Abn logo
Feb 18 2021 @ 00:51AM

బేడీకి ఉద్వాసన

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనావస్థలోకి జారడం కంటే, అందుకు కారకురాలైన కిరణ్‌బేడీని కేంద్రప్రభుత్వం హఠాత్తుగా పదవినుంచి తప్పించడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నారాయణసామి ప్రభుత్వం మైనారిటీలో పడినవార్తతో పాటే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు కేంద్రప్రభుత్వం ఉద్వాసన చెప్పిందన్నదీ వెలుగుచూసింది. కరోనా వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అధికారులతో సమీక్షిస్తుండగా ఉద్యోగం పోయిన విషయం కిరణ్‌బేడీకి చేరిందట. మోదీ ప్రభుత్వం కనీస మర్యాదకు కూడా ఆమెను రాజీనామా చేయమని అడగలేదు. తక్షణ తొలగింపుతోనే రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని అధినాయకులు అనుకొని ఉంటారు. బేడీ గోబ్యాక్‌ అంటూ నెలన్నరగా నారాయణసామి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని సవ్యంగా నడవనివ్వకుండా ‘రాజ్‌నివాస్‌’ రాజకీయం చేస్తున్నదంటూ ముఖ్యమంత్రి యుద్ధం చేస్తున్నారు. కిరణ్‌బేడీని సాగనంపాలన్న ఆయన కోరిక ఎట్టకేలకు తీరింది కానీ, రేపోమాపో తానే నిష్క్రమించవలసిన దశలో అది నెరవేరింది.


ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి, బీజేపీ పక్షాన చేరడం వెనుక కిరణ్‌బేడీ ప్రత్యక్ష హస్తం ఉందని అనడం లేదు కానీ, ఆమె ప్రవేశంతో పుదుచ్చేరి రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఐదేళ్ళక్రితం కొద్దినెలల తేడాలో పదవీబాధ్యతలు చేపట్టిన నారాయణసామి, కిరణ్‌బేడీల మధ్య యుద్ధం అనతికాలంలోనే పతాకస్థాయికి చేరుకుంది. కిరణ్‌బేడీ స్వభావం, వ్యవహారశైలి తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి ఆమె నిర్భీతి, నిక్కచ్చితనం, దూకుడు ఉపకరించాయి. ఓ గవర్నర్‌లాగా కాక, తీహార్‌జైలుని కాపలాకాసిన పోలీసు అధికారిలాగానే వ్యవహరించారు. అధికారపక్ష నాయకులు ప్రజలను చూసే కోణం వేరు, ఆమెది వేరు. ప్రజాపంపిణీ వ్యవస్థలో బియ్యం సరఫరా బదులు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు వేయాలని ఆమె ఓ సందర్భంలో పట్టుబట్టారు. అది తాగుడు పెంచుతుందే తప్ప, కడుపునింపదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని పక్షాలూ కలసి పేదలకు ఉచిత బియ్యం ఇవ్వాలని నిర్ణయిస్తే ఆ పథకాన్ని కూడా ఆమె కాదన్నారు. స్థానిక బీజేపీ నాయకులకు కూడా ఆమె వైఖరి పలుమార్లు ఆగ్రహం కలిగించేది. కేంద్రపాలిత ప్రాంతం గవర్నరు అధికారాలకు హద్దులేదంటూ మంత్రివర్గ నిర్ణయాలను అనేకం ఆమె నిలిపివేసేవారు. వివిధ పథకాలకు కేటాయించిన కోట్లాది రూపాయల నిధులు, సబ్సిడీలను అవినీతిని అరికట్టేపేరిట ఆపివేసేవారు. పేదలకు లబ్ధిచేకూర్చే సంక్షేమపథకాలను అడ్డుకున్నారన్న విమర్శలను కూడా బేఖాతరు చేశారు. రూపురేఖలు మార్చితే తప్ప ఆమోదించేది లేదనేవారు. వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దడంలో, అవినీతి నియంత్రణలో ఆమె మంచి కృషిచేశారని మరికొందరు మెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో, బేడీ ఇక్కడ, మోడీ అక్కడా ఉండగా తాము కాంగ్రెస్‌లోనో, డీఎంకెలోనో కొనసాగడం వల్ల రాబోయే రోజుల్లో రాజకీయంగా, మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఏమాత్రం ప్రయోజనం చేకూరదని ఎమ్మెల్యేలు గ్రహించి వలసపోయారని కొందరి విశ్లేషణ. అధికారాన్ని తారుమారు చేసేందుకు బేడీ పరోక్షంగా ఉపకరించారు కానీ, మరో మూడునెలల్లో ఎన్నికలున్న దశలో నడపాల్సిన ప్రత్యక్ష రాజకీయానికి ఆమె పనికిరారు. ‘ఆమె చేయగలిగినంతా చేశారు, ఇక జరగబోయేదానికి ఆమె అవసరం లేదు. అధిష్ఠానం ఆమెను అడ్డంకి అనుకొని ఉండవచ్చు’ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలన్నాక రాజకీయమే కాదు, ఆర్థికం కూడా. బేడీమీద ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా విరుచుకుపడాలని కాంగ్రెస్‌ భావిస్తున్న నేపథ్యంలో, ఆమె ఇంకా పదవిలో కొనసాగితే బీజేపీకి నష్టం జరుగుతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకుండా అడ్డుపడ్డ బేడీని ఎప్పుడో తప్పించవలసింది పోయి, ఆమె రాజకీయంగా తమకు నష్టమనుకున్న తరువాతే కేంద్రం ఆ పనిచేయడం విశేషం. 


గవర్నర్‌కు వ్యతిరేకంగా నారాయణసామి గతంలోనే బేడీమీద పెద్ద యుద్ధం ప్రకటించి, ఆమె పెత్తనానికి నిరసనగా రాజీనామా చేసి ఎన్నికలకు పోయి ఉంటే ప్రజలూ మెచ్చుకొనేవారు, ఈ సంక్షోభమూ తలెత్తేది కాదని కొందరి వాదన. ఎమ్మెల్యేలను బీజేపీ వలవిసిరిమరీ లాక్కుంటున్నా కాంగ్రెస్‌ అధిష్ఠానం చురుకుగా వ్యవహరించలేదన్నది మిత్రపక్షం డిఎంకె ఆరోపణ. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్‌ సారథ్యంలో మిగిలిన ఒకేఒక్క ప్రభుత్వం అలా మైనారిటీలోకి జారుకొని రాష్ట్రపతిపాలన కోసం ఎదురుచూడవలసి వస్తోంది.