కూడా ప్రాథమిక దర్యాప్తు మాత్ర మే జరిపి 15 రోజుల్లోగా విషయాన్ని తేల్చమంది. దాన్ని నిలిపేయడమెందుకు?’’ అని జస్టిస్‌ ఎస్కే కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం పేర్కొ న్నది. బయటి సంస్థలు దర్యాప్తు చేయాలని ఓ నిందితుడు కోరడం సరైనదేనా? అని దేశ్‌ముఖ్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ను బెంచ్‌ ప్రశ్నించగా.. ‘దేశ్‌ముఖ్‌ నిందితుడూ కాదు, అనుమానితుడూ కాదు. ఎలాంటి ఆధారాల్లేకుండా ఇక్కడా అక్కడా విన్న మాటలు విని ఈ కేసులు వచ్చాయి. దేశ్‌ముఖ్‌తో మీటింగ్‌లో పాల్గొన్న సచిన్‌ వాజే ఒక వ్యక్తికి ఆ వివరాలు చెప్పారట. ఆయనేమో ఛగన్‌ భుజ్‌బల్‌కు చెప్పారట. ఆయన సీపీకి చేరవేశాట్ట. సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ ఈ విషయాన్ని తనపై బదిలీ వేటు పడ్డాక బయటపెట్టాట్ట. ఇదం తా మాటలపోగే తప్ప ఆధారాల్లేని విషయం’ అని సిబాల్‌వాదించారు. దానితో బెంచ్‌ఏకీభవించలేదు.


రవాణా మంత్రి కూడా అదే దారి!

రవాణా మంత్రి అనిల్‌ పారబ్‌పైనా అవినీతి ఆరోపణలు రేగాయి. కాంట్రాక్టర్ల నుంచి లంచాల వసూలుకు సహకరించాల్సిందిగా ఆయన గతంలో తనను కోరారని సచిన్‌ వాజే ఎన్‌ఐఏ ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్లు బయటకు పొక్కింది. ఈ మేరకు వాజే ఎన్‌ఐఏకు ఓ లేఖ కూడా ఇచ్చారని బయటపడింది. ఈ ఆరోపణలను పారబ్‌ ఖండించారు. కాగా, 10, 15 రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘ఆ ఇద్దరిపైనా కొందరు వ్యక్తులు కోర్టుల్లో పిటిషన్లు వేస్తారు. వారి బర్తరఫ్‌ కోరతారు. ఎవరన్నది మున్ముందు తేలుతుంది. రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు మహారాష్ట్రలో నెలకొన్నాయి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత పాటిల్‌ అన్నారు. వీటిని నీచ రాజకీయాలంటూ శివసేన దుయ్యబట్టింది.

Advertisement
Advertisement
Advertisement