Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొండను తవ్వి ఎర్రమట్టి తరలింపు

  1. హోంగార్డుల ఇంటి స్థలాల నుంచి.. 
  2. అనుమతుల్లేవంటున్న తహసీల్దార్‌ 


కర్నూలు, డిసెంబరు 3: హోంగార్డులకు కేటాయించిన ఇంటి స్థలాల్లో అనుమతి లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ మట్టిని ఓ వ్యక్తి స్థలంలోకి తరలిస్తున్నారు. పట్టపగలే ఎక్స్‌కవేటర్లతో తవ్వి టిప్పర్లతో తరలించినా పట్టించుకునేవారే లేరు. 2010లో కోడుమూరులో 39 మంది హోంగార్డులకు కొండ్రాయి కొండ ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇచ్చారు. అయితే అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో తహసీల్దార్‌ ఇటీవల నోటీసులు జారీ చేశారు.   


ఆ తర్వాత ఏం జరిగిందంటే..


కర్నూలు రహదారిలో ఓ వ్యక్తి తన స్థలంలో ఓ ప్రముఖ నాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి నెల క్రితం హోంగార్డుల స్థలంలోని ఎర్రమట్టిని తవ్వి తీసుకుని వచ్చి పోశాడు.దీంతో ఎరమట్టిని తరలించేందుకు అనుమతులు ఉన్నాయా..? అంటూ పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ స్థలం యజమాని వెనక్కి తగ్గాడు. అయితే ఇప్పుడు ఆ యజమాని హోంగార్డులకు ఇచ్చిన స్థలంలోంచి మట్టిని తరలిస్తున్నాడు. ఎక్స్‌కవేటర్‌, టిప్పర్ల ద్వారా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి తరలించాడు. ఈ విషయమై తహసీల్దార్‌ ఉమామహేశ్వరిని వివరణ కోరగా.. తాము హోంగార్డులకు స్థలాలు ఇచ్చిన మాట వాస్తవమేనని, వారిని స్థలాలు చదును చేసుకోవాలని చెప్పామన్నారు. అయితే మట్టిని ఇలా తరలించాలని చెప్పలేదన్నారు. ఎర్రమట్టిని ఎవరు, ఎక్కడికి తరలిస్తున్నదీ తమకు తెలియదని, దానితో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. 


రూపురేఖలు మారిన కొండ


కోడుమూరు సమీపంలోని కొండ్రాయి కొండ ఇప్పటికే రూపురేఖలు మారిపోయింది. కొండను తవ్వి మట్టిని తరలించడం వల్ల దాని ఉనికి కోల్పోతోంది. అదే కొండపైన కొండరాయుడి గుడి ఉంది. ప్రతిఏటా శ్రావణమాసం మూడో సోమవారం వేలాది మంది భక్తులు కొండపైకి వెళ్లి పూజలు చేస్తారు. స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమ ర్పిస్తారు. ఇప్పటికే కొండ రూపురేఖలు మారిపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పట్టపగలే హోంగార్డుల స్థలాల్లో నుంచి మట్టిని తరలించడం పట్ల విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement