ఉత్పత్తి నిలిపివేయండి

ABN , First Publish Date - 2022-05-30T06:24:21+05:30 IST

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)కు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) భారీ షాక్‌నిచ్చింది.

ఉత్పత్తి నిలిపివేయండి
గోదావరినదిలో కలుస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వ్యర్థ నీరు

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు పీసీబీ ఆదేశాలు

కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం

అమ్మోనియా లీకేజీ... నీటి శుద్ధిలో లోపాలపై పీసీబీ అభ్యంతరం

ఎమ్మెల్యే చందర్‌ ఫిర్యాదుతో చర్యలు

కోల్‌సిటీ, మే 29: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)కు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) భారీ షాక్‌నిచ్చింది. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందడమే కాకుండా సరి చేసుకునేందుకు తాము ఇచ్చిన అవకాశాలను ఖాతరు చేయకపోవడంతో కొరఢా ఝుళిపించింది. ఏకంగా పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయాలంటూ ఈ నెల 28న సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా పరిశ్రమకు పీసీబీ అనుమతుల సందర్భంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సమర్పించిన బ్యాంక్‌ గ్యారంటీ(బీజీ) రూ.25లక్షల నుంచి 50శాతం రూ.12.5లక్షలు జప్తు చేస్తున్నట్టు పేర్కొంది. పరిశ్రమలో వెంటనే ఉత్పత్తి నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. అమ్మోనియా లీకేజీలపై రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీసీబీ చర్యలు తీసుకుంది. కాగా పీసీబీ ఆదేశాలు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యానికి శనివారం రాత్రే అందాయి. పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయకుండా 50శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తూ సోమవారం ఉదయం నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి నిలిపివేస్తామంటూ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

 కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా మూతపడిన ఎఫ్‌సీఐ స్థానంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పేర నూతన ప్లాంట్‌ను నెలకొల్పింది. 6330కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. రోజూ 2,200టన్నుల అమ్మోనియా, 3,850టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌, ఈఐఎల్‌, గెయిల్‌, ఎఫ్‌సీఐతో పాటు డెన్మార్‌కు చెందిన హల్దర్‌ టాప్స్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామిగా ఉన్నాయి. గత ఏడాది మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. గత ఏడాది 3.74లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది. 


- ట్రయల్‌ రన్‌ నుంచీ లీకేజీలే...

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ట్రయల్‌ రన్‌ నుంచే లీకేజీలు బయట పడ్డాయి. 2021 మార్చిలోనే అమ్మోనియా లీకేజీ కావడంతో నగరమంతా ఉక్కిరిబిక్కిరయ్యింది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి కాన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ లేకుండానే ఉత్పత్తి ప్రారంభం కావడంతో పీసీబీ సీరియస్‌ అయ్యింది. లోపాలు సరిచేసిన తరువాతే ఉత్పత్తి ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేసిది. అనంతరం జూన్‌ 7వ తేదిన పీసీబీ నుంచి షరతులు విధిస్తూ కాన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ లభించింది. 2026 మార్చి 31వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుంది. కానీ గత ఏడాది జూలై 7వ తేదీనే గ్యాస్‌లీకేజీపై పీసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీనికి తోడు అమ్మోనియా ఉత్పత్తిలో వినియోగించే నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండానే ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా గోదావరిలోకి వదులుతున్నారు. వాస్తవానికి నీటిని పీసీపీ ప్రమాణాలతో పూర్తిగా శుద్ధి చేసి పరిశ్రమ, టౌన్‌షిప్‌  ఆవరణలోని చెట్ల పెంపకానికే వినియోగించుకోవాల్సి ఉంటుంది. కేవలం వర్షాకాల సీజన్‌లోనే నీటిని బయటకు పంపాల్సి ఉంటుంది. అలాంటిది చేయకుండా గోదావరిలోకి నేరుగా వదులుతుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ జలాలనే మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ మెట్రో వర్క్‌ తాగునీటి అవసరాలకు పంపింగ్‌ చేయడంతో ప్రజలు కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది. దీనిపై రామగుండంలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.


-  పీసీబీ ఆదేశాలు బేఖాతరు...

