కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2021-09-13T07:19:21+05:30 IST

ఆస్పత్రుల వద్ద హడావుడి తగ్గింది.. పడకల కోసం ఆరాటం కనిపించడం లేదు.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌లు పెరిగాయి.. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది.

కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు
డీఎంహెచ్‌వో శ్రీహరి

 ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలి

 డీఎంహెచ్‌వో శ్రీహరి


చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 12: ఆస్పత్రుల వద్ద హడావుడి తగ్గింది.. పడకల కోసం ఆరాటం కనిపించడం లేదు.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌లు పెరిగాయి.. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది.. ఇంటి వద్దనే చికిత్స తీసుకుని కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ చూసి కొవిడ్‌ రెండో వేవ్‌ ఉధ్రుతి తగ్గినట్టేనని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తిగా క్రియారహితంగా మారలేదని గుర్తు చేస్తున్నారు. మూడో వేవ్‌ రానుందన్న హెచ్చరికలను గుర్తు పెట్టుకోవాలంటున్నారు. కర్ఫ్యూ సడలించడంతో జనసంచారం పెరిగిందని, కాబట్టి బయట తిరిగేవారు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు మూడో వేవ్‌ పొంచివుందన్న హెచ్చరికలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అవుతోంది. మూడో వేవ్‌కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసిన కార్యాచరణ గురించి డీఎంహెచ్‌వో శ్రీహరి ఆంధ్రజ్యోతికి వివరించారు.


? కొవిడ్‌ మూడో వేవ్‌ తీవ్రత చిన్న పిల్లలపై అధికంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది

! జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ వేగం పెంచాం. రెండు వారాల క్రితమే 18ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సినేషన్‌ ప్రారంభించాం. ఇక టీకాలు వేసుకోకుండా మిగిలింది చిన్నపిల్లలే కాబట్టి మూడో వేవ్‌లో వారే ఎక్కువగా వైరస్‌ బారిన పడే అవకాశం ఉంటుందన్న అంచనాలున్నాయి.


? వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో అధిక శాతం కొవిడ్‌ కేర్‌ సెంటర్లు మూతపడ్డాయి. మూడో వేవ్‌ వస్తే పరిస్థితి ఏంటి

! జిల్లాలో ఏ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ మూతపడలేదు. గత నెల వరకు జిల్లాలో 46 కొవిడ్‌ ఆస్పత్రులు, 24 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 14 కొవిడ్‌ ఆస్పత్రులు, 12 కొవిడ్‌ సెంటర్లలో కేసుల సంఖ్య తగ్గడంతో తాత్కాలికంగా సేవలు నిలిపివేశాం. వాటిలోని సిబ్బందిని, వైద్యులను ఇతర సెంటర్లకు బదిలీ చేశాం. కేసుల సంఖ్య పెరిగితే తిరిగి వాటిలోనూ సేవలను పునఃప్రారంభిస్తాం. ప్రస్తుతం 32 కొవిడ్‌ ఆస్పత్రులు, 12 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. 


? మూడో వేవ్‌ ఎదుర్కోవడానికి ఎంతమంది వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు

! చిన్నపిల్లలపై మూడో వేవ్‌ ఎక్కువ ప్రభావం చూపొచ్చని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలతో మేము అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకు చిన్నపిల్లల కోసం పీడియాట్రిక్‌ బెడ్లు సుమారు 400 వరకు సిద్ధం చేశాం. ఇందులో రూయాలో 130 బెడ్లు, స్విమ్స్‌లో 100, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 50, మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 50, సీహెచ్‌సీల్లో 5 నుంచి 10 బెడ్లు వరకు సిద్ధం చేశాం. ఇందులో అన్ని రకాల మందులు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లతో కూడిన బెడ్లు అందుబాటులో ఉంచాం. చిన్న పిల్లల వైద్యం కోసమే 16 మంది స్పెషలిస్టులు, 75 మంది పీడియాట్రీషయన్లు, 120 మంది స్టాఫ్‌నర్సులను  కొత్తగా నియమించుకున్నాం. 


? మూడో వేవ్‌ను వస్తే ఎదుర్కోవడానికి ఎలాంటి కార్యచరణ చేశారు

! మూడో వేవ్‌లో ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో కొవిడ్‌ ఆస్పత్రుల్లో మొత్తం 4888 బెడ్లు ఉన్నాయి. అందులో ఐసీయూ 589, ఆక్సిజన్‌ బెడ్లు 2378, సాదారణ బెడ్లు 1921 అందుబాటులో ఉన్నాయి. అలాగే కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 3479 బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. మూడో వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతి పీహెచ్‌సీలో రెండు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ప్రతి సీహెచ్‌సీలో 50 ఆక్సిజన్‌ బెడ్లు సిద్ధం చేశాం. ఇందు కోసం 2 వేల ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చుకున్నాం. రూయా, స్విమ్స్‌, జిల్లా ఆస్పత్రులైన చిత్తూరు, మదనపల్లెల్లోనూ ఆక్సిజన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా కొవిడ్‌ సేవల కోసం 16 మంది స్పెషలిస్టు వైద్యులు, 612 మంది వైద్యులు, 616 మంది స్టాఫ్‌నర్సులు, 913 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

Updated Date - 2021-09-13T07:19:21+05:30 IST