చిరుద్యోగుల జీతాలతో దోబూచులాట!

ABN , First Publish Date - 2021-12-07T05:41:22+05:30 IST

అంబేడ్కర్‌ దూరవిద్య కేంద్రం పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాటాడుతోంది.

చిరుద్యోగుల జీతాలతో దోబూచులాట!
మద్దిలపాలెంలోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రాంతీయ కార్యాలయం

అంబేడ్కర్‌ దూరవిద్య కేంద్రం పార్ట్‌టైమ్‌  ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ను విడుదల  చేయని రాష్ట్ర ప్రభుత్వం

20 నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అటెండర్లు, గుమస్తాలు 

మద్దిలపాలెం, డిసెంబరు 24: అంబేడ్కర్‌ దూరవిద్య కేంద్రం పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాటాడుతోంది. తెలంగాణ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రధాన కేంద్రానికి పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల వేతనాల బడ్జెట్‌ను మంజూరు చేయకుండా మొండిచేయి చూపుతోంది. దీంతో ఏపీలో పని చేస్తున్న అంబేడ్కర్‌ దూరవిద్య కేంద్రం పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు సుమారు ఇరవై నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. 2020 ఫిబ్రవరి నుంచి జీతాలు ఇవ్వకపోయినా ప్రతీనెలా వస్తాయనే ఆశతో ఈ చిరుద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికి ఇరవై నెలలు గడిచినా వేతనాలు అందకపోవడంతో వారు నానాపాట్లు పడుతున్నారు. పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న అటెండర్లకు నెలకు రూ.4,500, గుమాస్తాలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ వేతన బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా అంబేడ్కర్‌ దూరవిద్య కేంద్రాన్ని తెలంగాణకు 42 శాతం, ఆంధ్రాకు 58 శాతం కేటాయించారు. అయితే ఏడేళ్లయినా ఏపీ దూరవిద్య కేంద్రానికి రాష్ట్రానికి తరలించలేదు. తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఇది ఉన్నందున ఏపీలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. ఏపీ ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో వేతనాలను నిలిపివేశారు. రాష్ట్రంలో 92 అంబేడ్కర్‌ దూరవిద్య కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో సుమారు 450 మంది అటెండర్లు, గుమాస్తాలు పార్ట్‌టైమ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కాగా ఏపీ నుంచి ఏటా సుమారు రూ.మూడు కోట్ల వరకు విద్యార్థుల ఫీజుల రూపేణా తెలంగాణలోని ప్రధాన కార్యాలయానికి అందుతున్నాయి. ఇంత మొత్తంలో ఫీజులు పొందుతున్నా పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు జీతాలను మాత్రం చెల్లించడం లేదు. తమకు జీతాలు చెల్లించాలంటూ ఉద్యోగులు పలుమార్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేస్తేనే వేతనాలు చెల్లిస్తామని బదులివ్వడంతో తమ ఇబ్బందులకు ఎవరికి చెప్పాలో తెలియక వారు మిన్నకుండిపోయారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి లేదా ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళితే జీతాల సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని పలువురు ఉన్నతాధికారులు సలహా ఇచ్చినప్పటికీ.. వారిని కలిసి వినతిపత్రం అందించే పలుకుబడి తమకు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ జీతాల బడ్జెట్‌ను విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2021-12-07T05:41:22+05:30 IST