National Crisisలో జైశంకర్ మంత్రం ఏమిటో తెలుసా?

ABN , First Publish Date - 2021-05-01T17:37:36+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయం ప్రజానీకాన్ని

National Crisisలో జైశంకర్ మంత్రం ఏమిటో తెలుసా?

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయం ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ జాతీయ సంక్షోభం నుంచి చాకచక్యంగా గట్టెక్కడం కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధానంగా ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌లపై దృష్టి పెట్టారు. ఈ మంత్రమే ప్రస్తుత విలయానికి విరుగుడు అని గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకు తగినట్లుగా విదేశాలతో చర్చలు జరుపుతున్నారు. 


జైశంకర్ గురువారం విదేశాల్లోని భారతీయ దౌత్యాధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌లను మన దేశానికి రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జనవరి 16 నుంచి మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత కొన్ని దేశాలకు వ్యాక్సిన్లను బహుమతిగా ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తూ, ఈ వ్యాక్సిన్ మైత్రి వల్ల మన దేశానికి మంచి పేరు వచ్చిందని, ఈ కష్టకాలంలో ఈ మంచి పేరు మనకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ స్నేహ భావాన్ని మనకు అవసరమైన వైద్య సహకారాన్ని పొందడానికి అనుకూలంగా మలచుకోవాలని కోరారు. 


అంతకుముందు జైశంకర్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌తోనూ, చైనీస్ స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యీతోనూ వర్చువల్‌ పద్ధతిలో చర్చలు జరిపారు. ఈ మహమ్మారిపై భారత దేశం చేసే పోరాటంలో సంపూర్ణంగా సహకరిస్తామని బ్లింకెన్ హామీ ఇచ్చారు. వాంగ్ యీతో జరిగిన సమావేశంలో భారత దేశానికి అవసరమైన ఔషధాలు, పరికరాల సరఫరాకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను ఉపసంహరించాలని, ప్రత్యేక విమానాల ద్వారా పరికరాలను పంపించాలని కోరారు. దీనిపై చైనా లిఖితపూర్వకంగా స్పందించవలసి ఉంది. 


జైశంకర్ శనివారం సింగపూర్, థాయ్‌లాండ్ మంత్రులతో వర్చువల్ పద్ధతిలో చర్చలు జరుపుతారని సమాచారం. కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశ పోరాటానికి సహకరిస్తున్న సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌కు ధన్యవాదాలు చెబుతారని తెలుస్తోంది. మన దేశానికి ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేయడంలో థాయ్‌లాండ్ నిర్వహించిన పాత్రను కూడా మోదీ ప్రభుత్వం ప్రశంసించి, ధన్యవాదాలు తెలిపింది.




Updated Date - 2021-05-01T17:37:36+05:30 IST