Abn logo
Oct 22 2021 @ 00:07AM

రైతన్నకు డీజిల్‌ దెబ్బ

వరి కోతలకు రేటు పెంచిన హార్వెస్టర్‌ యజమానులు

డీజిల్‌ ధరల పెంపు సాకుతో అమాంతంగా యాభైశాతం పెంపు

3.16 లక్షల ఎకరాల్లో వరిసాగు


పంట చేతికొస్తున్నదని సంతోషించాల్సిన వేళ.. తడిసి మోపడవుతున్న ఖర్చులతో అన్నదాతలు సతమతమవుతున్నారు . మరో వారం రోజుల్లో ధాన్యం దిగుబడి రానున్నది. ఇప్పటికే అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో చిన్నాభిన్నమైన రైతులకు చివర్లోనూ ఇబ్బందులు ముంచు కొచ్చాయి. వరి కోతల సమస్య ఇప్పుడు రైతన్నకు గుదిబండగా మారింది. పెరిగిన డీజిల్‌ ధరలతో హార్వెస్టర్ల నిర్వాహకులు సైతం అమాంతం రేట్లను పెంచారు. దీంతో ఎకరాకు రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 21 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కలిపి 3.16 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరో నెలన్నర రోజుల పాటు వరి కోతల్లోనే రైతులు నిమగ్నమవుతారు. కాగా గతంలో కూలీల ద్వారానే ఎక్కువగా వరి కోతలు చేసేవారు. కానీ కొన్నేళ్లుగా హార్వెస్టర్‌ యంత్రాలనే నమ్ముకున్నారు. పంట అడుగు భాగంలో తడి ఉంటే చైన్‌ మిషన్లు.. లేకుంటే నాలుగు టైర్ల హార్వెస్టర్లతో వరి కోతలు చేయిస్తున్నారు. 


పెరిగిన డీజిల్‌ ధరతో..

గతేడాది లీటరు డీజిల్‌కు రూ.80 ఉండగా.. ప్రస్తుతం రూ.103 పైచిలుకు ఉంది. రోజురోజుకూ ధర పెరుగుతూనే ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ డీజిల్‌ ధర పెరుగుదల భారం కాస్తా రైతులపై పడింది. గతేడాది చైన్‌ హార్వెస్టర్‌తో ఒక ఎకరా పొలంలో వరి కోత చేయిస్తే రూ.4 వేల వరకు ఖర్చు అయ్యేది. కానీ ప్రస్తుతం రూ.6వేలు ధర నిర్ణయించారు. ఇక ఫోర్‌వీల్‌ హార్వెస్టర్‌కు గతేడాది గంట సమయానికి రూ.2వేలు ధర ఉండగా.. ఇప్పుడు రూ.3 వేలకు చేరింది. అంటే ఒక్కో ఎకరాకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు రైతుపై అదనపు భారం పడుతున్నది. హార్వెస్టర్ల యజమానులు సైతం పలుచోట్ల సిండికేట్‌గా మారి తమ మాటనే నెగ్గించుకుంటున్నారు. దీనికితోడు హార్వెస్టర్ల దళారులకు కమీషన్లు ఇవ్వడం షరా మామూలే. 


రైతులపై రూ.50 కోట్ల భారం

జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల మంది రైతులు 3.16 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు ఈ మొత్తం వరి కోతలు హార్వెస్టర్ల ద్వారానే జరుగుతాయి. ఈ లెక్కన ఎకరాకు సగటున రూ.6 వేలను హార్వెస్టర్‌ యంత్రానికి ఖర్చు చేయడం వల్ల రూ.189 కోట్ల పైచిలుకు రైతులు చెల్లించాల్సి ఉంది. ఇందులో డీజిల్‌ ధర పెరగడం వల్ల రైతులపై రూ.50 కోట్ల అదనపు భారం పడినట్లు అంచనా. ఒక్కో ఎకరాకు రూ.2 వేల వరకు కోతల పేరిట చెల్లించడంతో రైతుల జేబులు ఖాళీ అవుతున్నాయి. చైన్‌ హార్వెస్టర్‌కు అయితే ఎకరాకు రూ.3 వేల పైచిలుకు వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారు.


రూ.2 వేలు ఎక్కువయ్యాయి

నాకు నాలుగెకరాల భూమి ఉంది. మొత్తం వరిసాగు చేశాను. పంట కోతకు రావడంతో వరి కోత యంత్రంతో కోపించాను. గంటకు రూ.2 వేల తీసుకున్నాడు. పోయినేడు 1500 రూపాయలే ఇచ్చాను. డీజిల్‌ రేటు బాగా పెరిగిందని చెప్పి నాలుగు ఎకరాలకు రూ.2 వేలు ఎక్కువగా ఖర్చు పెట్టాను.

- కాశబోయిన యాదయ్య, రైతు, గుబ్బడి గ్రామం


ఎకరాకు ఆరువేల ఖర్చు

గత యాసంగిలో వరి కోసేందుకు చైన్‌ హర్వెస్టర్‌కు గంటకు రూ.2 వేలు తీసుకున్నారు. ఇప్పుడు డీజిల్‌ ధరలు పెరిగాయని కోత మిషన్‌ యజమానులు రూ.3 వేలు అడుగుతున్నారు. చైన్‌ మిషన్‌తో రెండు గంటల్లో ఒక ఎకరం వరికోత కోస్తారు. ఈ లెక్కన నా నాలుగు ఎకరాలకు కలిపి రూ.24 వేలు కేవలం కోతలకే అవుతాయి. ఇక పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 

- ఏలేటి శ్రీనివాసరెడ్డి, రైతు, గాగిల్లాపూర్‌


ఎవుసం కంటే కూలి పని నయం

ఎవుసం చేసుకునే కంటే రోజు కూలి పనికి పోవడమే నయం. ఎరువుల ధరలు పెంచిండ్రు. కూలికి వచ్చేవాళ్లకు రేట్లు పెరిగినయ్‌. డీజిల్‌ ధర పెంచిండ్రు. వరికోతలకు మిషీన్ల ధర కూడా పెంచిండ్రు.. కానీ మేం పండించిన వడ్ల ధర మాత్రం పెంచడం లేదు. రైతుల నుంచి బాగా దోచుకుంటుండ్రు.

- వెలికట్టె నారాయణ, రైతు, దమ్మకపల్లి


డీజిల్‌ రేట్ల వల్ల తప్పలేదు

గత ఏడాది కంటే ఈ సంవత్సరం డీజిల్‌ రేట్లు బాగా పెరిగాయి. అప్పుడు లీటర్‌కు డీజిల్‌ ధర రూ.76 ఉన్నది. ఇప్పుడు రూ.103 పెరిగింది. అప్పుడు గంటకు రూ.1600 తీసుకున్నాం. ఇప్పుడు రూ.2వేల వరకు తీసుకుంటేనే మాకు గిట్టుబాటు అవుతున్నది. డ్రైవర్‌ ఖర్చు, బండి ఖర్చు లెక్కేసుకుంటే మాకు పెద్దగా మిగలదు.           

 - శ్రీనివాస్‌, హార్వెస్టర్‌ యజమాని