Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరి వద్దు

అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రం

యాసంగిపై తేల్చిచెబుతున్న అధికారులు

నేటి నుంచి గ్రామగ్రామాన అవగాహన

ప్రత్యామ్నాయ పంటలపై ప్రచారం

ఎటూ తేల్చుకోలేకపోతున్న రైతులు

జిల్లాలో పుష్కలంగా నీటి వనరులు

పెసర, మినుము, కూరగాయలు, జొన్న పంటపై దృష్టి


యాసంగిలో వరిసాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఈరోజు నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. యాసంగిలో సాగుచేసిన వడ్ల కొనుగోళ్లకు బ్రేక్‌ పడడానికి గల కారణాలు, ప్రత్యామ్నాయ పంటలతో వచ్చే లాభాలపై ప్రచారం చేయనున్నారు.  


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 29 : సిద్దిపేట జిల్లాలో 3.34 లక్షల ఎకరాల పంట విస్తీర్ణం ఉండగా.. గత యాసంగి సీజన్‌లో 2.83 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈ లెక్కన సుమారు 85 శాతం వరి పంటపైనే నాడు రైతులు దృష్టి పెట్టారు. ఈసారి వరిసాగుకే సుముఖంగా ఉన్నప్పటికీ.. అంతా రివర్సయ్యింది. వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచనలు చేస్తున్నది. 


ఇప్పటికీ 25 వేల ఎకరాల్లోనే సాగు

జిల్లాలో ఇప్పటికే లక్ష ఎకరాల వరకు వరి పంట కోసం నారు సిద్ధం చేసేవారు. అయితే అయోమయ పరిస్థితులతో ఎక్కడ చేయలేదు. పొద్దుతిరుగుడు, పెసలు, మినుములను మాత్రం 25 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అంచనా. ఇంకా 3 లక్షల ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణం చేయాల్సి ఉంది. 


కరపత్రాలతో ప్రచారానికి రెడీ

జిల్లాలోని రైతులందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించారు. వీటిని జిల్లాలోని ఏవోలు, ఏఈవోలకు చేరవేశారు. నేటి నుంచి ఈ కరపత్రాలతో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వద్దకు వెళ్లనున్నారు. వరిసాగు చేసే రైతులంతా ప్రస్తుతం వానాకాలం ధాన్యం విక్రయించడం, దానిని ఆరబెట్టడం, కోతలతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారిని కదిలించడం సాహసమే అవుతుందని జంకుతున్నారు. కరపత్రాల్లో వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఇందులో ఏయే రకాల విత్తనాలు, ఎన్ని క్వింటాళ్ల దిగుబడి, పంట కాలం తదితర అంశాల గురించి వివరించారు. కాగా వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం పంట విత్తనాలు వేసే సమయం మించిపోయినా.. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం డిసెంబరు 15వరకు నాటవచ్చని చెబుతున్నారు. అదే విధంగా కూరగాయల సాగుపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో కూరగాయల సాగుకు పూర్తిగా అనుకూలమని ప్రచారం చేస్తున్నారు.  


రైతులపై పంట మార్పిడి భారం

ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులపై ఆర్థిక భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొలం మడి నుంచి భూమిని ఆరుతడి పంటల వైపుగా మార్చాలంటే రెండు సార్లు దున్నడం, ఓసారి రోటవేటర్‌తో చదును చేయాలి. దీనికి ఎకరాకు రూ.2 వేల పైచిలుకు ఆర్థికభారం పడుతుందని రైతులు అంటున్నారు. అదే విధంగా వేరుశనగ, శనగ, మినుములు, పెసర పంటల సాగు చేయడం ఒక ఎత్తయితే వీటిని కోతులు, అడవి పందుల నుంచి కాపాడుకోవం మరో ఎత్తుగా చెబుతున్నారు. ఇక కూరగాయల ధరలు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుండగా.. రైతులంతా కూరగాయలే సాగు చేస్తే పెట్టుబడి దక్కుతుందా అనే అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల మార్కెటింగ్‌ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కొందరు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


Advertisement
Advertisement