‘నివర్‌’ తుపాను సాయం రూ.600 కోట్లు ఎక్కడ?

ABN , First Publish Date - 2021-01-17T16:32:15+05:30 IST

‘నివర్‌’ తుఫాను నివారణకు అందిస్తామన్న రూ.600 కోట్లు ఏమయ్యాయని

‘నివర్‌’ తుపాను సాయం రూ.600 కోట్లు ఎక్కడ?

  • ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి : స్టాలిన్‌ డిమాండ్‌


చెన్నై : ‘నివర్‌’ తుఫాను నివారణకు అందిస్తామన్న రూ.600 కోట్లు ఏమయ్యాయని, కేంద్రప్రభుత్వాన్ని కోరిన రూ.3,758 కోట్ల పరిస్థితి ఏంటని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం అందించాలని ఆయనడిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు హఠాత్తుగా కురిసిన మార్గళి వర్షాలతో నీటమునిగి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని, సంక్రాంతి పండుగ రోజున ఇళ్లలో ధాన్యం బస్తాలతో ఆనందంగా గడపాల్సిన అన్నదాతలు ప్రస్తుతం సర్వస్వం కోల్పోయి ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.


‘నివర్‌’ తుపాను నష్టంతో కోలుకోలేని రైతులను ప్రస్తుత వర్షాలు మరింత గా బాధించాయని పేర్కొన్నారు. రైతులకు పరిహారంగా ఎకరాకు రూ.30 వేలు అందించాలని తాను డిమాండ్‌ చేయగా, హెక్టారుకు రూ.20 వేలు అందిస్తామనే ప్రభుత్వ ప్రకటన రైతులను నిరాశపరిచిందన్నారు. మార్గళి వర్షాలతో తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, పుదుకోట, తిరుచ్చి, శివగంగ, రామనాథపుం, తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరువళ్లూర్‌ తదితర 14 జిల్లాల్లో పంటలు నీట మునిగాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-01-17T16:32:15+05:30 IST