అనర్థ ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2022-01-22T06:15:28+05:30 IST

ఐఎఎస్, ఐపిఎస్ వంటి అఖిలభారత స్థాయి అధికారులను తమ సర్వీసులలోకి ఏకపక్షంగా రప్పించుకోవడానికి వీలుగా కేంద్రప్రభుత్వం నిబంధనలను సవరించే ప్రయత్నం చేయడం మీద దుమారం రేగుతోంది...

అనర్థ ప్రతిపాదనలు

ఐఎఎస్, ఐపిఎస్ వంటి అఖిలభారత స్థాయి అధికారులను తమ సర్వీసులలోకి ఏకపక్షంగా రప్పించుకోవడానికి వీలుగా కేంద్రప్రభుత్వం నిబంధనలను సవరించే ప్రయత్నం చేయడం మీద దుమారం రేగుతోంది. రాష్ట్రాల హక్కులను, అధికారాలను క్రమంగా హరిస్తూ, కేంద్రీకరణను పెంచుతోందని విమర్శలను ఎదుర్కొంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన విస్తరణవాద ధోరణిలో భాగంగానే ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష పార్టీలు, అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలు చూస్తున్నాయి. బిజెపి భాగస్వామ్యం ఉన్న బిహార్ ప్రభుత్వం కూడా ఈ ఆలోచనను వ్యతిరేకిస్తూ లేఖరాయడం విశేషం. తమ ప్రభుత్వ సర్వీసులకు రాష్ట్రాల నుంచి నిర్ణీత డిప్యుటేషన్ జరగకపోవడం వల్ల, అధికారుల కొరత ఏర్పడుతున్నదని, దాన్ని పరిష్కరించడానికే తాము ప్రయత్నిస్తున్నామని  కేంద్రప్రభుత్వం చెబుతున్నది. ఇక్కడ సమస్య, కేంద్రానికి అధికారులను డిప్యుటేషన్ మీద పంపడం కాదని, ఆ పంపే ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వంతో సంప్రదింపులు, సమ్మతి ఉంటాయా లేదా అన్నదేనని విమర్శకులు అంటున్నారు. 


రాజ్యాంగంలోని 312 అధికరణం ప్రకారం ఏర్పాటయిన అఖిల భారత సర్వీసులు కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వాలకు రెండిటికోసమూ ఉద్దేశించినవి. అయితే, కేంద్రం మాత్రమే వ్యవహరించే శాఖలూ విభాగాలూ మినహా కేంద్ర సర్వీసుల కోసమని ప్రత్యేక కేడర్ అంటూ ఏమీ ఏర్పాటు కాలేదు. సాధారణ పరిపాలన, పోలీసు తదితర రంగాలలో పనిచేయవలసిన అధికారులు ఆయా రాష్ట్రాల కేడర్‌గానే నియమితులవుతారు. వారిలో కొందరిని రాష్ట్రప్రభుత్వాలు కేంద్రసర్వీసులకు తాత్కాలికంగా బదలాయించాలి. ఒక రాష్ట్రం కేంద్రసర్వీసుల కేడర్ సంఖ్యను, కేంద్ర డిప్యుటేషన్‌కు వెళ్లవలసిన కోటా 40 శాతాన్ని కూడా కలుపుకుని లెక్కిస్తారు. ఈ డిప్యుటేషన్ కోటాలో వెళ్లేవారు ఉన్నత, మధ్య, దిగువ శ్రేణుల వారు వేర్వేరు నిష్పత్తులలో ఉంటారు.   అనేకమంది సివిల్ సర్వీసు అధికారులు కేంద్రంలో కొంతకాలం పనిచేసి, తమ కేడర్ రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఈ సర్దుబాటు, పంపకం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పరస్పర సంప్రదింపులతో మాత్రమే కాదు, అధికారి సమ్మతితో కూడా జరగడం పద్ధతి. రాష్ట్రాలు ఇవ్వవలసిన కోటాలో డిప్యుటేషన్ జరగడం లేదన్న కారణంతో కేంద్రప్రభుత్వం సర్వీసు నిబంధనలలో మార్పులు తలపెట్టింది. ప్రధాని పర్యటన సందర్భంగా పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి వ్యవహారసరళి వివాదాస్పదమై, ఆయనను కేంద్రం వెనక్కి రమ్మని ఆదేశించడం జరిగిన సందర్భంలో ఈ నిబంధనల మార్పు ఆలోచన వచ్చినట్టుంది. ప్రతిపాదనల గురించి అభిప్రాయం చెప్పవలసిందిగా కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆరు రాష్ట్రప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేశాయి. తక్కినవారు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు కేంద్రం తుది గడువు ప్రకటించింది, జనవరి 25లోగా స్పందనలు రాకపోతే, చేసిన మార్పులను అధికారికం చేస్తామని హెచ్చరించింది.


