యడ్డీకి ఉద్వాసన?

ABN , First Publish Date - 2020-12-25T08:17:03+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త సీఎంను నియమించే విషయంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి.

యడ్డీకి ఉద్వాసన?

  • మెడకు చుట్టుకోనున్న హైకోర్టు తీర్పు
  • కొత్త ముఖ్యమంత్రి కోసం మోదీ, షాల అన్వేషణ
  • ఫిబ్రవరి వరకు సమయం కోరిన యడియూరప్ప
  • అంతవరకు ఆగడం కష్టమేనంటున్న పార్టీ వర్గాలు
  • కర్ణాటక సీఎం రేసులో ప్రహ్లాద్‌ జోషి, లక్ష్మణ్‌?


న్యూఢిల్లీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త సీఎంను నియమించే విషయంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయి. ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాలకు పైగా భూమిని డీనోటిఫై చేసి.. గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని, దానిపై దర్యాప్తు జరిపించాలంటూ 2013లో లోకాయుక్త ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని సీఎం యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు రెండు రోజుల క్రితం కొట్టివేయడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.


సీఎం నిర్ణయంపై దర్యాప్తు జరగాల్సిందేనని, అది పకడ్బందీగా జరిగేలా లోకాయుక్త కోర్టు పర్యవేక్షించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో యడ్యూరప్ప ఎంతకాలం పదవిలో ఉంటారన్న విషయం చర్చనీయాంశమైంది. గత అక్టోబరులో యడ్యూరప్ప కుటుంబం అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కథనాన్ని ప్రసారం చేసిన ఓ టీవీ చానెల్‌పై పోలీసులు దాడి చేసి మూసివేసిన తీరుపై కూడా బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నిజానికి 75 ఏళ్లు దాటిన నేతలెవర్నీ పదవుల్లో కొనసాగించకూడదని బీజేపీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కర్ణాటకలో యడ్యూరప్ప శక్తిమంతుడైన నాయకుడు కావడంతో మోదీ, షాలు ఆయన్ను సీఎంగా కొనసాగించాల్సి వచ్చింది.


ఇప్పటికే సంకేతాలిచ్చిన పార్టీ పెద్దలు

రాజ్యసభ అభ్యర్థుల విషయంలో యడ్యూరప్ప ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసి సొంత నిర్ణయాలు తీసుకోవడం, మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడం వంటి చర్యల ద్వారా బీజేపీ పెద్దలు కర్ణాటక సీఎం విషయంలో సానుకూలంగా లేరన్న సంకేతాలు పంపారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో యడ్యూరప్పకు ప్రత్యామ్నాయం చూడక తప్పదన్న నిర్ణయానికి వచ్చారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయం తెలిసిన యడ్యూరప్ప ఫిబ్రవరి 27న తన పుట్టినరోజు వరకు కొనసాగించాలని, ఆ తర్వాత తాను అధిష్ఠానం సూచించిన వ్యక్తికి నాయకత్వం అప్పగిస్తానని కోరినట్లు సమాచారం. కానీ, యడ్యూరప్ప కోరికను ఢిల్లీ పెద్దలు మన్నిస్తారో లేదో చెప్పలేమని.. న్యాయస్థానం నిర్ణయాలు, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 


రేసులో ప్రహ్లాద్‌ జోషి, లక్ష్మణ్‌ సావడి

యడ్యూరప్ప స్థానంలో మరొకరిని నియమించే విషయంపై పార్టీలో చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయని సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చే విషయమై ఒకట్రెండు రోజులుగా చర్చలు వేగవంతమయ్యాయని తెలిపారు. యడ్యూరప్ప స్థానంలో ఎవరిని నియమిస్తారన్న విషయంలో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం రేసులో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, లింగాయత్‌ నేత లక్ష్మణ్‌ సావడిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-12-25T08:17:03+05:30 IST