జస్ట్ క్లిక్..!

ABN , First Publish Date - 2022-01-28T16:20:34+05:30 IST

నిజాంపేట, మణికొండలో చేపట్టిన డిజిటల్‌ డోర్‌ నెంబర్ల పైలట్‌ ప్రాజెక్టులు సక్సెస్‌ కావడంతో అదే తరహాలో గ్రేటర్‌లోనూ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు

జస్ట్ క్లిక్..!

ఒక్క క్లిక్‌ కొడితే చాలు.. నగరంలో ఏదైనా చిరునామాతోపాటు భవనాలు, మౌలిక సదుపాయాలు, జల వనరులు, నాలాలు తదితర సమస్త సమాచారం అందుబాటులోకి రానుంది. జీహెచ్‌ఎంసీలోని పట్టణ ప్రణాళికా విభాగం, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎ్‌సఏ)ల సహకారంతో పలు ఏజెన్సీలు దీనిపై కసరత్తు చేయనున్నాయి. పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు ఇటీవల వివిధ శాఖలు, సంస్థలతో సమావేశమై ఈ విషయంపై చర్చించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే డిజిటల్‌ డోర్‌ నెంబర్ల కేటాయింపు క్షేత్రస్థాయిలో మొదలయ్యే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 


చిరునామాతోపాటు.. మరెన్నో !

డిజిటల్‌ డోర్‌ నెంబరింగ్‌తో అందుబాటులోకి

కసరత్తు షురూ

అడ్ర్‌సలతోపాటు ఆస్తిపన్ను, విద్యుత్‌, నల్లా కనెక్షన్ల సమాచారం కూడా..

నేవిగేషన్‌తో నేరుగా ఇళ్లకు

తాజాగా ఉన్నతాధికారుల సమావేశం


హైదరాబాద్‌ సిటీ: నిజాంపేట, మణికొండలో చేపట్టిన డిజిటల్‌ డోర్‌ నెంబర్ల పైలట్‌ ప్రాజెక్టులు సక్సెస్‌ కావడంతో అదే తరహాలో గ్రేటర్‌లోనూ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త విధానంలో ఇంటి నెంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయితే నేవిగేషన్‌ ద్వారా చిరునామా తెలుసుకోవడంతోపాటు ఆ నిర్మాణ విస్తీర్ణం, ఆస్తిపన్ను గుర్తింపు నెంబర్‌, నల్లా, విద్యుత్‌ కనెక్షన్ల నెంబర్లు, ఆ భవనంలో ఉండే కుటుంబాలు, వ్యాపార సంస్థలు వంటి సమస్త సమాచారమూ అందుబాటులోకి వస్తుంది. చిరునామా మాత్రమే పబ్లిక్‌ డొమైన్‌లో ఉంటుందని, ఇతరత్రా సమాచారానికి సంబంధించిన యాక్సెస్‌ సంబంధిత శాఖలకు మాత్రమే ఉంటుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. బహుళ వినియోగంగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. 


పట్టణ ప్రణాళికా విభాగం సర్వే..

రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో డిజిటల్‌ ఇంటి నెంబర్ల కేటాయింపునకు పురపాలకశాఖ కసరత్తు ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ ఇదే తరహాలో ఇంటి నెంబర్ల గుర్తింపు ఉండనుంది. గ్రేటర్‌ పరిఽధిలో జోన్లు, సర్కిళ్లు, వార్డులు, కాలనీలు, రోడ్ల వారీగా పట్టణ ప్రణాళికా విభాగం క్షేత్రస్థాయి సర్వే చేస్తోంది. ప్రాంతాల వారీగా రోడ్లు, ఇంటి నెంబర్లు గుర్తించి మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఒక ఏరియా/కాలనీలో ఈశాన్యంలోని రోడ్డు నుంచి మొదలు పెట్టి అదే క్రమంలో రహదారుల నెంబర్లు, ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా భవనంలోని ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌, విద్యుత్‌, నల్లా కనెక్షన్‌ నెంబర్‌, భవన విస్తీర్ణం, ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, తదితర వివరాలు సేకరిస్తున్నారు.


సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో సర్వే, మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తయిందని జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో సర్వే వివరాలు పర్యవేక్షించే ఓ అధికారి చెప్పారు. రహదారులు, ఇళ్లతోపాటు పార్కులు, నాలాలు, చెరువులు, ఇతరత్రా 54 రకాల వివరాలు సేకరించి నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎ్‌సఏ) ద్వారా డిజిటలైజ్‌ చేయనున్నారు. దాంతోపాటు ఆ ప్రాంతంలోని రహదారులు, తాగునీరు, సివరేజీ, విద్యుత్‌ తదితర సదుపాయాల వివరాలూ డిజిటలైజేషన్‌లో భాగంగా క్రోడీకరించనున్నారు.  


నేవిగేషన్‌తో సులువుగా..

నగరంలోని ఏదైనా ప్రముఖ ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. చిరునామా తెలియని పక్షంలో మొబైల్‌ ఫోన్లలో నేవిగేషన్‌ ద్వారా చేరుకుంటాం. ఇదే తరహాలో డిజిటల్‌ డోర్‌ నెంబర్ల కేటాయింపు పూర్తయితే మొబైల్‌ యాప్‌లో మనం చేరుకోవాల్సిన చిరునామా ఎంటర్‌ చేసి నేవిగేషన్‌ ద్వారా చేరుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

Updated Date - 2022-01-28T16:20:34+05:30 IST