మరీ ఉన్నత పదవులైతే తప్ప, కేంద్రసర్వీసులో పనిచేయడానికి అధికారులకు ఉత్సాహం ఉండకపోవచ్చు.  తమిళనాడు మినహా, తక్కిన దక్షిణాది రాష్ట్రాల కేడర్‌కు ఢిల్లీ సర్వీసుపై పెద్దగా ఆసక్తి ఉండదు. రాష్ట్రం, జిల్లా.. ఎంతగా క్షేత్రస్థాయికి వెడితే, అంతగా పౌర, పోలీసు అధికారులకు గౌరవం, అధికారం లభిస్తాయి, చేయదలచుకున్నవారికి సేవ చేయడానికి కూడా అటువంటి స్థానాలే అనువైనవి. కానీ, ఢిల్లీలో ఉండి పనిచేసే అధికారులు తమ కేడర్ రాష్ట్రాలకు అనేక విధాలుగా సహాయపడగలరు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వేరువేరు ప్రభుత్వాలు ఉన్న సందర్భాలలో రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రంలో అస్మదీయులైన అధికారుల అండ ఎంతో అవసరం అవుతుంది. మరి ఏ కారణం వల్లనో, రాష్ట్రాలు తాము సమకూర్చవలసిన సిబ్బందిని కేంద్రానికి పంపలేకపోతున్నాయి. అయితే, అనేక మంది అధికారులకు రాష్ట్రప్రభుత్వాలతో సరిపడని సందర్భాలుంటాయి. ప్రభుత్వాలకూ కొందరు అధికారులతో సమన్వయం కష్టం కావచ్చు. అటువంటివారికి ఒక మార్గాంతరంగా కేంద్ర డిప్యుటేషన్ పనికివస్తుంది. అధికారీ, రాష్ట్రప్రభుత్వమూ ఇద్దరూ అంగీకరించి వెళ్లడం అది. ఇప్పుడు కేంద్రం సంకల్పిస్తున్న సవరణల ప్రకారం, కేంద్రం ఏకపక్షంగా తనకు కావలసిన అధికారిని ఢిల్లీకి రప్పించుకోవచ్చు.


రాష్ర్టప్రభుత్వాలు తమకు నమ్మకం ఉన్న అధికారుల మీద ఆధారపడి పాలన సాగిస్తాయి. ఆ నమ్మకం ఏర్పడే ప్రాతిపదికలు ఏవైనా కావచ్చు. ఒక ప్రభుత్వాన్ని బలహీనపరచాలంటే, అందులో చురుకుగా పనిచేస్తున్న అధికారులను కేంద్రానికి రప్పించుకోవచ్చు. లేదా రాష్ట్రాలు ఇవ్వచూపిన అధికారులను నిరాకరించవచ్చు. ఇటువంటి అవకాశాలున్నాయని, ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని వివిధ రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, కొన్ని రంగాలలో ప్రావీణ్యం, సామర్థ్యం ఉన్న అధికారులు కేంద్రానికి అవసరమవుతారని, అత్యవసర ప్రాతిపదిక మీద అటువంటి వారిని కేంద్రానికి తీసుకురావడానికి నిబంధనలు అనువుగా లేవని, ఆ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిబంధనలను సవరిస్తున్నామని కేంద్రం చెబుతున్నది. 


కేంద్రం మనసులో వేరే ఉద్దేశ్యాలు లేకపోతే, ఇద్దరి వాదనల్లోనూ వాస్తవం ఉన్నది. రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్లు ఎంతగా తగ్గిపోయాయో, కేంద్రం లెక్కలు చూపిస్తున్నది. అనేక రాష్ట్రాలు తమకు సివిల్ సర్వీసు అధికారుల సంఖ్య సరిపోవడం లేదని కేడర్ సంఖ్య పెంచాలని కోరుతున్నాయి.  అందుకు పరిష్కారం ఏమిటో, ఒక జాతీయస్థాయి సమావేశం పెట్టి అన్వేషించాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాష్ట్రాలలో అభద్రత ఉండడం సహజం. అనేక ఇతర అంశాలలో జరుగుతున్నట్టు, క్రమంగా ప్రతిపత్తి హరణం జరుగుతుందేమోనని వారి భయం. సంప్రదింపుల ప్రక్రియ, పరస్పర ఆమోదం వంటి విలువలు కొనసాగుతాయని, వాటికి విరుద్ధంగా ఉన్న సవరణలు చేయబోమని కేంద్రం చెప్పాలి. సమర్థులైన అధికారులు దేశమంతటా ఉండాలి, ఢిల్లీలోనూ ఉండాలి. కొరత అన్నది సమస్య అయితే, భర్తీ ద్వారా దాన్ని నెరవేర్చుకోవాలి. అపనమ్మకాన్ని నమ్మకంతో పరిష్కరించాలి.

Updated Date - 2022-01-22T06:15:28+05:30 IST