కాస్త ఊరట

ABN , First Publish Date - 2020-05-03T07:06:34+05:30 IST

జిల్లాను ఆరెంజ్‌జోన్‌గా ప్రకటించిన కేంద్రం కాస్త సడలింపులు ఇచ్చింది. దీనిపై ఇంకా రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసు కోవాల్సి

కాస్త ఊరట

ఆరెంజ్‌ జోన్‌లో జిల్లా

కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం

రూరల్‌ పరిధిలో దుకాణాలకు మినహాయింపులు

రాష్ట్ర కేబినెట్‌ సమావేశం తర్వాత తుది నిర్ణయం


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాను ఆరెంజ్‌జోన్‌గా ప్రకటించిన కేంద్రం కాస్త సడలింపులు ఇచ్చింది. దీనిపై ఇంకా రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసు కోవాల్సి ఉంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మే 7 వరకు లాక్‌డౌన్‌ ఉండగా, కేం ద్రం మే 17 వరకు పొడిగించింది. దీనిపై రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. కేబినెట్‌ సమావేశంలో సడలింపులపై చర్చించే అవకాశం ఉంది. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు లేనప్పటికీ తాజాగా బయటపడిన పాజిటివ్‌ కేసు గడువు 17 రోజులే కావడంతో జగిత్యాల జిల్లాను ఆరెంజ్‌ జోన్‌ పరిధిలోకి చేర్చారు.


నిజానికి పాజిటివ్‌ కేసు బయటపడిన తర్వాత, 24 రోజుల్లో ఒకటి కూడా పాజిటివ్‌ లేకపోతే ఆ జిల్లాను గ్రీన్‌జోన్‌లోకి మార్చుతున్నారు. జగిత్యాల జిల్లా వంజరిపల్లెలో ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌ ఏప్రిల్‌ 15న బయటపడింది. అయితే తాజా పరీక్షల్లో బాలుడికి కరోనా నెగెటివ్‌ వచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకు న్నాడు. జిల్లాలో ప్రస్తుతానికి పాజిటివ్‌ కేసులు లేనప్పటికీ అధికారులు  అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ రవి ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలపై రోజువారీగా సమీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వరకు పెంచుతూనే ఒక్కో జిల్లాను జోన్‌లుగా విభజించి కొన్ని సడలింపులు ఇచ్చింది.


ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుండగా, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి జిల్లాలో లాక్‌డౌన్‌ యథావిధిగానే కొనసాగుతుంది. ఎప్పటిమాదిరిగానే జిల్లా సరిహద్దు ప్రాంతాలను మూసివేశారు. కేవలం నిత్యావసర సరుకుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అత్యవసరమైనవారు పనికి వెళ్లేందుకు పోలీస్‌ శాఖ నుంచి పాస్‌లు ఇస్తున్నారు. అయితే భౌతిక దూరం విషయంలో కొంత నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ బాగానే అమలు జరుగుతున్నా, పట్టణ ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కొనుగోళ్లు, కూరగాయల మార్కెట్‌ల వద్ద నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


నిబంధనల సడలింపు

జగిత్యాల జిల్లా ఆరెంజ్‌ జోన్‌ పరిధిలోకి వెళ్లగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ రవి కొన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్టోన్‌ క్రషర్‌తో పాటు ఇటుకల తయారీ యథావిధిగా భౌతిక దూరం పాటిస్తూ చేసుకోవాలని వెసులుబాటు కల్పించారు. పట్టణ ప్రాంతాలకు ఎలాంటి మినహాయింపులు లేకపోగా, యథావిధిగానే లాక్‌డౌన్‌ పాటించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత పరిధిలో రిపేర్‌ షాపులు, బీడీల తయారీ, శానిటరీ షాపులు, టైల్స్‌, రూప్‌ టైల్స్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, జిన్నింగ్‌ మిల్స్‌, ఐరన్‌, స్టీల్‌ ఇండస్ర్టీలు, ప్లాస్టిక్‌, శానిటరీ పైపులు, ప్లాస్టిక్‌, రబ్బర్‌ ఇండస్ర్టీస్‌, కన్‌స్ట్రక్షన్‌ వర్క్‌లకు అనుమతి ఇచ్చారు.


అయితే ఇక్కడ కూడా సామాజిక దూరం పాటించడంతో పాటు కార్మికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, శానిటైజర్‌లతో చేతులు కడుక్కోవాలి. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కొంత ఊరట కలిగినట్లయింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరి కోతలతో పాటు కొనుగోళ్లు జోరందుకోగా, రైస్‌మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. తాజా నిబంధనలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వెసులుబాటు లభించినట్లయింది.


వలస కార్మికులకు ఊరట

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపేందుకు వెసులుబాటు కల్పించారు. జగిత్యాల జిల్లాలో 9,125 మంది వలస కార్మికులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు 3,338 మంది ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 2,450 మంది, మహారాష్ట్రకు చెందినవారు 1,328 మంది ఉన్నారు. బీహార్‌ రాష్ట్రానికి చెందినవారు 365 మంది, ఛత్తీ్‌స్‌ఘడ్‌కు చెందిన 232 మంది, ఢిల్లీకి చెందినవారు 14 మంది, గుజరాత్‌కు చెందినవారు 32 మంది, జార్ఖండ్‌కు చెందినవారు 73 మంది, రాజస్థాన్‌కు చెందినవారు 139 మంది, తమిళనాడుకు చెందినవారు 37 మం ది,  ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు 557 మంది, హర్యానాకు చెందినవారు 67 మంది, కర్ణాటకకు చెందినవారు 14 మంది, మధ్యప్రదేశ్‌కు చెందినవారు 404 మంది, పంజాబ్‌కు చెందిన ఆరుగురు, పశ్చిమబెంగాల్‌కు చెందిన 69 మంది ఉన్నారు.


అయితే ఈ వలస కూలీలంతా తమ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చునని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశా రు. ఇందుకోసం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో జిల్లా స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించారు. కార్మికులు వెళ్లాలనుకుంటే తహసీల్దార్‌ కార్యాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.


Updated Date - 2020-05-03T07:06:34+05:30 IST