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యాజమాన్యం ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచే కాలుష్యానికి కారణమయ్యే యంత్రాల బిగింపు,  వినియోగంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. పీసీబీ ప్రమాణాల ప్రకారం ప్రిల్లింగ్‌ యూనిట్‌, అమ్మోనియా యూనిట్లలో లీకేజీలు కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. గత ఏడాది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు సూచనలు చేసింది. వీటిని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పెడచెవిన పెట్టింది. ఈ ఏడాది మార్చి 22న రామగుండం ఎమెల్యే కోరుకంటి చందర్‌ అమ్మోనియా లీకేజీలపై పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో మరోసారి తనిఖీ చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిబంధనలు పాటించాలంటూ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు  పాటిస్తున్నట్టు పీసీబీకి ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తప్పుడు సమాచారం ఇచ్చింది. దీనిపై మే 25వ తేదీన పీసీబీ బోర్డు సభ్యులు ఆకస్మిక తనిఖీ చేయగా కాలుష్య నియంత్రణ చర్యలు లేనట్టు బయట పడింది. పరిశ్రమలోని అమ్మోనియా గాలిలో కాలువకుండా నియంత్రిచే చర్యలు లేవని, ప్రిల్లింగ్‌ ట్రవర్‌ వద్ద వ్యాక్యుమ్‌ స్క్రబ్బర్స్‌ సరిగా పని చేయడం లేదని, స్ర్టిపర్‌లో గ్యాసెస్‌ ఎలాంటి కండెన్సర్‌ సిస్టం లేదని పేర్కొన్నారు. అలాగే  యూరియా ప్లాంట్‌ నుంచి బ్యాగింగ్‌ యూనిట్‌కు వెళ్లే ప్రాంతంలో యూరియా డస్ట్‌ను రికవరీ చేసే సిస్టం లేదని నివేదించారు. ఎప్యులెంట్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ సిస్టం లేదని, 51లొకేషన్లలో అమ్మోనియా సెన్సార్లు ఉన్నట్టు పేర్కొంటున్నా, నెగిటివ్‌ అమ్మోనియా వాల్యు సిస్టం చూపిస్తుందని, ఇది తప్పుడు సమాచారంగా నిర్ధారించారు. దీనికి తోడు టౌన్‌షిప్‌ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఎస్‌టీపీకి కూడా లేదని నిర్ధారించారు. హియరింగ్‌కు హాజరైన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నీటి శుద్ధి  కోసం ఏడాది గడువును, బ్యాగ్‌ ఫిల్టర్‌ యూనిట్‌కు ఏడాది గడువు కోరింది. దీన్ని తిరస్కరించిన పీసీబీ కాలుష్య నియంత్రణపై చర్యలు చేపట్టే వరకు పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సమర్పించిన రూ.25లక్షల బ్యాంక్‌ గ్యారంటీలో 50శాతం రూ.12.5లక్షలు జప్తు చేస్తున్నట్టు పేర్కొన్నది.


- 50శాతం సామర్థ్యంతో ఉత్పత్తి..

పీసీబీ ఆదేశాలపై ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం సీరియస్‌గా స్పందించలేదు. ఆదివారం 50శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తున్నట్టు పేర్కొంటుంది. సోమవారం నాటికి క్రమక్రమంగా ఉత్పత్తి నిలిపివేస్తామని పేర్కొంటోంది. కాగా పీసీబీ ఆదేశాలపై ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం శనివారం రాత్రే కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖను సంప్రదించింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా అందుబాటులో ఉండకపోవడంతో సోమవారం పరిశ్రమల శాఖను సంప్రదించే అవకాశం ఉంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జయేష్‌ రంజన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. వర్షాకాల సీజన్‌ ప్రారంభమవుతుండడంతో యూరియా ఉత్పత్తి అవసరాల దృష్ట్యా మినహాయింపు కోరే అవకాశాలున్నాయి.

- మొదటి నుంచీ నిర్లక్ష్యమే...

- ఎమ్మెల్యే  చందర్‌

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందించింది. 11శాతం వాటాను తీసుకోవడమే కాకుండా రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్‌ సౌకర్యం కల్పించింది. ప్రజలు షరతులు లేకుండా పరిశ్రమ స్థాపనకు అంగీకారం తెలిపారు. కానీ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం కాలుష్యంపై మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. అమ్మోనియా లీకేజీతో పాటు గోదావరిలోకి శుద్ధి చేయని నీటిని పంపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. స్థానికులకు, నిర్వాసితులకు ఉపాధి ఇవ్వకుండా తొలగిస్తోంది.


Updated Date - 2022-05-30T06:24:21+05:30 IST