ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్‌ఎంసీకి నిరాశ...!

ABN , First Publish Date - 2021-06-03T13:42:27+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న జీహెచ్‌ఎంసీకి నిరాశ.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్‌ఎంసీకి నిరాశ...!

  • రూ.524 కోట్లు 
  • ఎర్లీబర్డ్‌లో పన్ను వసూలు 
  • గతేడాది కంటే రూ.50 కోట్లు తక్కువ
  • ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్‌ఎంసీకి నిరాశ
  • అత్యధికంగా శేరిలింగంపల్లిలో వసూలు 


 హైదరాబాద్‌ సిటీ : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న జీహెచ్‌ఎంసీకి నిరాశ. ఆశించిన స్థాయిలో ఎర్లీ బర్డ్‌ ఆస్తి పన్ను వసూలు కాలేదు. గతేడాది కంటే దాదాపు రూ.50 కోట్ల మేర పన్ను తక్కువగా వసూలైంది. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ.. కిందటి ఆర్థిక సంవత్సరం ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌లో భాగంగా ఏప్రిల్‌, మే నెలలో రూ.573 కోట్ల పన్ను వసూలైంది. మినహాయింపు వేళల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతినిస్తూ లాక్‌డౌన్‌ ప్రకటించినా.. ఇప్పుడు మాత్రం రూ.524 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం ఎలా..? అన్న మీమాంస అధికారుల్లో కనిపిస్తోంది. వాస్తవంగా ఎర్లీ బర్డ్‌ ఆదాయంలో కనీసం రెండు, మూడు నెలలపాటు వేతనాలు, అభివృద్ధి, నిర్వహణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపునకు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పటికే వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. తాజాగా తగ్గిన ఆదాయం ఆర్థిక విభాగాన్ని కలవరపెడుతోంది. 


ముందుకు రాని వ్యాపారులు, విద్యాసంస్థలు.. 

ఆర్థిక సంవత్సరం ఆరంభంలో(ఏప్రిల్‌ నెలలో) ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌లో భాగంగా ఐదు శాతం రాయితీతో ఆస్తి పన్ను చెల్లింపునకు అవకాశం ఉంటుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్‌ 30 వరకు ఉన్న గడువును మే 31 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. గతేడాది కూడా ఇదే తరహాలో రెండు నెలలు ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ అమలులో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే 31వ తేదీ వరకు రూ.524.79 కోట్ల పన్ను వసూలైంది. మొత్తం పన్ను చెల్లింపుదారులు 16.80 లక్షలు ఉండగా.. 5.07లక్షల మంది ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ను వినియోగించుకున్నారు.


గతంతో పోలిస్తే వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆదాయం లేకపోవడంతో పన్ను చెల్లించేందుకు ముందుకు రాలేదు. పాఠశాలలు, కళాశాలలు తదితర విద్యాసంస్థలు కూడా పన్ను చెల్లింపునకు ఆసక్తి చూపలేదు. ఆన్‌లైన్‌ క్లాసులతో పూర్తిస్థాయిలో ఫీజులు వసూలు కాలేదు.. పన్ను ఎలా చెల్లిస్తామని పలు విద్యాసంస్థల నిర్వాహకులు చెప్పారని ఓ అధికారి తెలిపారు. కిందటి సంవత్సరం ఈ మొత్తం రూ.573 కోట్లుగా ఉంది. అంటే గతేడాది కంటే రూ.49 కోట్లు తక్కువగా పన్ను వసూలైంది. అత్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్‌లో రూ.75.28 కోట్లు వసూలు కాగా.. జూబ్లీహిల్స్‌ సర్కిల్‌లో రూ.57.55 కోట్లు, ఖైరతాబాద్‌ సర్కిల్‌లో రూ.49.10కోట్లు వసూలైంది. అత్యల్పంగా ఫలక్‌నుమా సర్కిల్‌లో రూ.1.70కోట్లు వసూలయ్యాయి. చార్మినార్‌ జోన్‌ పరిధిలోని దాదాపు అన్ని సర్కిళ్లలో పన్ను వసూలు తక్కువగా ఉంది.


ఇదీ లెక్క...

గ్రేటర్‌లో మొత్తం ఆస్తిపన్ను చెల్లింపుదారులు-  16.80 లక్షలు

పన్ను చెల్లించిన వారు- 5,07,570

వసూలైన పన్ను- రూ.524.79 కోట్లు

కిందటి యేడాది ఎర్లీ బర్డ్‌ పన్ను వసూలు - రూ.573 కోట్లు.

Updated Date - 2021-06-03T13:42:27+05:30 IST