జిల్లా ఆరెంజ్‌ జోన్‌

ABN , First Publish Date - 2020-05-02T10:54:11+05:30 IST

రాష్ట్రంలోనే మొట్టమొదటి రెడ్‌జోన్‌ను ఏర్పాటు చేసిన కరీంనగర్‌ జిల్లా ఇప్పుడు ఆరెంజ్‌ జోన్‌లోకి మారింది. గత 18 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాక పోవడంతో ఇక్కడి ప్రజలు

జిల్లా ఆరెంజ్‌ జోన్‌

  • త్వరలో గ్రీన్‌జోన్‌కు మారే అవకాశం 
  • చికిత్సలో ఉన్న పాజిటివ్‌ కేసు ఒక్కటే...
  •  శ్వాస సంబంధిత వ్యాధుల కోసం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
  • అందుబాటులో 10 ఐసీయు బెడ్స్‌...4 వెంటిలేటర్లు 
  • పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు సడలింపు వస్తుందనే ఆశలు 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్రంలోనే మొట్టమొదటి రెడ్‌జోన్‌ను ఏర్పాటు చేసిన కరీంనగర్‌ జిల్లా ఇప్పుడు ఆరెంజ్‌ జోన్‌లోకి మారింది. గత 18 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాక పోవడంతో ఇక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గత నెల 18వ తేదీన చిట్టచివరి పాజిటివ్‌ కేసు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాను రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌జోన్‌లోకి మార్చింది. ప్రస్తుతం జిల్లాలో కరోనా చికిత్సపొందుతున్నది ఒక్కరే కావడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 21 రోజుల వరకు కొత్తగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాక పోతే జిల్లాను గ్రీన్‌జోన్‌లోకి మార్చే అవకాశమున్నది. రాష్ట్రంలో గత మార్చి 2వ తేదీన మొదటి కరోనా కేసు నమోదైంది. మార్చి 17వ తేదీన ఇక్కడ మొదటి కరోనా కేసు నమోదు కాగా ఆ మరుసటి దినం మరో ఏడు కేసులు వచ్చాయి.


దీనితో దేశంలోనే మొట్టమొదటిసారిగా కరీంనగర్‌లో రెడ్‌జోన్‌ ఏర్పాటు చేశారు. మర్కజ్‌లో లింక్‌ ఐదుగురికి, ఇండోనేషియన్లతో 14 మందికి కరోనా రావడంతో మొత్తం జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. వీరిలో 10 మంది ఇండోనేషియన్లతోపాటుస్థానికులు ఎనిమిది మంది కూడా చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక వ్యక్తి మాత్రమే ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. ఈనెల 3న కేంద్రం లాక్‌డౌన్‌, 7న రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గడువు పూర్తయ్యేలోగా కరీంనగర్‌ గ్రీన్‌జోన్‌లోకి మారుతుందని ఆశిస్తున్నారు. 


 జిల్లా ఆసుపత్రిలో శ్యాసకోశ వ్యాదుల వార్డు ఏర్పాటు : 

 శ్వాసకోస సంబంధమైన వ్యాధులు ఉన్నవారికి చికిత్స ఇవ్వడానికి ఏ వైద్యుడూ ముందుకు రావడం లేదు. కరోనా ఉందేమోనన్న అనుమానంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల వారు వారిని కనీసం ఆసుపత్రిలోకి కూడా రానివ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని నివారించి వ్యాధిగ్రస్థులను ఆదుకోవడానికి ప్రభుత్వం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కొత్తగా ప్రత్యేక వార్డును నెలకొల్పింది. 10 ఐసీయూ పడకలు, 10 స్టెప్‌డౌన్‌ బెడ్స్‌, 4 వెంటిలేటర్లు, 2 సెల్ఫ్‌ ఆక్సీజన్‌ పంపింగ్‌ మిషన్లు, 4 మానిటర్లను ఈ ప్రత్యేక వార్డులో ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఒక ఫిజీషియన్‌తోపాటు శ్వాసకోస సంబంధిత నిపుణుడు, ఒక అనస్తీషియా డాక్టర్‌, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. వైద్య బృందాలు స్ర్కీనింగ్‌ చేసే సమయంలో కరోనా వ్యాధి లక్షణాలతో శ్వాసకోస సంబంధ వ్యాధి లక్షణాలతో ఎవరైనా ఉంటే వారిని ఈ వార్డుకు తరలిస్తారు.  


మంత్రి ఈటెలతో ఐఎంఏ అధ్యక్షుడి భేటీ : ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ ప్రారంభానికి చర్యలు 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎడవెల్లి విజయేంద్రరెడ్డి శుక్రవారం కలిసి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలందించే విషయమై చర్చించారు. అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను ప్రారంభించే విషయమై మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో సాంకేతిక కమిటీ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను పునరుద్ధరించేందుకు అవసరమైన మార్గదర్శక సూత్రాలను సిద్ధం చేస్తుందని మంత్రి వివరించినట్లు విజయేంద్రరెడ్డి వెల్లడించారు. అలాగే ప్రైవేట్‌ వైద్యులందరూ తమతమ ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్య సేవలందించేందుకు సంసిద్ధులు కావాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య సాంకేతిక కమిటీతో జిల్లా స్థాయిలో కోవిడ్‌ కమిటీలను ఏర్పాటు చేసే విషయమై కూడా మంత్రితో విజయేంద్రరెడ్డి చర్చించారు. 


పరిశ్రమలు, వ్యాపారాలకు సడలింపు ఉండే అవకాశం 

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17వరకు  పొడగించినా కొన్ని పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు మినహాయింపులు ఇచ్చే అవకాశమున్నది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17వ తేదీకి పొడగించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ పొడగించడంతోపాటు  ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాలు తొలగించేందుకు చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. అలాగే ఉద్యోగులకు, కూలీలకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకునేందుకు వీలుగా సడలింపు ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ఆహార పదార్థాలకు సంబంధించిన తయారీ పరిశ్రమలకు వెసులుబాటు కల్పించింది.  

Updated Date - 2020-05-02T10:54:11+05:30 IST