ధర్మయోధుడు

ABN , First Publish Date - 2021-12-28T06:32:33+05:30 IST

దక్షిణాఫ్రికా విముక్తికీ, వర్ణవివక్ష అంతానికీ అపూర్వ పోరాటం చేసిన హక్కుల కార్యకర్త అర్చ్ బిషప్ డెస్మండ్ టుటు తొమ్మిదిపదుల వయసులో కన్నుమూశారు...

ధర్మయోధుడు

దక్షిణాఫ్రికా విముక్తికీ, వర్ణవివక్ష అంతానికీ అపూర్వ పోరాటం చేసిన హక్కుల కార్యకర్త అర్చ్ బిషప్ డెస్మండ్ టుటు తొమ్మిదిపదుల వయసులో కన్నుమూశారు. నల్లజాతివారి విముక్తికోసం పోరాడిన గొప్పవ్యక్తిగానే కాక, హక్కుల పరిరక్షకుడిగా, నైతికతకు నిలువెత్తు రూపంగా ఇంటా బయటా నిలిచిన వ్యక్తి టుటు. ఆఫ్రికన్లు ‘ది అర్చ్’ అని ఆయనను చివరివరకూ ప్రేమగా పిలుచుకున్నారు. మతహోదాలు ఆయన పోరాటానికి అడ్డం కాలేదు సరికదా, అన్యాయాలపైనా, సకలవివక్షలపైనా పోరాటం మతపెద్దగా తన ధర్మమని నమ్మిన ఆయన కన్నుమూసేవరకూ అదేబాటలో నడిచారు. 


నాలుగేళ్ళక్రితం, తన 86వ ఏట ఆయన పాలుపంచుకున్న పోరాటం ఆయన ఆదర్శాలకు, అంకితభావానికి గొప్ప నిదర్శనం. వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమకారుల్లో ప్రముఖుడైన ప్రవీణ్ జమ్నాదాస్ గోర్థన్‌ను ఆర్థికమంత్రి పదవినుంచి అప్పటి దేశాధ్యక్షుడు జాకోబ్ జుమా తొలగించినందుకు ఆగ్రహించిన టుటు ఆరోగ్యం ఏమాత్రం సహకరించని స్థితిలో సైతం నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన కలలుగనే ‘రెయిన్ బో నేషన్’ సూత్రానికి ఈ నిర్ణయం వ్యతిరేకం కనుక ఆయనకు ఆగ్రహం కలిగింది. దేశంలోని ప్రజలందరికీ సముచితమైన ప్రాతినిధ్యం ఇవ్వని ప్రభుత్వం పాలనకు అనర్హమైనదని ఆయన వాదన. వర్ణ వివక్ష ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికాలో జాతుల సమ్మిశ్రమాన్ని ఆకాంక్షిస్తూ ఆయన ఈ పదాన్ని రూపొందించారు. తాను కలలుగన్న రీతిలో దేశం సమైక్యం కాలేదని తరువాతి కాలంలో ఆయన వాపోయారు. తెల్లజాతీయుల పాలనలో నల్లజాతివారి హక్కుల కోసం, బాధితులకోసం పోరాడిన ఆయన స్వజాతీయుల పాలనలో కూడా అవే విలువలతో నడిచారు. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో కొనసాగుతూనే ఆ పార్టీ నాయకుల అక్రమాలపై విరుచుకుపడేవారు. 


దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య పోరాటాన్ని టుటు లేకుండా ఊహించడం కష్టం. ఇతర నాయకులు జైళ్ళలో మగ్గుతూ, హత్యలకు గురవుతూ, ప్రవాసానికి పారిపోతున్న స్థితిలో ఈ మతబోధకుడు పోరాటంలో బలంగా నిలబడి దానిని సజీవంగా ఉంచేందుకు తోడ్పడ్డారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వర్ణ వివక్షతను ప్రశ్నిస్తూ, విముక్త ఉద్యమం గాడితప్పకుండా చూస్తూ, శ్వేతజాతి ప్రభుత్వాన్ని నాజీ పాలనతో పోల్చుతూ పశ్చిమదేశాలకు చురకలు అంటిస్తూ, సవాళ్ళు విసురుతూండేవారు ఆయన. మిగతా ప్రపంచం దృష్టి దక్షిణాఫ్రికావైపు నిత్యమూ నిలిచివుండేట్టు చేశారాయన. ఇరవై ఏడేళ్ళు జైల్లో గడిపిన నెల్సన్ మండేలా విడుదల కావడంతోనే టుటు నివాసానికి పోయి ఒకరోజంతా అక్కడే ఉండిపోవడం వారి స్నేహాన్నే కాక, టుటు ప్రభావశీలతను తెలియచేస్తుంది. పోరాటం ఒక కొత్త దిశను సంతరించుకోబోతున్న తరుణంలో దక్షిణాఫ్రికా శ్వేతజాతి ప్రభుత్వంపై అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో విరుచుకుపడి దారికి తెచ్చేట్టు చేసే బాధ్యతను టుటు స్వీకరించారు. 


ఆయన భావోద్వేగాలు దాచుకునే రకం కాదు. వేలాదిమంది మధ్యన ఎంత హాయిగా నవ్వుతూ డాన్సు చేయగలరో, లక్షలమందిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మాట తడుముకోకుండా మనసులో ఉన్నది చెప్పేయగలరు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వంమీద ఆయన పదునైన విమర్శలు చాలామందిని ప్రత్యర్థులుగా మార్చేశాయి. దక్షిణాఫ్రికాను పాలించడానికి ఏఎన్‌సికి అర్హతలేదన్నారు ఓసారి. అలాగే 2011లో విశ్వశాంతిపై ఏర్పాటు చేసిన ప్రసంగానికి దలైలామాను ప్రభుత్వం అనుమతించనందుకు కోపగించి, ప్రభుత్వ పతనం కోసం ప్రార్థనలు చేస్తానని ప్రకటించారు. సాటి మనిషిని గౌరవించడం, ప్రేమించడం అనే అత్యున్నత విలువకు యావత్ ప్రపంచం కట్టుబడి పరస్పర ఆధారితంగా కొనసాగాలన్నది ఆయన ఆకాంక్ష. 


ఉపాధ్యాయ వృత్తిలో కొంతకాలం కొనసాగిన ఆయన 1953లో శ్వేతజాతి ప్రభుత్వం దేశంలో కేవలం నైపుణ్యంలేని కూలీలను మాత్రమే తయారుచేసే బంటు విద్వావిధానాన్ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా రాజీనామా చేసి చర్చి సేవల్లోకి ప్రవేశించారు. ఆయన అధ్యాపకత్వం, విస్తృత అధ్యయనం, వివిధ సిద్ధాంతాలపట్ల ఉన్న లోతైన అవగాహన, మంచి వాగ్ధాటి ఆయన లక్ష్యసాధనకు ఎంతో ఉపకరించాయి. అవిశ్వాసం, ఘర్షణలకు తావులేని శాంతియుత ప్రపంచం కోసం టుటు కన్న కలలు నెరవేరకపోయినా ఆయన మిగల్చిన విలువలు కలకాలం నిలిచివే.

Updated Date - 2021-12-28T06:32:33+05:30 IST